Jammi Chettu | ద‌స‌రా రోజున‌.. జ‌మ్మి చెట్టుకు పూజ ఎలా చేయాలో తెలుసా..?

Jammi Chettu | ద‌స‌రా పండుగ( Dasara Festival ) అంటేనే గుర్తొచ్చేది పాల‌పిట్ట‌( Palapitta ), జ‌మ్మిచెట్టు( Jammi Chettu ). పండుగ రోజున సాయంత్రం వేళ గ్రామ‌స్తులంతా క‌లిసి.. జ‌మ్మి చెట్టు వ‌ద్ద‌కు వెళ్లి పూజ‌లు నిర్వ‌హిస్తారు. అనంత‌రం జ‌మ్మి తీసుకొని ఒక‌రికొక‌రు అల‌య్ బ‌ల‌య్( Alai Balai ) చేసుకుంటారు.

  • By: raj |    devotional |    Published on : Oct 11, 2024 8:00 AM IST
Jammi Chettu | ద‌స‌రా రోజున‌.. జ‌మ్మి చెట్టుకు పూజ ఎలా చేయాలో తెలుసా..?

Jammi Chettu | ద‌స‌రా పండుగ( Dasara Festival ) రోజు శుభ ముహుర్తంలో దుర్గాదేవి( Durga Devi ) అమ్మ‌వారిని పూజిస్తారు. ఇక సాయంత్రం వేళ‌.. గ్రామ‌స్తులంతా క‌లిసి ఊర్లో ఉన్న జ‌మ్మి చెట్టు( Jammi Chettu ) వ‌ద్ద‌కు వెళ్తారు. పూజారి స‌మ‌క్షంలో జ‌మ్మి చెట్టుకు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హిస్తారు. పూజ‌ల అనంత‌రం పాల‌పిట్ట( Palapitta ) ద‌ర్శ‌నం కోసం వేచి చూస్తుంటారు. పాల‌పిట్ట ద‌ర్శ‌నం కాగానే జ‌మ్మి ఆకుల‌ను తెంచి.. గ్రామ‌స్తులు ఒక‌రికొక‌రు పంచుకుంటూ అల‌య్ బ‌ల‌య్( Alai Balai ) చేసుకుంటారు. దీంతో అక్క‌డ పండుగ వాతావ‌ర‌ణం ఏర్ప‌డుతుంది. మ‌రి జ‌మ్మి చెట్టుకు పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం.

జ‌మ్మి చెట్టుకు పూజ ఎలా చేయాలంటే..?

ముందుగా జమ్మి చెట్టు దగ్గరకు వెళ్లి అక్కడ శుభ్రంగా ఊడ్చి నీళ్లు చల్లి బియ్యప్పిండితో ముగ్గు వేసుకోవాలి. జ‌మ్మి చెట్టు మొద‌లు వ‌ద్ద మూడు తమలపాకులు పెట్టాలి. ఆ తమలపాకుల్లో మూడు పసుపు ముద్దలు ఉంచాలి. ప్రతి పసుపు ముద్దకు పై భాగానా, కుడివైపు, ఎడమ వైపు కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ మూడు పసుపు ముద్దలకు అక్షింతలు, పూలతో పూజ చేస్తూ మంత్రం చదువుకోవాలి.

మధ్యలో ఉన్న పసుపు ముద్దకు పూజ చేస్తూ “ఓం అపరాజితాయై నమః” అంటూ 21 సార్లు మంత్రం చదువుతూ పూలు, అక్షతలు చల్లుతూ పూజ చేయాలి.

ఎడమ వైపు ఉన్న పసుపు ముద్దకు పూజ చేస్తూ “ఓం జయాయై నమః” అంటూ 21 సార్లు మంత్రం చదువుతూ పూలు, అక్షతలు చల్లుతూ పూజ చేయాలి.

కుడి వైపున ఉన్న పసుపు ముద్దకు పూజ చేస్తూ “ఓం విజయాయై నమః” అంటూ 21 సార్లు మంత్రం చదువుతూ పూలు, అక్షతలు చల్లుతూ పూజ చేయాలి.

ఆ తర్వాత కర్పూర హారతి ఇచ్చి ఒక్కో పసుపు ముద్ద దగ్గర ఒక్కో బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టాలి. అలా పూజ చేసిన తర్వాత ఆ మూడు పసుపు ముద్దలను ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేసుకోవాలి. ఆ తర్వాత ఓ తెల్ల కాగితం తీసుకుని పసుపు, కుంకుమ బొట్లు పెట్టి కాగితం పైన ఓంకారం, స్వస్తిక్​ గుర్తు వేసి ఇంట్లో కుటుంబ సభ్యులందరి పేర్లు రాసి జమ్మి చెట్టు తొర్రలో పెట్టాలి.

అనంతరం ఆ జమ్మి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలి. ఇలా ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓ శ్లోకం చదువుకోవాలి. “శమీ శమయతే పాపం శమీశతృ వినాశనమ్​ అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ” అంటూ చదువుతూ మూడు సార్లు ప్రదక్షిణ చేయాలి. ఒకవేళ ఈ శ్లోకం చదవడం రాకపోతే ఓం అపరాజితా దేవ్యై నమః అనుకుంటూ ప్రదక్షిణలు చేయాలి.

ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత జమ్మి చెట్టు తొర్రలో ఉన్న కాగితాన్ని ఇంటికి తీసుకెళ్లి బీరువాలో భద్రపరచుకోవాలి. ఇలా చేస్తే సంవత్సరం మొత్తం ఇంట్లో సభ్యులందరి మీద అపరాజితా దేవి అంటే రాజ రాజేశ్వరి దేవి అనుగ్రహం లభిస్తుంది. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలన్నీ తీరిపోతాయని జ్యోతిష్య పండితులు​ చెబుతున్నారు.