నీట్ యూజీ రీ-ఎగ్జామ్‌కు సుప్రీంకోర్టు లైన్ క్లియర్ చేసింది. పరీక్షను నిలిపి వేయాలంటే దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టివేసింది. దీంతో ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ మేరకు జూన్ 21న నీట్ రీ-ఎగ్జామ్ యథావిధిగా పరీక్ష జరగనుంది.
నీట్ రీ ఎగ్జామ్‌ను నిలిపివేయాలంటూ పలువురు అభ్యర్థులు అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం అందుకు నిరాకరిస్తూ.. పిటిషన్‌ను కొట్టివేసింది. నీట్ పరీక్ష సంబంధిత పిటిషన్‌లపై జస్టిస్ పీఎస్ నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చెప్పట్టనుందని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. ఈ నేపథ్యంలో తాము తక్షణ విచారణ చేపట్టలేమని తేల్చి చెప్పారు.
‘టెలిగ్రామ్’ పిటిషన్‌ను కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
నీట్ యూజీ పరీక్ష నేపథ్యంలో టెలిగ్రామ్‌పై ఈ నెల 22 వరకు తాత్కాలిక ఆంక్షలు విధించడాన్ని సవాల్ చేస్తూ ఆ సంస్థ దాఖలు చేసిన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. నీట్ యూజీ పరీక్ష నేపథ్యంలో టెలిగ్రామ్‌పై తాత్కాలిక ఆంక్షలు విధించడాన్ని సమర్థించింది. తాత్కాలిక ఆంక్షలు అవసరమేనని అభిప్రాయపడింది.
మరోవైపు నీట్ యూజీ రీ ఎగ్జామ్ అడ్మిట్ కార్డులపై ఎన్టీఏ స్పష్టత ఇచ్చింది. కొత్త అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకున్నవాళ్లు మళ్లీ డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదని వెల్లడించింది. అలా చేసుకోనివారికే సందేశాలు పంపుతున్నామని తెలిపింది. మే 3న జారీ చేసిన అడ్మిట్ కార్డులు ఈ పరీక్షకు చెల్లుబాటు కావని, కొందరికి వారి ప్రాధాన్య నగరాల్లో కొత్త పరీక్ష కేంద్రాలు కేటాయించినందున తాజా అడ్మిట్ కార్డులు తప్పనిసరిగా ఉపయోగించాలని సూచించింది.
