Chiru – Balayya | 2027 సంక్రాంతికి చిరు–బాలయ్య గ్యాంగ్‌స్టర్ వార్ .. టాలీవుడ్ బాక్సాఫీస్ మరోసారి హీటెక్కే ఛాన్స్!

Chiru - Balayya | టాలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రలో స్టార్‌డమ్‌తో పాటు పోటీని దశాబ్దాలుగా నిలబెట్టుకుంటూ వస్తున్న హీరోలుగా మెగాస్టార్ చిరంజీవి, నటసింహ నందమూరి బాలకృష్ణకు ప్రత్యేక గుర్తింపు ఉంది. వీరిద్దరి సినిమాలు విడుదలైన ప్రతీసారి అభిమానుల్లో సహజంగానే పోలికలు, చర్చలు, అంచనాలు మొదలవుతాయి.

  • By: sn |    movies |    Published on : Jan 30, 2026 5:15 PM IST
Chiru – Balayya | 2027 సంక్రాంతికి చిరు–బాలయ్య గ్యాంగ్‌స్టర్ వార్ .. టాలీవుడ్ బాక్సాఫీస్ మరోసారి హీటెక్కే ఛాన్స్!

Chiru – Balayya | టాలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రలో స్టార్‌డమ్‌తో పాటు పోటీని దశాబ్దాలుగా నిలబెట్టుకుంటూ వస్తున్న హీరోలుగా మెగాస్టార్ చిరంజీవి, నటసింహ నందమూరి బాలకృష్ణకు ప్రత్యేక గుర్తింపు ఉంది. వీరిద్దరి సినిమాలు విడుదలైన ప్రతీసారి అభిమానుల్లో సహజంగానే పోలికలు, చర్చలు, అంచనాలు మొదలవుతాయి. ఒక దశలో చిరంజీవి ఆధిపత్యం చూపిస్తే, మరో దశలో బాలకృష్ణ తనదైన మాస్ ఇమేజ్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ పోటీ ఆరోగ్యకరమైనదే అయినా, గతంలో అభిమానుల మధ్య మాటల యుద్ధాలు, వివాదాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా సంక్రాంతి సీజన్‌లో చిరు–బాలయ్య సినిమాలు పోటీపడితే ఆ హీట్ వేరే లెవల్‌లో ఉంటుందన్నది తెలుగు ప్రేక్షకుల అభిప్రాయం. గతంలోనూ సంక్రాంతికి వీరి సినిమాలు ఎదురెదురుగా బరిలోకి దిగడం వల్లే ఈ పోటీకి మరింత వెయిట్ వచ్చింది.

ఇప్పుడు మళ్లీ అలాంటి ఆసక్తికరమైన చర్చే టాలీవుడ్‌లో నడుస్తోంది. చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరూ గ్యాంగ్‌స్టర్ నేపథ్య కథల్లో నటిస్తున్నారన్న వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కించనున్న కొత్త చిత్రం గ్యాంగ్‌స్టర్ జానర్‌లో రూపొందనుందని సమాచారం. మాస్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ, పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో చిరును చూపించనున్నారట. ఈ చిత్రానికి ‘కాకా’ అనే టైటిల్ పరిశీలనలో ఉందన్న టాక్ కూడా వినిపిస్తోంది. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తెలుస్తోంది. చిరంజీవిని మళ్లీ ఫుల్ మాస్ అవతార్‌లో చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అదే సమయంలో నటసింహ బాలకృష్ణ కూడా గ్యాంగ్‌స్టర్ కథతోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారని ప్రచారం జరుగుతోంది. ‘వీరసింహారెడ్డి’ తర్వాత దర్శకుడు గోపీచంద్ మలినేనితో మరోసారి జట్టు కట్టేందుకు బాలయ్య సిద్ధమవుతున్నారని టాక్. మొదట ఈ ప్రాజెక్ట్ పౌరాణిక కథగా మొదలైనా, బడ్జెట్ పరిమితుల కారణంగా ఆ కథను పక్కనపెట్టి మరో కథతో ముందుకు వెళ్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో బాలకృష్ణ పాత్ర రఫ్ అండ్ టఫ్‌గా, పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్‌గా ఉంటుందని చెబుతున్నారు. బాలయ్య మాస్ ఇమేజ్‌కు గోపీచంద్ మలినేని మార్క్ ఎలా ఉండబోతుందన్న ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది.

ఇద్దరి సినిమాలు ఒకే జానర్‌లో ఉండటమే కాకుండా, 2027 సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉందన్న ప్రచారం సినీ వర్గాల్లో ఊపందుకుంది. అదే నిజమైతే, మరోసారి చిరు–బాలయ్య మధ్య బాక్సాఫీస్ వార్ తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే తరహా పరిస్థితి 2023 సంక్రాంతిలోనూ కనిపించింది. అప్పట్లో బాలకృష్ణ–గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ ఒక రోజు ముందే విడుదల కాగా, మరుసటి రోజే చిరంజీవి–బాబీ కాంబోలో ‘వాల్తేరు వీరయ్య’ థియేటర్లకు వచ్చింది. రెండు సినిమాలను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించడం విశేషం. ఆ సమయంలో రెండు చిత్రాలు కమర్షియల్‌గా సూపర్ హిట్స్‌గా నిలిచి, బాక్సాఫీస్ వద్ద పోటాపోటీగా వసూళ్లు సాధించాయి. అయితే చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరూ గ్యాంగ్‌స్టర్ పాత్రలతో ఒకే సంక్రాంతికి వస్తే టాలీవుడ్ బాక్సాఫీస్ రేంజ్ మరోసారి పీక్స్‌ను తాకడం ఖాయమన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు సినీ అభిమానులందరి చూపు 2027 సంక్రాంతి మీదే నిలిచింది.