Bharathi and Jaya krishna Ghattamaneni : ఘట్టమనేని కొడుకు..కూతురు కూడా సినిమా ఎంట్రీ!
ఘట్టమనేని రమేష్ బాబు పిల్లలు జయకృష్ణ, భారతి టాలీవుడ్లో హీరో, హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుండటంతో అభిమానుల్లో భారీ ఆసక్తి పెరిగింది.

Bharathi and Jaya krishna Ghattamaneni | విధాత : సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ తనయుడు దివంగత రమేష్ బాబు కొడుకు, కూతురు తెలుగు సినిమాలలోకి ఎంట్రీ ఇవ్వబోతుండటం ఆసక్తికరంగా మారింది. సూపర్ స్టార్ మహేష్ బాబు అన్న రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ‘మంగళవారం’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ రాషా థాండన్ హీరోయిన్ గా ఎంపికైంది. ఇది ఇలా ఉండగానే ఇప్పుడు రమేష్ బాబు కూతురు భారతి కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతుండటం ఘట్టమనేని అభిమానులను సైతం ఆశ్చర్యపరిచింది. దర్శకుడు తేజ తన కుమారుడి అరంగేట్ర చిత్రంలో కథానాయికగా భారతిని ఎంచుకొన్నారు. దర్శకుడు తేజ తన కొడుకుతో ఒక సోషియో ఫ్యాంటసీ థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు భారతీ సరిగ్గా సరిపోతుందని తేజా భావించారట. భారతి పాత్రకు సంబంధించిన లుక్ టెస్టులు, వర్క్ షాపులు పూర్తి చేసిన తేజా ఆమెను హీరోయిన్ గా ఎంపిక చేశారట.
రామోజీ ఫిల్మ్ సిటీలో ఇటీవల ఈ సినిమాకు సంబంధించి కొంత మేర షూటింగ్ పూర్తి చేసినట్లుగా సమాచారం. టాలీవుడ్ కి ఎంతో మంది స్టార్ హీరోలను, హీరోయిన్లను పరిచయం చేసిన డైరెక్టర్ తేజ ద్వారా భారతి వెండితెరకు పరిచయం కాబోతుండటం ఆమెకు కలిసివస్తుందని ఘట్టమనేని ఫ్యామిలీ భావిస్తుంది. ఘట్టమనేని కుటుంబం నుంచి అన్నాచెల్లుళ్ళు ఇద్దరూ దాదాపు ఒకే సమయంలో సినిమాల్లోకి రావడం వారి అభిమానులలో ఉత్సాహాన్ని రేకెత్తించినట్లయ్యింది.