Lokah Enters 300 Crore Club | మళయాళ సినీ చరిత్రలో ‘కొత్తలోక: చాప్టర్ 1’ కొత్త రికార్డు
'కొత్తలోక: చాప్టర్ 1' మలయాళ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు (₹300 కోట్లు) సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ నిర్మించారు.

విధాత : కేకవలం రూ.30కోట్ల రూపాయల బడ్జెట్ తో చిన్న చిత్రంగా రూపుదిద్దుకున్న మళయాళ మూవీ ‘కొత్తలోక: చాప్టర్ 1’ సినిమా వసూళ్లలో కొత్త రికార్డులు సృష్టిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.300కోట్ల వసూళ్ల మార్కును అధిగమించిన ‘కొత్తలోక: చాప్టర్ 1’ మూవీ మళయాళ సినీ చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లను సాధించిన చిత్రంగా సరికొత్త రికార్డు నెలకొల్పింది. మోహన్‌లాల్ కథానాయకుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో ఈ ఏడాది వచ్చిన ‘ఎల్2: ఎంపురాన్’ ఇప్పటివరకూ మలయాళంలో అత్యధిక వసూళ్లు (రూ.265.5 కోట్లు) రాబట్టిన చిత్రంగా ఉండేది. ఆ రికార్డును ‘కొత్తలోక’ బద్దలు కొట్టింది. వీటి తర్వాత ‘తుడురమ్’ రూ.242 కోట్లతో మూడో స్థానంలో ఉంది.
‘కొత్తలోక: చాప్టర్ 1’ సినిమాను డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ నిర్మించాడు. కల్యాణి ప్రియదర్శన్, నెస్లన్, చందు, సాయికుమార్ కీలక పాత్రలో నటించగా..దుల్కర్, టొవినో అతిథి పాత్రల్లో కనిపించారు.కేరళలో ప్రసిద్ధి చెందిన కల్లింగట్టు నీలి కథ నుండి ప్రేరణతో ఈ మూవీని సూపర్ హీరో సినిమాటిక్ యూనివర్స్‌లో తొలి భాగంగా తెరకెక్కించారు. మొత్తం ఐదు భాగాల సిరీస్‌లో ఇదే మొదటి చిత్రం. కేవలం మౌత్ టాక్‌తోనే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా విజయం పరంపరలో భాగంగా మేకర్స్ ఇప్పటికే ‘లోక చాప్టర్ 2’ అనౌన్స్ చేశారు. ‘కొత్తలోక: చాప్టర్ 1’ సినిమా ఇంకా థియేటర్లలో మంచి వసూళ్లను రాబతుండటంతో ఓటీటీ విడుదల ఆలస్యమవుతుంది. ఈ చిత్రం ఓటీటీలో అక్టోబరు 20వ తేదీ నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చే అవకాశాలున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.