Multistarrer | ఇండియన్ సినీ చరిత్రలో మల్టీస్టారర్ సినిమాలకు ఎప్పుడూ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించినా అభిమానుల్లో హైప్ పీక్స్‌కు చేరుతుంది. అలాంటిది ఒకే సినిమాలో ఏకంగా నలుగురు దిగ్గజ హీరోలు స్క్రీన్ షేర్ చేసుకుంటే… ఆ ఊహే అభిమానుల్లో గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. ఇప్పుడు అలాంటి అరుదైన ఫీట్‌కు వేదికగా మారుతోంది ‘జైలర్ 2’.
జైలర్ 2 చిత్రాన్ని దర్శకుడు నెల్సన దిలీప్ కుమార్ తెరకెక్కిస్తుండగా, సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే భారీ విజయాన్ని సాధించిన ‘జైలర్’ సినిమాకు ఇది సీక్వెల్ కావడంతో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.
నలుగురు స్టార్ హీరోలు ఒకే ఫ్రేమ్‌లో!
ఈ సారి మేకర్స్ మరింత భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో రజనీకాంత్‌తో పాటు బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ , కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
ఇప్పటికే ‘జైలర్’ మొదటి భాగంలో మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ గెస్ట్ అప్పియరెన్స్‌తో అభిమానులను అలరించగా, ఇప్పుడు సీక్వెల్‌లో వారి పాత్రలు మరింత విస్తరించనున్నాయి. అదనంగా షారుఖ్ ఖాన్ ఎంట్రీతో ఈ కాంబినేషన్ మరింత సెన్సేషన్‌గా మారింది.
ప్రస్తుతం హైదరాబాద్‌లోని బేగంపేట్ పరిసరాల్లో జరుగుతున్న షూటింగ్ షెడ్యూల్‌లో ఈ నలుగురు స్టార్ హీరోలు కలిసి కనిపించే భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు.
‘జైలర్’ సక్సెస్‌కు మించిన టార్గెట్
గతంలో విడుదలైన జైలర్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. రజనీకాంత్ స్టైల్, నెల్సన్ టేకింగ్, అలాగే సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చిన స్టార్ క్యామియోలు ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేశాయి. ఈ సక్సెస్‌తో ఇప్పుడు ‘జైలర్ 2’ను మరింత భారీ స్థాయిలో, పాన్ ఇండియా రేంజ్‌లో తీర్చిదిద్దుతున్నారు.
బాలయ్య మిస్సయ్యారా?
అయితే ఈ ప్రాజెక్ట్‌లో తెలుగు స్టార్ హీరో లేకపోవడం టాలీవుడ్ అభిమానుల్లో కొంత నిరాశ కలిగిస్తోంది. తొలుత నందమూరి బాలకృష్ణను ఒక కీలక పాత్ర కోసం తీసుకోవాలని దర్శకుడు భావించినట్లు వార్తలు వచ్చాయి. కానీ చివరికి ఆ స్థానం షారుఖ్ ఖాన్‌కు దక్కినట్లు తెలుస్తోంది. ఉత్తరాది మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
భారీ అంచనాలు.. కలెక్షన్ల సునామీ?
సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి అనిరుధ్ సంగీతం మరో ప్రధాన ఆకర్షణ కానుంది. నాలుగు ఇండస్ట్రీల అగ్ర హీరోలు ఒకే సినిమాలో కనిపించటం వల్ల ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
