Seethakka | అంగన్వాడి, ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారానికి కృషి
అంగన్వాడి, ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి సీతక్క తెలిపారు. ములుగులో రేషన్ కార్డులు పంపిణీ చేశారు.

విధాత, వరంగల్ ప్రతినిధి: రాష్ట్రంలోని అంగన్వాడి, ఆశా వర్కర్ల సమస్యలను విడతలవారీగా పరిష్కరించడానికి కృషి చేస్తానని రాష్ట్ర పంచాయతిరాజ్, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.
శనివారం ములుగులో అంగన్వాడి టీచర్లకు, ఆయాలకు మంత్రి యూనిఫామ్ లు పంపిణీ, రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
ఈ సందర్భాల్లో మంత్రి మాట్లాడుతూ అంగన్వాడి పాఠశాలలను మూసివేసే అవకాశం ఉందని ప్రచారంలో నిజం లేదన్నారు. ముఖ్యమంత్రి రాష్ట్రంలో అదనంగా పాఠశాలలను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నారని వివరించారు. అంగన్వాడి సెంటర్ లో పనిచేస్తున్న సిబ్బంది బాధ్యతాయుతంగా విధులను నిర్వహిస్తూ పిల్లలకు మంచి పౌష్టికాహారం అందే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రభుత్వ సహకారంతో మహిళా సంఘాల సభ్యులు విజయవంతంగా పలు వ్యాపారాలు నిర్వహిస్తూ ఆర్థికంగా ఎదుగుతున్నారని అన్నారు.
ములుగు నియోజకవర్గంలో పదివేల కు పైగా రేషన్ కార్డులను పంపిణీ చేశామని, పేదలందరికీ 200 యూనిట్ల ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నామని అన్నారు. అనంతరం మంత్రి బతుకమ్మ ఆడారు.
ఈ కార్యక్రమంలో మహేందర్ జీ, తుల రవి, ఫైజల్ హుస్సేనీ, ప్రజా ప్రతినిధులు, సిడిపిఓలు, అంగన్వాడి టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.