Delhi Liquor Case| కవితను అరెస్టు చేసిన సీబీఐ

Delhi Liquor Case| కవితను అరెస్టు చేసిన సీబీఐ

డిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం
తీహార్ జైలులోనే కవిత అరెస్టు
అత్యవసర పిటిషన్‌తో సవాల్ చేసిన కవిత న్యాయవాది
రెగ్యులర్ కోర్టుకు వెళ్లాలన్న స్పెషల్ కోర్టు
నేడు కవితను కోర్టులో హాజరుపరుచనున్న సీబీఐ

విధాత, హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను అరెస్టు చేసినట్లుగా సీబీఐ ప్రకటించింది. కవిత ఇప్పటికే ఈడీ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో తీహార్ జైలులో ఉన్నారు. ఆమె కస్టడీ ఈనెల 23వరకు ఉంది. కవితను జైలులోనే అరెస్టు చేసినట్లుగా సీబీఐ వెల్లడించింది. కవితను ఇదే కేసులో మార్చి 15న హైదరాబాద్‌లో ఈడీ అరెస్టు చేసింది. సీబీఐ విచారణను సవాల్ చేస్తూ కవిత కోర్టులో వేసిన పిటిషన్ విచారణ ఈనెల 26వ తేదీకి వాయిదా పడింది. కోర్టులో కవిత పిటిషన్ విచారణకు ఉందన్న విషయం తెలిసి కూడా జైలులోనే కవితను సీబీఐ అరెస్టు చేయడం కీలక పరిణామంగా మారింది. కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్ సైతం ఈనెల 16న విచారణకు రానుంది.

సీబీఐ అరెస్టుపై స్పెషల్ కోర్టులో వాదనలు

సీబీఐ కవితను జైల్లో అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ కవిత న్యాయవాది మోహిత్‌రావు రౌస్ అవెన్యూ సీబీఐ స్పెషల్ కోర్టులో గురువారం అత్యవసర పిటిషన్ వేశారు. దీనిపై జడ్జీ మనోజ్‌కుమార్‌ వాదనలు విన్నారు. సీబీఐ తరపు న్యాయవాది కవిత అరెస్టును దృవీకరించారు. రేపు కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. కవిత న్యాయవాది మోహిత్‌రావు తన వాదనలు వినిపిస్తూ నోటీస్‌లు లేకుండా ఎలా అరెస్టు చేస్తారని వాదించారు. అదికూడ జైల్లో సీబీఐ ఎలా అరెస్టు చేస్తుందని అభ్యంతరం వ్యక్తం చేశారు. వాదనలు విన్న జడ్జీ మనోజ్‌కుమార్ స్పందిస్తూ నా ఎదుట లిక్కర్ కేసుకు సంబంధించిన విచారణ జరగలేదని, ఈ కేసులో నేను ఎలాంటి రిలీఫ్ ఇవ్వలేనని స్పష్టం చేశారు. కేసు గురించి ఎలాంటి సమాచారం నాకు తెలియదని, నా ఎదుట కేవలం అత్యవసర పిటిషన్‌పై మాత్రమే వాదనలు వినిపించాలని, నేడు శుక్రవారం ఉదయం 10 గంటలకు రెగ్యులర్ కోర్టులో పిటిషన్ వేసుకోవాలని సూచించారు.

గతంలోనే విచారణకు నోటీస్‌లు
ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు గత ఫిబ్రవరి 26న విచారణకు హాజరుకావాలని అంతకునాలుగు రోజుల ముందు సీబీఐ 41ఏ కింద నోటీస్‌లు జారీ చేసింది. గతంలో సాక్షిగా విచారించిన సీబీఐ ఈ దఫా నిందితురాలిగా నోటీస్‌లో పేర్కోంది. అనంతర పరిణామాల మధ్య కవితను ఈడీ హైదరాబాద్‌లో మార్చి 15న అరెస్టు చేసింది. అంతకుముందు 2022డిసెంబర్ 11న కవితను సీబీఐ హైదరాబాద్‌లో విచారించింది. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న కవితను కోర్టు అనుమతితో ఇప్పటికే ఒక పర్యాయం సీబీఐ విచారించింది. బుచ్చిబాబు ఫోన్లో దొరికిన సమాచారం ఆధారంగా సీబీఐ కవితను ప్రశ్నించింది. ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చిన 100 కోట్ల వ్యవహారంపై, కవిత కొనుగోలు చేసిన భూములపైన సీబీఐ ఆమె నుంచి వివరాలు రాబట్టింది. అలాగే ఈడీ సేకరించిన ఆధారాల మేరకు కూడా సీబీఐ ఆమెను ప్రశ్నించింది. మరింత విచారణ నిమిత్తం కవితను సీబీఐ అరెస్టు చేసింది.