RaghuKunche | టాలీవుడ్‌లో ప్రత్యేకమైన శైలితో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న దర్శకుడు పూరీ జగన్నాథ్ గురించి తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు రఘు కుంచే చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. పూరీతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, ఆయన వ్యక్తిత్వం, సక్సెస్ మంత్రం, అలాగే ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందుల వెనుక కారణాలను వివరించారు.
నన్ను సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ చేసింది పూరీనే..
రఘు కుంచే మాట్లాడుతూ… “నేను అడగకుండానే నాలో ఉన్న ప్రతిభను గుర్తించి నన్ను సింగర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా నిలబెట్టింది పూరీ జగన్నాథ్. ‘బాచి’ సినిమాలోనే నాకు అవకాశం ఇచ్చి, నా ఇష్టమైన పాటను పాడుకోమన్నాడు. తర్వాత ‘ఇడియట్’, ‘శివమణి’, ‘అమ్మానాన్న తమిళ అమ్మాయి’, ‘నేనింతే’ వంటి చిత్రాల్లో వరుసగా అవకాశాలు ఇచ్చి నాకు ఒక ప్లాట్‌ఫామ్ క్రియేట్ చేశాడు” అని తెలిపారు.
పూరీ బలమే.. బలహీనతగా మారింది
పూరీ వ్యక్తిత్వం గురించి మాట్లాడిన రఘు… పూరీ జగన్నాథ్ చాలా విజ్ఞుడు. అతనికి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అతని బలహీనత ఏమిటంటే… అతను మనుషుల్ని గుడ్డిగా నమ్మేస్తాడు. ఒకసారి ఎవ్వరినైనా నమ్మితే పూర్తిగా బాధ్యత అప్పగించి వెనక్కి తగ్గిపోతాడు. టెక్నీషియన్స్ పనిలో జోక్యం చేసుకోడు. ఇదే అతని గొప్పతనం అయినప్పటికీ… కొన్ని సందర్భాల్లో అదే అతనికి నష్టాన్ని తెచ్చింది అని అన్నారు.
కోటరీ, తప్పిదాలు.. ఆర్థిక నష్టాలు
ఇండస్ట్రీలో పూరీ చుట్టూ ఏర్పడిన కోటరీ వల్ల ఆయనకు కొన్ని సమస్యలు ఎదురయ్యాయని రఘు వెల్లడించారు. కొంతమందిపై అతను ఓవర్‌గా డిపెండ్ అయ్యాడు. అది అతనికి పెద్ద నష్టాలను తెచ్చింది. నేను వ్యక్తిగతంగా హెచ్చరించినా… అప్పటికే పరిస్థితి చేతికి అందకుండా పోయింది అని చెప్పారు.
నెలకు రూ.50 లక్షల వడ్డీ…
పూరీ ఎదుర్కొన్న కష్టాల గురించి మాట్లాడుతూ… “ఒక దశలో ఆయనపై భారీ అప్పులు వచ్చాయి. నెలకు రూ.50 లక్షల వరకు వడ్డీ కట్టేవారు. పరిస్థితులు చేతికి అందక… ఎంతో ఇష్టపడి నిర్మించుకున్న తన ఆఫీస్‌ను కూడా అమ్మేసి అప్పులు తీర్చాల్సి వచ్చింది. తర్వాత మళ్లీ అద్దె ఆఫీస్‌లో పని ప్రారంభించి, తిరిగి సక్సెస్ సాధించి ఇల్లు, ఆఫీస్ నిర్మించుకున్నారు” అని వివరించారు.
హిట్-ఫ్లాప్‌లపై ఒకే రియాక్షన్
పూరీ మానసిక ధైర్యం గురించి రఘు కుంచే ప్రత్యేకంగా ప్రస్తావించారు. “హిట్ అయినా… ఫ్లాప్ అయినా పూరీ రియాక్షన్ ఒకటే. ‘ఇడియట్’, ‘పోకిరి’ లాంటి బ్లాక్‌బస్టర్లు వచ్చినా ఆయనలో ఎలాంటి ఎగ్జైట్మెంట్ కనిపించదు. అలాగే ఫ్లాప్ వచ్చినా బాధ పడరు. అలాంటి స్థితి రావాలంటే తపస్సు చేయాలి. ఆయన చదివే పుస్తకాల వల్ల ఆ స్థిరత్వం వచ్చిందేమో” అని అన్నారు.
మొత్తానికి, పూరీ జగన్నాథ్ విజయం వెనుక ఉన్న సింప్లిసిటీ, నమ్మకం ఆయనను ప్రత్యేక దర్శకుడిగా నిలబెట్టినా… అదే నమ్మకం కొన్ని సందర్భాల్లో సమస్యలకూ కారణమైందని రఘు కుంచే వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. అయినప్పటికీ పడిపోయినా మళ్లీ లేచే ధైర్యం, స్థిరమైన మనస్తత్వమే పూరీని ఇప్పటికీ ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి.
