Bandla Ganesh | టాలీవుడ్ ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కుటుంబంలో ప్రస్తుతం పెళ్లి సందడి నెలకొంది. ఆయన కుమార్తె జనని బండ్ల వివాహం పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సూర్యతేజ చిలుకూరితో నిశ్చయమైంది. ఈ నేపథ్యంలో ఆదివారం (మే 3) ఉదయం వీరిద్దరి నిశ్చితార్థ వేడుకను ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాల నుంచి పలువురు ప్రముఖులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. మెగాస్టార్ చిరంజీవి తన సతీమణి సురేఖ, కుమార్తె సుస్మిత కొణిదెలతో కలిసి వచ్చి వేడుకలో పాల్గొన్నారు. అలాగే మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు కూడా హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
తారల సందడి..
అదేవిధంగా దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, హాస్యనటుడు బ్రహ్మానందం, రచయిత కోన వెంకట్, నటుడు శివాజీ, నిర్మాత సి. కల్యాణ్, దర్శకుడు శ్రీను వైట్ల తదితరులు హాజరై వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
బండ్ల గణేశ్‌కు అల్లుడిగా మారబోతున్న సూర్యతేజ చిలుకూరి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినవారు. ఆయన కుటుంబం రియల్ ఎస్టేట్‌తో పాటు పలు వ్యాపారాల్లో బలమైన స్థానం కలిగి ఉందని సమాచారం. రెండు కుటుంబాలూ వ్యాపార పరంగా బలంగా ఉండటంతో ఈ వివాహం ప్రత్యేక చర్చనీయాంశంగా మారింది.
నటుడిగా, నిర్మాతగా..
మహబూబ్‌నగర్ జిల్లాలో జన్మించిన బండ్ల గణేశ్, షాద్‌నగర్‌లో స్థిరపడి తన కెరీర్‌ను నటుడిగా ప్రారంభించారు. ఆ తర్వాత నిర్మాతగా మారి ‘పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌తో చేసిన ‘గబ్బర్ సింగ్’ చిత్రం ఆయనకు భారీ విజయాన్ని అందించింది. తదుపరి బాద్ షా, గోవిందుడు అందరివాడేలే, టెంపర్ వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో అగ్ర నిర్మాతగా ఎదిగారు.
కొంతకాలం నిర్మాణ రంగానికి దూరంగా ఉన్న బండ్ల గణేశ్, ఇప్పుడు ‘బీజీ బ్లాక్‌బస్టర్స్’ పేరిట కొత్త బ్యానర్‌ను ప్రారంభించి మళ్లీ సినిమాల నిర్మాణంలోకి రానున్నారు. కమర్షియల్ చిత్రాలతో పాటు కంటెంట్‌కు ప్రాధాన్యత ఇచ్చే సినిమాలను తీసుకురావాలని భావిస్తున్నారు.
ఇప్పటికే జనని నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన చిత్రాలు వైరల్ అవుతుండగా, అభిమానులు, నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. త్వరలో జరగబోయే వివాహ వేడుకపై కూడా ఆసక్తి నెలకొంది.
