విధాత : వెండితెరపై ఓ వెలిగి వెలిగిన ప్రముఖ హీరోలు..హీరోయిన్లు ఇటీవల కాలంలో బుల్లితెరపై కూడా తమ హవా కొనసాగించేందుకు తాపత్రాయపడుతున్నారు. అటువంటి సెలబ్రెటీలకు టాక్ షోలు చక్కని వేదికగా మారాయి. తెలుగులో ఆహాలో నందమూరి బాలకృష్ణ, ప్రస్తుతం జీ తెలుగు ఛానెల్ లో జగపతి బాబు టాక్ షో ప్రేక్షకులను రంజింపచేస్తున్నాయి. నాగార్జున బిగ్ బాస్ తొమ్మిదవ సీజన్ కొనసాగిస్తున్నా. అయితే జాతీయ స్థాయిలో ‘కాఫీ విత్ కరణ్’ టాక్ షో సక్సెస్ తో టాక్ షోలు ఊపందుకోగా..ఈ బాటలో తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోలు అజయ్ దేవగన్, అక్షయ కుమార్ భార్యలు కాజోల్, ట్వింకిల్ ఖన్నా చేరిపోయారు. అందాల భామలు ఇద్దరు హోస్టులుగా ‘టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్’ అనే సెలబ్రెటీ టాక్ షోతో రాబోతున్నారు. సెప్టెంబర్ 25 నుంచి ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వేదికగా ఇది ప్రసారం కానుంది.
తాజాగా ఈ టాక్ షో ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ లో సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, ఆలియా భట్, వరుణ్ ధావన్, గోవింద, కృతి సనన్, విక్కీ కౌశల్, జాన్వీ కపూర్, కరణ్ జోహార్ వంటి స్టార్స్ గెస్టులుగా పాల్గొన్నారు. షోలో సల్మాన్ , అమీర్ ఖాన్ జంటగా సందడి చేయడం ఆకట్టుకుంది. హోస్టులు కాజల్, ట్వింకిల్ తమదైన స్టైల్లో చిలిపి, బోల్డ్ ప్రశ్నలు అడగడం.. వాటికిసెలబ్రెటీలు అశ్చర్యంతో సమాధానాలివ్వడం ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచింది. ఎంటర్ టైన్మెంట్ తో పాటు సెలబ్రెటీల సినిమా కెరీర్, వారి వ్యక్తిగత జీవితాలు, వృత్తిపరమైన విషయాల గురించి ఈ టాక్ షోలో చర్చించడం కనిపించింది. బుల్లితెర నిండుగా ఇద్దరు అందాల భామలు చేస్తున్న ‘టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్’ టాక్ షో ఎంతటి ఆదరణ పొందనుంతో చూడాల్సి ఉంది.