Ayodhya Ram Temple | నవంబర్‌ 25న అయోధ్య రామాలయంలో ధ్వజారోహణ..

అయోధ్యలో బాల రాముడి ఆలయ నిర్మాణం ఎట్టకేలకు పూర్తయింది. నవంబర్‌ 25వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సమక్షంలో ఆలయ ధ్వజారోహణ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.

Ayodhya Ram Temple | నవంబర్‌ 25న అయోధ్య రామాలయంలో ధ్వజారోహణ..

Ayodhya Ram Temple | అయోధ్య రామాలయం ఎట్టకేలకు పూర్తిస్థాయిలో సిద్ధం అవుతున్నది. గత ఎన్నికల సమయంలో అయోధ్య బాలరాముడి ఆలయాన్ని హడావుడిగా ప్రారంభించడం తీవ్ర విమర్శలకు తావిచ్చిన విషయం తెలిసిందే. ఇంకా నిర్మాణం అసంపూర్ణంగా ఉండగానే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఆలయాన్ని ప్రారంభిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఇదే కారణంతో పలువురు పీఠాధిపతులు ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. ఇప్పుడు ఆలయం నిర్మాణం పూర్తి అయింది. దీంతో నవంబర్‌ 25వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో అట్టహాసంగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహంచనున్నారు. ప్రధాని పాల్గొంటున్న విషయాన్ని రామాలయ నిర్మాణ కమిటీ చైర్మన్‌ నృపేంద్ర మిశ్రా ధృవీకరించారు. ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లూ సాగుతున్నాయని తెలిపారు. ధ్వజం రంగు, సైజ్‌, డిజైన్‌ కూడా ఖరారైనట్టు తెలిపారు. ధ్వజారోహణం ఆలయ నిర్మాణం పూర్తికావడాన్ని సూచిస్తుంది. మంగళవారం ధ్వజారోహణ కార్యక్రమ మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. ‘నవంబర్‌ 25న నిర్వహించే ధ్వజారోహణ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పాల్గొంటారు. మేం ఏర్పాట్లు ప్రారంభించాం. ఎగురవేసే ధ్వజం సైజ్‌, రంగు, ఇతర అన్ని వివరాలూ ఖరారయ్యాయి. ధ్వజారోహణంతో మహా ఆలయ నిర్మాణం పూర్తి అవుతుంది. దీనిపై మాక్‌ డ్రిల్‌ కూడా నిర్వహించాం’ అని ఆయన మీడియాకు తెలిపారు.

రామాలయానికి, హనుమాన్‌ గర్హికి మధ్య భక్తుల రద్దీని నివారించేందుకు హనుమత్‌ పథ్‌ పేరిట కొత్త రహదారిని నిర్మిస్తున్నట్టు ఆగస్ట్‌ 19న అధికారులు ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి ఆలయం పూర్తి స్థాయిలో నిర్మాణం అవుతుందని ఆగస్టు నెలలోనే కమిటీ ప్రకటించింది. కానీ.. అంతకు ముందే నిర్మాణం పూర్తయింది. హనుమాన్‌ గర్హి, రామాలయం మధ్య భక్తుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు, రద్దీని పరిష్కరించేందుకు శ్రీ రామ్‌ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్, హనుమాన్‌ గర్హి ఆలయ మేనేజ్‌మెంట్‌, జిల్లా అధికార యంత్రాంగం సంయుక్తంగా నిర్ణయం తీసుకుని ఈ దారిని ఏర్పటు చేస్తున్నాయి. ఈ దారి పూర్తయితే.. ఇప్పుడు బాగా రద్దీగా ఉంటున్న రామ్‌ పథ్ బదులు కొత్త దారిలో సులభంగా ప్రయాణించేందుకు భక్తులకు వీలు కలుగుతుంది. దానితోపాటు రామ్‌ పథ్‌లో ట్రాఫిక్‌ నియంత్రణలు తొలగించనున్నారు. దారి పొడవునా స్థానికులు ఉపాధి పొందేందుకు మరిన్ని దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు.

రామ మందిరం నిర్మాణం పూర్తికావడం, హనుమత్‌ పథ్‌ అభివృద్ధితో అయోధ్యకు వచ్చే రామ భక్తులకు ప్రయాణం మరింత సుభతరం, సురక్షితం, ఆధ్యాత్మికం కానున్నది. అదే సమయంలో స్థానిక దుకాణదారులకు కూడా మరిన్ని అవకాశాలు కలుగనున్నాయి. ఆలయ నిర్మాణ క్రమం మొత్తాన్నీ ఐదు టైమ్‌ల్యాప్స్‌ కెమెరాల్లో చిత్రీకరించారు. దానిని మేధో సంపత్తిగా భద్రపర్చనున్నారు. విద్యా సంబంధ అంశాల్లో ఉపయోగించేందుకు, హిస్టారిక్‌ డాక్యుమెంట్‌ తయారీకి దీనిని వాడుతారు.