తిరుమల, యాదాద్రిలో భక్తుల రద్దీ.. కిక్కిరిసిన క్యూలైన్లు
ఏపీ, తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు తిరుమల, యాదగిరిగుట్టలలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం సాధారణ భక్తులకు 24గంటల సమయం పడుతుండగా, సర్వదర్శనం కంపార్ట్‌మెంట్లు అన్ని నిండి నారాయణగిరి షెడ్ల వరకు భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు

విధాత : ఏపీ, తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు తిరుమల, యాదగిరిగుట్టలలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం సాధారణ భక్తులకు 24గంటల సమయం పడుతుండగా, సర్వదర్శనం కంపార్ట్‌మెంట్లు అన్ని నిండి నారాయణగిరి షెడ్ల వరకు భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఇటు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి క్షేత్రంలో భక్తుల కోలాహలం నెలకొన్నది. ఆదివారం సెలవు కావడంతో పెద్ద సంఖ్యలో తరలివచ్చి నారసింహుడిని దర్శించుకున్నారు. సాధారణ భక్తులకు స్వామి వారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది. భక్తజనంతో ఆలయ మాఢవీధులు, క్యూలైన్లు, ప్రసాద విక్రయశాలలు కిక్కిరిసిపోయాయి.
తెల్లవారుజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం తిరువారాధన జరిపి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం జరిపారు. నిజరూప దర్శనంలో స్వయంభూ నారసింహస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శనభాగ్యం కల్పించారు. ప్రధానాలయం వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం జరిపిన అర్చకులు ఉత్సవమూర్తులను దివ్య మనోహరంగా అలంకరించి కల్యాణోత్సవ సేవ జరిపారు.