టాలీవుడ్లో వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ ప్రేక్షకులకి మంచి వినోదం పంచే హీరోలలో నాని ఒకరు. ఆయన దసరా చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టి అదే ఉత్సాహంతో హాయ్ నాన్న అనే సినిమా చేశారు. యువ డైరెక్టర్ శౌర్యువ్ తెరకెక్కించిన ఈమూవీలో మరోసారి తండ్రి పాత్రలో కనిపించి అందరి మనసులు కొల్లగొట్టాడు నాని. ఇందులో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించగా, కూతురి పాత్రలో కియారా ఖన్నా అనే చిన్నారి నటించింది. ఈ చిత్రం తండ్రి కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు డిసెంబర్ 7న రాగా, మూవీకి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. మన దగ్గరే కాకుండా వేరే దేశాలలో కూడా ఈ మూవీని ఆదరిస్తున్నారు.
అమెరికాలో హాయ్ నాన్న సినిమా అదరగొట్టేస్తుంది. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ సినిమా దాదాపు ఒక మిలియన్ డాలర్స్ రాబట్టినట్లు సమాచారం. చిత్రంలో తండ్రీకూతురి ప్రేమకు నిజజీవితంలో అడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. ఆస్ట్రేలియాలో ఓ తండ్రి కూతుళ్లు సినిమా చూసి చాలా ఎమోషనల్ అయ్యారు. సినిమా చూసిన అనంతరం ఒక బాలిక తన తండ్రిని గట్టిగా హత్తుకుని కంటతడి పెట్టుకుంది. తన కూతురిని ఓదారుస్తూ ఆ తండ్రి కూడా భావోద్వేగానికి గురికాగా, ఆ క్షణాలని తన కెమెరాలో బంధించిన నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నానికి ట్యాగ్ చేసారు.
‘నాని గారు, మూవీ చాలా బాగుంది. చూసిన వాళ్లందరినీ ఎంతగానో కదిలించింది. ఎంతో మంది తండ్రీ కూతుళ్ళ మధ్య బంధాన్ని బలోపేతం చేస్తుంది. ఇలాంటి మంచి సినిమాను ఎంచుకున్నందుకు చాలా థాంక్స్. ‘ అంటూ రాసుకొచ్చాడు. మరో కామెంట్ లో ‘సిడ్నీ థియేటర్లో సినిమా చూసి బయటికి రాగానే తన నాన్న ప్రేమ గుర్తొచ్చి గట్టిగా హత్తుకున్న మా శ్రేష్ఠ, వాళ్ళ నాన్న శివ చుట్టూ ఉన్న అందరినీ అందరినీ కంట తడి పెట్టేలా చేశారు. ఇలాంటి మధుర జ్ఞాపకాన్ని ఇచ్చినందుకు శౌర్యువ్ గారికి మనస్పూర్తిగా ధన్యవాదాలు’ అంటూ రాసుకొచ్చాడు. అయితే నాని ఆ తండ్రి కూతుళ్ల ప్రేమకి ఫిదా అవుతూ.. ‘ఇది కథా ఆస్తి’ అంటూ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది.