Rock Star Games | బంగ్లాదేశ్‌లో దారుణంగా మారిన ప‌రిస్థితులు.. జేమ్స్ కచేరీపై ఇస్లామిక్ గుంపు దాడి,20 మందికి గాయాలు

Rock Star Games | బంగ్లాదేశ్‌లోని ఒక చారిత్రాత్మక పాఠశాల వార్షికోత్సవ వేడుకలు హింసాత్మక ఘటనతో అర్ధాంతరంగా ముగిశాయి. ఫరీద్‌పూర్ జిల్లాలో శుక్రవారం రాత్రి నిర్వహించిన పాఠశాల 185వ వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా జరగాల్సిన ప్రముఖ రాక్ సంగీతకారుడు జేమ్స్ (నాగర్ బౌల్ జేమ్స్) కచేరీపై ఇస్లామిక్ గుంపు దాడి చేయడంతో తీవ్ర గందరగోళం నెలకొంది.

  • By: sn |    movies |    Published on : Dec 27, 2025 8:40 AM IST
Rock Star Games | బంగ్లాదేశ్‌లో దారుణంగా మారిన ప‌రిస్థితులు.. జేమ్స్ కచేరీపై ఇస్లామిక్ గుంపు దాడి,20 మందికి గాయాలు

Rock Star Games | బంగ్లాదేశ్‌లోని ఒక చారిత్రాత్మక పాఠశాల వార్షికోత్సవ వేడుకలు హింసాత్మక ఘటనతో అర్ధాంతరంగా ముగిశాయి. ఫరీద్‌పూర్ జిల్లాలో శుక్రవారం రాత్రి నిర్వహించిన పాఠశాల 185వ వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా జరగాల్సిన ప్రముఖ రాక్ సంగీతకారుడు జేమ్స్ (నాగర్ బౌల్ జేమ్స్) కచేరీపై ఇస్లామిక్ గుంపు దాడి చేయడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ ఘటనలో సుమారు 20 మంది గాయపడగా, నిర్వాహకులు కచేరీని అకస్మాత్తుగా రద్దు చేశారు.

వేలాది మంది విద్యార్థులు, పూర్వ విద్యార్థులు హాజరైన ఈ కార్యక్రమంలో జేమ్స్ రాత్రి 9:30 గంటల ప్రాంతంలో వేదికపైకి రావాల్సి ఉంది. అయితే షో ప్రారంభానికి కొద్ది నిమిషాల ముందు బయటి వ్యక్తుల బృందం వేదికలోకి బలవంతంగా చొరబడేందుకు ప్రయత్నించింది. భద్రతా సిబ్బంది, నిర్వాహకులు అడ్డుకున్న వెంటనే ఆ గుంపు హింసాత్మకంగా మారింది. వేదికపైకి, ప్రేక్షకుల వైపుకు రాళ్లు, ఇటుకలు విసిరేయడంతో మైదానంలో భయాందోళనలు చెలరేగాయి.

దాడిలో ఎక్కువగా గాయపడిన వారు వేదిక ముందు భాగంలో గుమిగూడిన పాఠశాల విద్యార్థులేనని తెలుస్తోంది. ఇటుకలతో దాడి చేయడంతో పలువురికి తీవ్ర గాయాలు కాగా, విద్యార్థులు కొంతమంది దాడి చేసిన వారిని ప్రతిఘటించి క్యాంపస్ నుంచి వెనక్కి నెట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం జోక్యం చేసుకుంది.రాత్రి 10 గంటల ప్రాంతంలో, ఆర్గనైజింగ్ కమిటీ కన్వీనర్ డాక్టర్ ముస్తాఫిజుర్ రెహమాన్ షమీమ్ వేదికపైకి వచ్చి, శాంతిభద్రతలపై ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని ఫరీద్‌పూర్ జిల్లా యంత్రాంగం సూచనల మేరకు కచేరీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ గందరగోళం మధ్య జేమ్స్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుని భద్రతా రక్షణలో వేదిక నుంచి బయటకు వెళ్లిపోయారు. ఆయనకు లేదా ఆయన బ్యాండ్ సభ్యులకు ఎటువంటి గాయాలు సంభవించలేదని అధికారులు తెలిపారు.

వార్షికోత్సవ కార్యక్రమ ప్రచార, మీడియా ఉప కమిటీ కన్వీనర్ రాజిబుల్ హసన్ ఖాన్ మాట్లాడుతూ, కచేరీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, అయితే ఆకస్మికంగా చోటుచేసుకున్న హింస నిర్వాహకులను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. రాళ్లు, ఇటుకల దాడిలో 15 నుంచి 25 మంది విద్యార్థులు గాయపడినట్లు తెలిపారు. “ఈ దాడి ఎవరు చేశారు, ఎందుకు చేశారు అన్నది ఇంకా స్పష్టత లేదు. మరింత హింస జరగకుండా ఉండేందుకు కార్యక్రమాన్ని నిలిపివేయాల్సి వచ్చింది” అని ఆయన పేర్కొన్నారు.ఈ ఘటన బంగ్లాదేశ్‌లో భద్రత, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది.