#MEGA158 | బాస్ సినిమాకి మాస్ ట్విస్ట్..! మెగా అభిమానులకు మరోసారి షాక్..?
మెగాస్టార్ చిరంజీవి – బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న MEGA158 మళ్లీ చర్చల్లోకి ఎక్కింది. అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కాంబో మిస్సయినట్లు తెలుస్తోంది. లేడీ సూపర్‌స్టార్ అనుష్క ఈ చిత్రం నుండి తప్పుకున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.

#MEGA158 heroine change: Malavika to replace Anushka.?
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా #MEGA158 గురించి టాలీవుడ్‌లో హాట్ టాపిక్ నడుస్తోంది. బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ గురించి ఎప్పటి నుంచో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా సినిమా హీరోయిన్ ఎంపికపై పెద్ద ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
మొదట ఈ సినిమాలో హీరోయిన్‌గా జేజమ్మ అనుష్కను తీసుకోవాలని టీమ్ నిర్ణయించినట్టు సమాచారం. మెగాస్టార్ సరసన లేడీ సూపర్‌స్టార్ కనిపించబోతుందన్న వార్త బయటకు రావడంతో మెగా ఫ్యాన్స్ ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. “బాస్ – అనుష్క మాస్ కాంబినేషన్ దుమ్ము రేపుతుంది” అంటూ సోషల్ మీడియాలో రియాక్షన్లు వెల్లువెత్తాయి. కానీ, ఏమైందో ఏమో.. చివరికి ఈ కాంబినేషన్ సాధ్యం అవుతున్నట్లు లేదు. సంతోషంతో పొంగిపోతున్న అభిమానులపై టీమ్ నీళ్లు చల్లింది. అనుష్కను చిరంజీవికి జతగా చూడాలనుకున్న ఫ్యాన్స్‌కు మరోమారు నిరాశే ఎదురైంది.
ఏమైందో ఏమో కానీ, అనుష్క ఈ చిత్రంలోభాగం కావడం లేదని, చిత్రబృందం వేరే ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టారని తెలిసింది. తాజాగా అనుష్క స్థానంలో మాళవిక మోహనన్ పేరు ఖరారైనట్టు సమాచారం. ప్రభాస్‌తో కలిసి నటిస్తున్న ‘ది రాజా సాబ్’ తర్వాత ఇదే ఆమె రెండో తెలుగు సినిమా అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి అంటే మాస్ ఫ్యాన్స్‌కి పండగే. ఆయన సినిమా అంటే థియేటర్ల వద్ద హడావుడి తప్పదు. ఇపుడు ఆ బాస్ మరో భారీ ప్రాజెక్ట్‌తో సిద్దమవుతున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ సక్సెస్ తర్వాత దర్శకుడు బాబీ కొల్లితో మరోసారి జతకడుతున్నారు చిరు. ఈ కాంబినేషన్‌లో రాబోతున్న కొత్త సినిమాను తాత్కాలికంగా #MEGA158 గా పిలుస్తున్నారు. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తి కాగా, నవంబర్ 5న పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభం కానుంది. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకాబోతోంది.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ల ఎంపికపై ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం, ప్రభాస్‌తో కలిసి ‘ది రాజా సాబ్’ సినిమాలో నటిస్తున్న మాళవిక మోహనన్ను బాబీ – చిరు సినిమాకు హీరోయిన్‌గా పరిశీలిస్తున్నారని ఫిల్మ్ నగర్ టాక్. ఈ కాంబినేషన్ ఫైనల్ అయితే మాళవిక మోహనన్‌కి ఇది పెద్ద లక్కీ చాన్స్‌గా మారనుంది. ఇంకా ఈ చిత్రంలో రాశి ఖన్నా మరో హీరోయిన్‌గా నటించనున్నట్లు కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
‘వాల్తేరు వీరయ్య’లో మాస్ ఎలిమెంట్స్‌తో మెప్పించిన బాబీ, ఈ సారి కూడా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా సినిమాను తీర్చిదిద్దుతున్నారని సమాచారం. మెగాస్టార్‌కి తగిన స్టైల్, యాక్షన్, ఎమోషన్‌లతో కూడిన మాస్ ప్యాకేజీగా ఉండబోతుందట.
ఇక మాళవిక మోహనన్ విషయానికి వస్తే — ఆమె మలయాళం, తమిళం, హిందీ ఇండస్ట్రీల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్‌తో చేసిన ‘మాస్టర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. రజనీకాంత్ ‘పెట్టా’, విక్రమ్ ‘తంగళాన్’, ధనుష్ ‘మారన్’ చిత్రాల్లోనూ నటించారు. ప్రస్తుతం ప్రభాస్‌తో ‘ది రాజా సాబ్’లో నటిస్తుండగా, ఇప్పుడు చిరుతో జతకడతారని వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలోని ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అదీ కాక వశిష్ఠ దర్శకత్వంలోని ‘విశ్వంభర’ సినిమాను కూడా పూర్తి చేశారు. ఈ రెండు సినిమాల తర్వాత ఆయన బాబీ దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్‌పై దృష్టి సారించనున్నారు. మెగాస్టార్, బాబీ కాంబినేషన్‌లో మళ్లీ సినిమా రావడం ఫ్యాన్స్‌కు డబుల్ ఎగ్జైట్మెంట్ ఇచ్చింది. ఇక మాళవిక మోహనన్ పేరు చర్చలో ఉండటంతో, ఈ ప్రాజెక్ట్‌పై హైప్ మరింత పెరిగింది. త్వరలోనే అధికారిక ప్రకటన రావచ్చని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.
అనుష్క షెట్టి స్థానంలో మాళవిక మోహనన్.. రాశి ఖన్నా కూడా జత! మెగాస్టార్ చిరంజీవి – బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న MEGA 158లో హీరోయిన్ మార్పు హాట్ టాపిక్‌గా మారింది.