Andhra Pradesh Assembly : ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి నిరవధిక వాయిదా
ఏపీ అసెంబ్లీ, శాసనమండలి నిరవధిక వాయిదా; 23 బిల్లులకు అసెంబ్లీ, 6 బిల్లులకు మండలి ఆమోదం తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శనివారం నాడు నిరవధికంగా వాయిదా పడింది. ఎనిమిది రోజుల పాటు అసెంబ్లీసమావేశాలు జరిగాయి.23 బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలుత ఈ నెల 30 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. ఆ తర్వాత ఈ సమావేశాలను ఈ నెల 27 వరకు కుదించారు. జీఎస్టీ సంస్కరణలు, జలవనరుల అంశం, శాంతి భద్రతలు, వైద్య, ఆరోగ్యం, పరిశ్రమలు, సూపర్ సిక్స్, క్వాంటం వ్యాలీ, లాజిస్టిక్స్ అంశాలపై ఏపీ అసెంబ్లీలో చర్చించారు. ఎనిమిది రోజుల వ్యవధిలో 45 గంటల పాటు పలు అంశాలపై చర్చలు జరిగాయి. శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లులన్నీ ఏకగ్రీవంగా ఆమోదం పొందాయని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు చెప్పారు. ఇవాళ అసెంబ్లీ సమావేశాల చివరి రోజున సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే అంశంపై జరిగిన లఘు చర్చకు ఏపీ సీఎం చంద్రబాబు సమాధానం ఇచ్చారు.
మరో వైపు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి కూడా నిరవధికంగా ఇవాళ వాయిదా పడింది. ఏపీ శాసనమండలి ఆరు బిల్లులకు ఆమోదం తెలిపింది. అంతర్జాతీయ వర్శిటీ ఏర్పాటు బిల్లు -2025, న్యాయ విద్య, పరిశోధన కోసం అమరావతిలో భారత అంతర్జాతీయ వర్శిటీ ఏర్పాటు చేయాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఏపీ పబ్లిక్ సర్వీసులకు నియామకాల నియంత్రణ, వేతన సరళీలకరణ బిల్లు 2025 కు ఆమోదం లభించింది. ఏపీ జీఎస్టీ బిల్లు సవరణకు శాసనమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బిల్లులు ఆమోదం పొందిన తర్వాత ఏపీ శాసనమండలి వాయిదా వేస్తున్నట్టు మండలి ఛైర్మన్ మోషేన్ రాజు తెలిపారు.