కర్మఫలం అంటే తెలుసా..?

కర్మఫలం.. మనం చేసే కర్మల పరంగా మనకు లభించే ఫలితం. అది మంచిదైనా కావచ్చు లేదా చెడ్డదైనా కావచ్చు. ఇది రెండు విధాలుగా ఉంటుంది. ఫుణ్యఫలం, పాలఫలం. ఈ రెండూ భూమ్మీద జరగాలంటే ఖచ్చితంగా భౌతిక సూత్రాలననుసరించే జరగాలి.

కర్మఫలం అంటే తెలుసా..?

కర్మఫలం.. మనం చేసే కర్మల పరంగా మనకు లభించే ఫలితం. అది మంచిదైనా కావచ్చు లేదా చెడ్డదైనా కావచ్చు. ఇది రెండు విధాలుగా ఉంటుంది. ఫుణ్యఫలం, పాలఫలం. ఈ రెండూ భూమ్మీద జరగాలంటే ఖచ్చితంగా భౌతిక సూత్రాలననుసరించే జరగాలి. అకస్మాత్తుగా ప్రత్యక్షం కావు. అలాగే అవి అనుభవించాల్సిఉన్నప్పుడు ఉన్న పరిస్థితులు కూడా అనుకూలించాలి. ఉదాహరణకు ఒక కథ…

చీకటి కావస్తుండగా ప్రయాణికులతో పూర్తిగా నిండి , రద్దీగా ఉన్న ఒక బస్సు తన గమ్యస్థానానికి బయలుదేరింది. ఆ బస్సు ఒక అడవి గుండా ఘాట్ రోడ్డు పై ప్రయాణిస్తుండగా అకస్మత్తుగా వాతావరణం మారిపోయి భయంకరమైన ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం ప్రారంభమైంది.

ప్రయాణికులందరు చూస్తుండగానే ఒక పిడుగుపాటు వల్ల బస్సుకు 50 అడుగుల దూరంలో ఒక చెట్టు పడిపోయింది. డ్రైవర్ చాకచక్యంతో బస్సును ఆపివేశాడు. ఆ చెట్టు మరో ప్రక్కకు ఉన్న లోయ వైపు విరిగిపడడం వల్ల వీరి మార్గానికి అడ్డు రాలేదు. కొద్దిసేపటి తరువాత మళ్లి బస్సు బయలుదేరింది. ప్రయాణికులలో భయం ప్రారంభమైంది. ప్రయాణికులందరు ఊపిరి బిగపట్టుకుని కూర్చున్నారు. ఆ బస్సు రెండు కిలోమీటర్లు వెళ్లిందో లేదో మరో మలుపు వద్ద పిడుగు బస్సుకు 40 అడుగుల దూరంలోని చెట్టుపై పడింది. డ్రైవర్ ఈసారీ తెలివిగా ప్రమాదాన్ని తప్పించాడు. ఇలా మూడు సార్లు జరిగింది. మూడోసారి పిడుగు 30 అడుగుల దూరంలోనే పడింది. ఇక ఇప్పుడో, ఇంకాసేపటికో బస్సు మీద పిడుగు పడటం ఖాయమని ప్రయాణికులలో భయం తారాస్థాయికి చేరుకుంది. అరుపులు, ఏడుపులు ప్రారంభమయ్యాయి.

ఆ బస్సులో వున్న ఒక పెద్దయన ఇలా అన్నాడు. “చూడండీ! మనందరిలో ఈ రోజు ‘పిడుగు ద్వారా మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ‘ఎవరో ఉన్నారు. అతని కర్మ మనకు చుట్టుకుని మనందరం కూడా అతనితో పాటు చావవలసి వస్తుంది. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ‘ఈ బస్సులో నుంచి ఒక్కొక్క ప్రయాణికుడు క్రిందికి దిగి, అదిగో… ఎదురుగా ఉన్న ఆ చెట్టును ముట్టుకుని మళ్లీ బస్సులో వచ్చి కూర్చోండి. మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ఆ చెట్టును ముట్టుకోగానే పిడుగుపాటు తగిలి మరణిస్తాడు. మిగిలిన వాళ్లం క్షేమంగా వెళ్లవచ్చు. ఒక్కరి కోసం అందరు చస్తారో ? అందరి కోసం ఒక్కరు చస్తారో? ఆలోచించుకోండి’ అన్నాడు.

చివరకు అందరూ ఒప్పుకొని ఒక్కొక్కరుగా వెళ్లి ఆ చెట్టును ముట్టుకుని రావడానికి సిద్ధపడ్డారు. మొదట గా ఆ పెద్దమనిషే ధైర్యం చేసి భయపడుతూనే వెళ్లి ఆ చెట్టును ముట్టుకున్నాడు. ఏమీ జరగలేదు. అతడు ఊపిరి పీల్చుకుని క్షేమంగా వచ్చి బస్సులో కూర్చున్నాడు. ఇలా ఒక్కొక్కరు భయపడుతూనే వెళ్లి ఆ చెట్టును ముట్టుకుని వచ్చి కూర్చోసాగారు. చివరికి ఒకే ఒక ప్రయాణికుడు మిగిలాడు. ఇక మరణించేది అతడే అని అందరూ పూర్తిగా నిశ్చయమైపోయారు. చాలా మంది అతని వైపు అసహ్యంతో, కోపంతో చూడసాగారు. కొందరు జాలి పడుతూ చూడసాగారు. అతను కూడా చనిపోతానేమో అనే భయం పట్టుకొని బస్సు దిగి చెట్టును ముట్టుకోవడానికి నిరాకరించాడు.

కాని, బస్సులోని ప్రయాణికులందరూ నీవల్ల మేమందరం మరణించాలా? వీల్లేదు. అంటూ అతన్ని దూషిస్తూ, బస్సు నుంచి బలవంతంగా క్రిందికి నెట్టారు. ఇక చేసేది లేక ఆ చివరి వ్యక్తి వెళ్లి చెట్టును ముట్టుకున్నాడు. భయంతో గట్టిగా కళ్ళు ముసుకొని దైవ ప్రార్థనలో మునిగిపోయాడు. వెంటనే భయంకరమైన మెరుపులతో పిడుగు వచ్చి తాకింది. తరువాత భయంకరమైన శబ్దం వచ్చింది….కానీ,
పిడుగు వచ్చి కొట్టింది ఆ చివరి వ్యక్తిపై కాదు..! ఆ బస్సుపై.
అవును.. బస్సుపై పిడుగు పడి అందులో వున్న ప్రయాణికులందరూ మరణించారు.

నిజానికి ఈ చివరి వ్యక్తి ఆ బస్సులో ఉండడం వల్లనే, ఇంతవరకు ఆ బస్సుకు ప్రమాదం జరగలేదన్న సత్యాన్ని గ్రహించని మిగతా ప్రయాణీకులు, వారి స్వార్థం వల్ల, అందరూ మరణించడం జరిగింది. ఇంతసేపు అతను వారితో కలసి వుండడం వల్లనే, అతని పుణ్యఫలం, దీర్ఘాయుష్షు వారందరిని కాపాడింది. అదే ఎప్పుడైతే అతను బస్సును వీడాడో మరుక్షణం ఫలితం అనుభవించడానికి పరిస్థితులు అనుకూలంగా మారాయన్నమాట. అంతసేపు వారి పాపఫలాన్ని ఈ ఒక్కడి పుణ్యఫలం నిలువరించింది.

“కర్మ ఫలం” అంటే ఇదే ..

ఈ కథలో లాగానే మనం జీవితంలో సాధించిన విజయాలలో కానీ, ఆపదల నుండి రక్షించబడిన సందర్భాలలో కానీ, ఆ క్రెడిటంతా మనదే అని అనుకుంటాము. కానీ, ఆ పుణ్యఫలం మన తల్లిదండ్రులది కావచ్చు, జీవిత భాగస్వామిది కావచ్చు, పిల్లలది కావచ్చు, తోబుట్టువులది కావచ్చు, మన క్రింద పని చేసే వారిది కావచ్చు, లేదా మన శ్రేయస్సును కోరే స్నేహితులది – బంధువులది కావచ్చు. మనం ఈ రోజు ఇలా ఉన్నామంటే అది మన ఒక్కరి కృషి ఫలితమే కాదు. ఎంతో మంది పుణ్య ఫలితం, ఆశీర్వాద బలం, వారు వారి అదృష్టాన్ని పంచడం కూడా కారణమై ఉండవచ్చు.

ఒక సినిమాలో చెప్పినట్లుగా…. “బాగుండడం” అంటే ‘బాగా’ ఉండడం కాదు. అందరితో కలిసి ఆనందంగా కలసి ఉండడం అని అర్థం.