Kishkindhapuri Review  | ‘కిష్కింధపురి’ రివ్యూ: అంతా ‘సువర్ణ మాయ’ – ‘రాక్షసుడు’ థ్రిల్​ రిపీటైందా.?

రేడియో స్టేషన్ నేపథ్యంతో “కిష్కింధపురి” భయపెట్టే ప్రయత్నం. బెల్లంకొండ–అనుపమ కాంబో మరోసారి మెప్పించిందా? చూద్దాం పదండి.

Kishkindhapuri Review  | ‘కిష్కింధపురి’ రివ్యూ: అంతా ‘సువర్ణ మాయ’ – ‘రాక్షసుడు’ థ్రిల్​ రిపీటైందా.?

Kishkindhapuri Review | బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా వచ్చిన “కిష్కింధపురి” ఒక హారర్ థ్రిల్లర్. గతంలో రాక్షసుడు వంటి సస్పెన్స్ థ్రిల్లర్‌లో వీరిద్దరూ ఆకట్టుకున్నారు. ఈసారి దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను భయపెట్టే ప్రయత్నం చేశారు. పాడైపోయిన ఒక రేడియో స్టేషన్ చుట్టూ తిరిగే కథతో హారర్ జానర్‌కి కొత్త మలుపు ఇవ్వాలనుకున్నారు. ప్రమోషన్స్, ట్రైలర్స్ వల్ల సినిమాపై ఆసక్తి పెరిగింది. మరి కిష్కింధపురి అంచనాలు అందుకుందా?

‘కిష్కింధపురి’ కథ ఏమిటంటే..

రాఘవ్ (బెల్లంకొండ సాయి శ్రీనివాస్), మైథిలి (అనుపమ పరమేశ్వరన్) ఇద్దరూ ప్రేమికులు. వీరిద్దరూ తమ స్నేహితుడితో కలిసి “ఘోస్ట్ వాకింగ్” పేరుతో దయ్యాల బంగ్లాలుగా పేరు తెచ్చుకున్న భవంతుల టూర్స్ నిర్వహిస్తుంటారు. భయపెట్టే అనుభవం కోరుకునే వారిని పాడుబడ్డ ఇళ్లలోకి తీసుకెళ్లి ఆత్మల కథలు చెప్పి థ్రిల్ కలిగించడం వారి ఉద్దేశ్యం.

ఒక రోజు 11 మందితో కలిసి కిష్కింధపురి గ్రామం దగ్గర ఉన్న మూతబడిన సువర్ణమాయ రేడియో స్టేషన్‌లోకి అడుగుపెడతారు. ఆ కేంద్రం 1989లో మూతపడింది. అక్కడి రేడియో నుంచి ఒక రహస్య గొంతు వినిపిస్తుంటుంది. అది వేదవతి అనే  ఒక ఆత్మదని తెలుస్తుంది. ఆ వేదవతి “ఈ రేడియో కేంద్రంలోకి వచ్చిన వారెవరినీ వదిలిపెట్టను” అని హెచ్చరిస్తుంది. ఆ వెంటనే ముగ్గురు బృంద సభ్యులు అనుమాస్పద పరిస్థితుల్లో మరణిస్తారు. తర్వాత ఒక చిన్నారి లక్ష్యంగా మారుతుంది.

ఇక రాఘవ్ తన ప్రాణాల్ని పణంగా పెట్టి ఆ ఆత్మను ఎదుర్కొంటాడు. వేదవతి ఎవరు? ఎందుకు ప్రతీకారం తీర్చుకుంటోంది? సువర్ణమాయ స్టేషన్‌తో సంబంధం ఏమిటి? రాఘవ్ ఆ చిన్నారిని కాపాడాడా? అన్నది అసలు కథ.

తొలి అర్థభాగం – భయపెట్టే సన్నివేశాలు

సినిమాలో మొదటి పది నిమిషాలు హుషారుగా ఉంటాయి. చీకటిలో వినిపించే రేడియో గొంతు, అకస్మాత్తుగా జరిగే ప్రమాదాలు థియేటర్లో భయపెట్టే మూడ్​ను పుట్టిస్తాయి.  కథనం కూడా వేగంగా సాగిపోతూ, ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది. ముఖ్యంగా ట్రైన్ సీన్, నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి వ్యక్తిని కిందికి తోసేసే సన్నివేశం లాంటివి హారర్ కాన్సెప్ట్​ను  గట్టిగానే నిలబెడతాయి.

ఘోస్ట్ వాకింగ్ టూర్ అనుభవం కొత్తగా అనిపిస్తుంది. ఇంటర్వెల్‌కి ముందే ప్రేక్షకుడు కథలో లీనమౌతాడు.

సెకండ్‌హాఫ్ – ఫ్లాష్‌బ్యాక్ కథనం, కొంత సాగతీత

ఇంటర్వెల్ తరువాత అసలు కథ వెనుక ఉన్న వేదవతి ఫ్లాష్‌బ్యాక్ చూపిస్తారు. ఆమె ఎందుకు ఆత్మగా మారింది, ఎవరి చేతిలో మోసపోయింది అనే విషయం తెలుస్తుంది. అయితే ఈ భాగం రొటీన్‌గా అనిపిస్తుంది. తెలుగు ప్రేక్షకులు ఇలాంటి ప్రతీకార ఆత్మ కథలను ఇప్పటికే అనేకసార్లు చూసారు. “కాంచన”, “రాక్షసుడు” వంటి సినిమాల గుర్తు వస్తుంది. దర్శకుడు కథను బాగానే రాసుకున్నా, తెర మీదకు తీసుకురావడంలో తడబడ్డాడు. కొన్ని చోట్ల లాజిక్​లు మిస్సవడం అసంతృప్తికి గురిచేస్తుంది.

కొన్ని ట్విస్టులు, ముఖ్యంగా మైథిలి (అనుపమ) బ్యాక్‌డ్రాప్‌లో వచ్చేవి థ్రిల్​ కలిగిస్తాయి. కానీ మొత్తం రెండో అర్థభాగం వేగం చాలా వేగంగా పడిపోతుంది. క్లైమాక్స్ ఊహించినట్టే సాగిపోతుంది. అయితే సీక్వెల్ హింట్ ఇవ్వడం ఆసక్తి రేపుతుంది.

నటీనటుల ప్రదర్శన

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ – యాక్షన్, ఎమోషనల్ సీన్స్‌లో బాగా చేశాడు. హారర్ బ్యాక్‌డ్రాప్‌లో అతన్ని చూడటం కొత్తగా అనిపిస్తుంది.

అనుపమ పరమేశ్వరన్ – సెకండ్‌హాఫ్‌లో ఆమె నటనకు ఆస్కారం ఎక్కువగా ఉంది. దానికి అనుపమ పూర్తి న్యాయం చేసింది. ముఖ్యంగా ఆత్మ పాత్రలో చేసిన సీన్స్ బాగున్నాయి.

శాండీ మాస్టర్ – విశ్రవ పుత్ర పాత్రలో మంచి ఇంపాక్ట్ చూపించాడు.

హైపర్ ఆది, సుదర్శన్ – కొంత రిలీఫ్​ ఇచ్చే ప్రయత్నం చేసినా పెద్దగా గుర్తుండవు.

తనికెళ్ల భరణి, మకరంద్ దేశ్‌పాండే, శ్రీకాంత్ అయ్యంగార్ – తమ పాత్రలకనుగుణంగా చేశారు.

సాంకేతిక విశ్లేషణ

దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి – సువర్ణమాయ రేడియో స్టేషన్ అనే సెటప్ క్రియేట్ చేసి ఆసక్తికరంగా మొదలు పెట్టాడు. కానీ సెకండ్‌హాఫ్​లో తడబడటం ఇబ్బందికరంగా మారింది. కథను మంచి మలుపులతో ఆసక్తికరంగా రాసుకున్నాడు. బహుశా అనుభవం లేకపోవడం తికమక పెట్టినట్టుంది. అయినా, ఆయన పడిన కష్టం వృథా అయితే పోలేదు. చాలా వరకు ప్రేక్షకులను మెప్పించగలిగాడు.

సంగీతం :  చైతన్య భరద్వాజ్ – బీజీఎం హారర్ ఎఫెక్ట్ పెంచింది. “అమ్మ” పాట బాగుంది కానీ అది వచ్చిన స్థానం సరికాదు.

సినిమాటోగ్రఫీ : చిన్మయ్ సలస్కర్ – చీకటిలోని లైటింగ్, ఫ్రేమ్స్ వాతావరణాన్ని హర్రర్​ సీన్​లను బాగా  చూపించాయి.

ఎడిటింగ్ :  నిరంజన్ దేవరమనే – ఫస్ట్‌హాఫ్ బాగుంది, సెకండ్‌హాఫ్​లో కత్తెరకు మరింత పని చెప్పాల్సింది.

నిర్మాణ విలువలు : పాడుబడ్డ రేడియో స్టేషన్ సెట్ నిజంగా ఉన్నట్టు అనిపించింది. కానీ కొన్ని CG షాట్స్ మాత్రం తేలిపోయాయి. ఇంకొంచెం ఖర్చుపెట్టుంటే బాగుండేది.

ప్లస్ పాయింట్స్:

ఫస్ట్‌హాఫ్ హారర్ ఎపిసోడ్స్

బెల్లంకొండ–అనుపమ నటన

సౌండ్ డిజైన్, బీజీఎం

సువర్ణమాయ రేడియో స్టేషన్ సెట్​

మైనస్ పాయింట్స్

సెకండ్‌హాఫ్‌లో సాగతీత

రొటీన్ ఫ్లాష్‌బ్యాక్

క్లైమాక్స్ ఊహించినట్టే

కొన్ని లాజిక్​లు మిస్సవడం

“కిష్కింధపురి” – ఫస్ట్‌హాఫ్‌లో బలమైన హారర్ టచ్, సెకండ్‌హాఫ్‌లో స్లో నెరేషన్. బెల్లంకొండ–అనుపమ నటన, బీజీఎం సినిమాకి బలం. క్లైమాక్స్ ఊహించినట్టే ఉన్నా,  సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. థియేటర్‌లో ఒకసారి చూడదగ్గ హారర్ థ్రిల్లర్.

‘విధాత’ రేటింగ్: 3/5