Chinmayi | చిరంజీవి వ్యాఖ్యలపై చిన్మయి ఘాటు వ్యాఖ్య‌లు… కాస్టింగ్ కౌచ్ వాస్తవాలపై సంచలన కామెంట్స్

Chinmayi | సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ అనే సంస్కృతి లేదని మెగాస్టార్ చిరంజీవి ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. మన శంకర వరప్రసాద్ గారు మూవీ సక్సెస్ ఈవెంట్‌లో చిరంజీవి మాట్లాడుతూ… సినిమా ఇండస్ట్రీ అద్దంలాంటిదని, వ్యక్తి నిబద్ధతే అక్కడ ప్రతిబింబిస్తుందని, కాస్టింగ్ కౌచ్ అంటూ వ్యవస్థాగతంగా ఏమీ లేదని అభిప్రాయపడ్డారు.

  • By: sn |    movies |    Published on : Jan 27, 2026 10:07 AM IST
Chinmayi | చిరంజీవి వ్యాఖ్యలపై చిన్మయి ఘాటు వ్యాఖ్య‌లు… కాస్టింగ్ కౌచ్ వాస్తవాలపై సంచలన కామెంట్స్

Chinmayi | సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ అనే సంస్కృతి లేదని మెగాస్టార్ చిరంజీవి ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. మన శంకర వరప్రసాద్ గారు మూవీ సక్సెస్ ఈవెంట్‌లో చిరంజీవి మాట్లాడుతూ… సినిమా ఇండస్ట్రీ అద్దంలాంటిదని, వ్యక్తి నిబద్ధతే అక్కడ ప్రతిబింబిస్తుందని, కాస్టింగ్ కౌచ్ అంటూ వ్యవస్థాగతంగా ఏమీ లేదని అభిప్రాయపడ్డారు.ఈ వ్యాఖ్యలపై గాయని చిన్మయి శ్రీపాద సోమవారం (జనవరి 26) ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా ఘాటుగా స్పందించారు. సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు, కాస్టింగ్ కౌచ్ అనుభవాలను ఆమె వరుస పోస్టుల ద్వారా వెల్లడించారు. కాస్టింగ్ కౌచ్ అనేది మినహాయింపు కాదని, సర్వసాధారణంగా మారిపోయిన సమస్య అని చిన్మయి వ్యాఖ్యానించారు.

చిరంజీవి తరం గురించి ప్రస్తావించిన చిన్మయి… ఆయన వేరే కాలం నుంచి వచ్చిన వ్యక్తి అని, ఆ తరంలో నటీనటుల మధ్య గౌరవం, కుటుంబ స్నేహబంధాలు ఎక్కువగా ఉండేవని పేర్కొన్నారు. చిరంజీవి లెజెండరీ వ్యక్తులతో పని చేశారని, ఆ వాతావరణం నేటి పరిస్థితులకు భిన్నమని ఆమె అన్నారు. అయితే ప్రస్తుతం “కమిట్‌మెంట్” అనే పదానికి సినిమా పరిశ్రమలో పూర్తిగా వేరే అర్థం ఉందని చిన్మయి విమర్శించారు. మహిళలు పూర్తి కమిట్‌మెంట్ ఇవ్వకపోతే అవకాశాలు రావని, ఆ కమిట్‌మెంట్ అనేది చాలాసార్లు లైంగికంగా అర్థం చేసుకుంటారని ఆమె ఆరోపించారు. ఇంగ్లీష్-ఎడ్యుకేటెడ్ నేపథ్యం నుంచి వచ్చే వారు కమిట్‌మెంట్ అంటే వర్క్ స్కిల్, కళకు నిబద్ధత అని భావిస్తే అది తప్పు అవుతుందని చిన్మయి అన్నారు. చాలా సందర్భాల్లో పురుషులు మహిళల నుంచి లైంగిక ప్రయోజనాలను ఆశిస్తారని ఆమె స్పష్టం చేశారు.

తనకు తెలిసిన ఘటనలను ఉదాహరణగా చెబుతూ… ఒక లేడీ మ్యూజిషియన్‌ను స్టూడియోలో లైంగికంగా వేధించేందుకు ప్రయత్నించారని, ప్రాణభయంతో ఆమె సౌండ్ బూత్‌లో తాను తానే లాక్ చేసుకున్న ఘటనను చిన్మయి వెల్లడించారు. తర్వాత ఒక సీనియర్ వ్యక్తి వచ్చి ఆమెను కాపాడారని, కానీ ఆ ఘటన అనంతరం ఆ మహిళ పూర్తిగా ఇండస్ట్రీని వదిలేసిందని తెలిపారు. ఇలాంటి నేరాలకు పాల్పడినవారు ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా బయట తిరుగుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

మరొక ఘటనలో… ఓ వ్యక్తి మహిళకు అనవసరంగా పురుషాంగం ఫొటోలు పంపి, ఎలాంటి ప్రేరేపణ లేకుండా లైంగిక కోరికలు వ్యక్తం చేశాడని చిన్మయి పేర్కొన్నారు. లైంగిక వేధింపులు పరిశ్రమలో సాధారణ సమస్యగా మారిపోయాయని ఆమె వ్యాఖ్యానించారు. మీటూ ఉద్యమంపై కూడా చిన్మయి స్పందిస్తూ… షావుకారు జానకి వంటి సీనియర్ మహిళలు ఈ ఉద్యమాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదని విమర్శించారు. ఆఫీసుల్లో లైంగిక వేధింపుల గురించి మాట్లాడిన మహిళలను అవమానించడం బాధాకరమని ఆమె అన్నారు.

తన వ్యక్తిగత అనుభవాన్ని ప్రస్తావించిన చిన్మయి… లెజెండరీ గీత రచయిత వైరాముత్తు తనను లైంగికంగా వేధించారని, అది కూడా తన తల్లి అక్కడే ఉన్న సమయంలోనే జరిగిందని మరోసారి గుర్తు చేశారు. పని అవకాశాలకన్నా లైంగిక కోరికలకే ప్రాధాన్యం ఇచ్చే పురుషులే అసలు సమస్య అని ఆమె తన పోస్టును ముగించారు. ఈ వ్యవహారంతో చిరంజీవి వ్యాఖ్యలు, చిన్మయి స్పందన సినీ పరిశ్రమలో మహిళల భద్రత, గౌరవం, కాస్టింగ్ కౌచ్ వాస్తవాలపై మరోసారి పెద్ద చర్చను లేవ‌నెత్తుతున్నాయి.