Janaki Vs State of Kerala | జానకి వర్సెస్ సెన్సార్ బోర్డ్ ఆఫ్ కేరళ
Janaki Vs State of Kerala | ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ అనే మలయాళ చిత్రం పేరులో మార్పులు చేయాలన్న సెన్సార్ బోర్డు (CBFC) ఆదేశంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ, కేరళ హైకోర్టు ఈ సినిమాను తాము స్వయంగా వీక్షించాకే తుది తీర్పు వెలువరించనున్నట్లు ప్రకటించింది. నటుడు సురేష్ గోపి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా జూన్ 27న విడుదల కావాల్సి ఉండగా, సర్టిఫికేషన్ జాప్యం వల్ల విడుదల వాయిదా పడింది.

- సెన్సార్ బోర్డు ‘పేరు మార్పు’ నిర్ణయంపై వివాదం
- ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ను వీక్షించనున్న న్యాయమూర్తి
- అనంతరమే పేరుమార్పుపై తీర్పు
Janaki Vs State of Kerala | సినిమా పేరులో ‘జానకి’ అనేపేరును తీసేయాలని సెన్సార్ బోర్డు సూచించగా, కుదరదన్న నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు. ఇది భావప్రకటనా స్వేచ్ఛను కాలరాసే చర్య అని అభిప్రాయపడుతూ చిత్ర పరిశ్రమ వర్గాలు, కళాకారులు, దర్శక నిర్మాతల సంఘాలు సెన్సార్ బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సినిమా కథ న్యాయవ్యవస్థలో న్యాయం కోసం పోరాడే లైంగిక వేధింపుల బాధితురాలు జానకి చుట్టూ తిరుగుతుండటంతో, సినిమా శీర్షికను తప్పుగా తీసుకోవడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు.
ఈ కేసును విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగరేష్, “జానకి నేరస్థురాలు కాదు. ఆమె ఓ బాధితురాలు. రాముడు, కృష్ణుడు, జానకి లాంటి దేవతల పేర్లను నేరస్తులకు పెట్టడం తప్పు అనిపించొచ్చు కానీ, ఇక్కడ ఆమెన్యాయం కోసం పోరాటం చేసే పాత్ర. అలాంటప్పుడు జానకి పేరుతో ఏం సమస్య?” అంటూ బోర్డును ప్రశ్నించారు.
కోర్టు సినిమాను పూర్తిగా వీక్షించి, విషయపరంగా నిజంగా ఏమైనా అభ్యంతరకరంగా ఉన్నదా?లేదా? అని తెలుసుకున్న తరువాతే తీర్పు చెప్పాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయంతో విచారణను వాయిదా వేసింది. నిర్మాతలు ఏర్పాటు చేసే స్టూడియోలో న్యాయమూర్తి సినిమా వీక్షించనున్నారు.
ఇదిలా ఉండగా, సెన్సార్ బోర్డు తరఫున హాజరైన న్యాయవాది మరింత సమయం కోరుతూ, తదుపరి వాదనలు వాయిదా వేయాలని కోరారు. అంతేకాకుండా, నిర్మాతలు వేసిన రెండో పిటిషన్‌కు సంబంధించి మరింత సమాచారం సమర్పించాల్సి ఉందని, మొదటి పిటిషన్‌కు ఇప్పుడు విలువ లేకుండా పోయిందని తెలిపారు.ఈ వివాదంపై ఇప్పటి వరకూ పలువురు సినీ ప్రముఖులు కూడా స్పందించారు. సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు — న్యాయ, సామాజిక అంశాలపై చర్చించేందుకు ఒక బలమైన వేదిక అని వారు పేర్కొన్నారు. ఒక బాధితురాలిని ప్రధాన పాత్రగా చూపిస్తూ రూపొందించిన చిత్రానికి ఇలా అడ్డంకులు తేవడం తీవ్రంగా తప్పని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ వివాదం ఇక్కడితో ఆగేలా కనిపించటం లేదు. ఇది సెన్సార్ వ్యవస్థ నిష్పక్షపాతతపై, సినీ స్వేచ్ఛపై, వాస్తవిక కథనాల్ని ఎలాచూడాలి అనే అంశాలపై పెద్ద చర్చకు తెరలేపింది.