Chiranjeevi | మెగా కవలల పేర్లపై చిరంజీవి ప్రశంసలు.. సంస్కృతి–ఆధ్యాత్మికత కలిసిన నామకరణం అంటూ హర్షం
Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి తన మనవళ్లు, మనవరాళ్ల పేర్ల విషయంలో కుమారుడు రామ్ చరణ్, కోడలు ఉపాసన కొణిదెల తీసుకున్న నిర్ణయంపై ప్రశంసల వర్షం కురిపించారు.
Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి తన మనవళ్లు, మనవరాళ్ల పేర్ల విషయంలో కుమారుడు రామ్ చరణ్, కోడలు ఉపాసన కొణిదెల తీసుకున్న నిర్ణయంపై ప్రశంసల వర్షం కురిపించారు. సనాతన భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా, ఆధ్యాత్మికతకు అద్దం పట్టేలా ఎంతో అర్థవంతమైన పేర్లను ఎంపిక చేశారని ఆయన అభినందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో చేసిన పోస్టులో తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు.
“మా రెండు చిన్ని సంతోషాలు” – చిరంజీవి భావోద్వేగం
“మా రెండు చిన్ని సంతోషాలకు పెట్టిన అందమైన పేర్లను ప్రశంసిస్తూ బంధువులు, స్నేహితులు, అభిమానుల నుంచి ఫోన్ కాల్స్, సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. మన సంస్కృతి, ఆలయాల ఆశీస్సులతో కూడిన పేర్లను ఎంపిక చేసుకున్నందుకు నాకు గర్వంగా ఉంది. ప్రియమైన ఉపాసన, చరణ్‌లకు నా హృదయపూర్వక ప్రేమ, అభినందనలు” అని చిరంజీవి పేర్కొన్నారు.
ఈ పేర్లలో భక్తి, సాంస్కృతిక స్మృతి, తరతరాలుగా మనలను నడిపిస్తున్న దైవిక కరుణ నిక్షిప్తమై ఉన్నాయని ఆయన భావోద్వేగంగా చెప్పారు.
‘దేవి’ పదం వెనుక కుటుంబ భావన
మనవరాలు “అన్వీర దేవి” పేరులో ‘దేవి’ అన్న పదాన్ని చేర్చడం తనకు ప్రత్యేకంగా సంతోషాన్నిచ్చిందని చిరంజీవి తెలిపారు. ఇది కుటుంబ పెద్దలపై గౌరవాన్ని, సంప్రదాయాల పట్ల ఉన్న మమకారాన్ని తెలియజేస్తుందని పేర్కొన్నారు. చరణ్ ఆలోచనా విధానం, కుటుంబ విలువలను గౌరవించే తత్వం ఈ నిర్ణయంలో స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు.
కవలల నామకరణం హాట్ టాపిక్
ఇటీవల రామ్ చరణ్–ఉపాసన దంపతులకు కవలలు (ఒక బాబు, ఒక పాప) జన్మించిన విషయం తెలిసిందే. ఈ చిన్నారులకు “శివరామ్ కొణిదెల”, “అన్వీర దేవి కొణిదెల” అని నామకరణం చేశారు. ఈ పేర్ల వెనుక ఉన్న అర్థాలను కూడా చరణ్ సోషల్ మీడియా ద్వారా వివరించడం అభిమానులను మరింత ఆకట్టుకుంది. బాబు పేరులో శివుడు–రాముడు అనే దైవ శక్తుల కలయిక ఉండగా, పాప పేరులో ధైర్యం, దైవత్వం ప్రతిబింబిస్తున్నాయని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
మెగా కుటుంబంలో ఆనంద వాతావరణం
జనవరి 31న జన్మించిన ఈ కవలలతో చరణ్–ఉపాసన దంపతులు రెండోసారి తల్లిదండ్రులయ్యారు. చిన్నారుల రాకతో మెగా కుటుంబంలో ఆనందం రెట్టింపైందని సన్నిహితులు అంటున్నారు. అభిమానులు కూడా ఈ పేర్లను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram