Jubilee Hills by-election| జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి గా నవీన్ యాదవ్!

విధాత,హైదరాబాద్ : గవర్నర్ కోటా ఎమ్మెల్సీ(Governor’s quota MLC) గా ప్రభుత్వం మహ్మద్ అజారుద్ధీన్ (Azharuddin)పేరును ఖరారు చేసిన నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో కాంగ్రెస్(Congress candidate), అభ్యర్థి ఎవరన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జూబ్లిహీల్స్ ఉప ఎన్నికల(Jubilee Hills by-election)లో కాంగ్రెస్ టికెట్ కోసం గట్టి ప్రయత్నం చేసిన అజారుద్ధీన్ ను అనూహ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీగా ఖరారు చేశారు. దీంతో ఈ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరన్న అంశం హాట్ టాపిక్ గా మారింది. శనివారం జరిగిన కేబినెట్ భేటీలో మంత్రులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ (Naveen Yadav) పేరును సూచించినట్లుగా సమాచారం. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి మజ్లిస్ అభ్యర్థిగా పోటీచేసిన నవీన్‌యాదవ్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు.
నవీన్ యాదవ్ అభ్యర్థి అయితే ప్రస్తుతం కాంగ్రెస్‌కు మిత్రపక్షంగా ఉన్న మజ్లిస్ పార్టీ నుంచి కూడా మద్దతు లభిస్తుందని భావిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీ ఓటర్లు కీలకంగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో నవీన్ యాదవ్ మజ్లిస్ పార్టీ నుంచి పోటీ చేసి 41వేల 656 ఓట్లు సాధించారు. ఆ తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో మజ్లిస్ బరిలో దింపక పోవడంతో పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయనకు 18వేల 817 ఓట్లు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరినా.. పార్టీ టికెట్ దక్కలేదు. ఈసారి టికెట్ తనకే దక్కుతుందని ఆయన భావిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు జూబ్లీహిల్స్ అసెంబ్లీ లేదా సికింద్రాబాద్ ఎంపీ సీటు హామీతో నవీన్ యాదవ్ కాంగ్రెస్‌లో చేరారు.
2023అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్తో ఉన్న అవగాహనలో భాగంగా మజ్లిస్ పోటీ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఉప ఎన్నికలో మైనార్టీలకే టికెట్ ఇవ్వదలుచుకుంటే తనకే ఇవ్వాలంటున్నారు ఫిరోజ్ ఖాన్. సీఎంకు అత్యంత సన్నిహితులైన ఫహీమ్ ఖురేషీ, ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, విజయారెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ పేర్లు కూడా రేసులో వినిపిస్తున్నాయి.
జూబ్లీహిల్స్ స్థానంలో గత ఎన్నికల్లో మాగంటి గోపినాథ్ 80,549 ఓట్లు సాధించగా, సమీప కాంగ్రెస్ అభ్యర్థి అజాహరుద్దీన్కు 64,212 ఓట్లు వచ్చాయి. 16,337 ఓట్లతో ఆధిక్యంతో మాగంటి గోపినాథ్ హ్యాట్రిక్ విజయం సాధించారు. ఆయన ఆకస్మిక మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. త్వరలో జరగనున్న ఉపఎన్నికల్లో మాగంటి కుటుంబ సభ్యులకే టికెట్ ఇచ్చే యోచనలో బీఆర్ఎస్ పెద్దలు ఉన్నట్టు సమాచారం. 2023అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కిన బీఆర్‌ఎస్‌కు 43.94 శాతం ఓట్లు లభిస్తే కాంగ్రెస్ 35.03 శాతం ఓట్లతో రెండో స్థానానికి పడిపోయింది. లోక్‌సభ ఎన్నికల నాటికి కాంగ్రెస్ ఇక్కడ తన ఓటు శాతాన్ని 50.83కు పెంచుకోగలిగింది. పెరిగిన ఓటు బ్యాంకు ఉప ఎన్నికల్లో పునరావృత్తమై విజయం తధ్యమని కాంగ్రెస్ నమ్ముతుంది.