RajaSekhar | ‘బైకర్’తో మళ్లీ గర్జించిన యాంగ్రీ స్టార్.. చిరంజీవితో పోటీపడి ఎందుకు ఇంత డౌన్ అయ్యాడు..!

RajaSekhar | తెలుగు చలనచిత్ర పరిశ్రమలో యాక్షన్‌కు ప్రతీకగా నిలిచిన డాక్టర్ రాజ‌శేఖ‌ర్ మరోసారి తన సత్తా చాటుతున్నారు. ఒకప్పుడు టాలీవుడ్‌లో యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన, దశాబ్దాల పాటు అగ్రహీరోల సరసన పోటీ పడుతూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.

RajaSekhar | తెలుగు చలనచిత్ర పరిశ్రమలో యాక్షన్‌కు ప్రతీకగా నిలిచిన డాక్టర్ రాజ‌శేఖ‌ర్ మరోసారి తన సత్తా చాటుతున్నారు. ఒకప్పుడు టాలీవుడ్‌లో యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన, దశాబ్దాల పాటు అగ్రహీరోల సరసన పోటీ పడుతూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. చిరంజీవి, నంద‌మూరి బాల‌కృష్ణ‌, అక్కినేని నాగార్జున‌, వెంక‌టేష్ ద‌గ్గుబాటి వంటి టాప్ హీరోల మధ్య ఐదో స్టార్ హీరోగా వెలిగిన ఆయన, మధ్యలో కొంతకాలం వెండితెరపై కనిపించకుండా పోయారు.

తాజాగా శ‌ర్వానంద్ హీరోగా తెరకెక్కిన ‘బైకర్’ సినిమాలో ‘బుల్లెట్ సునీల్’ పాత్రతో తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో రాజశేఖర్ పాత్ర కథకు వెన్నెముకగా నిలవడం విశేషం. ముఖ్యంగా తండ్రీకొడుకుల మధ్య సాగే భావోద్వేగ సన్నివేశాల్లో ఆయన చూపించిన నటన ప్రేక్షకులను కదిలించింది. యాక్షన్ మాత్రమే కాకుండా ఎమోషన్‌ను కూడా సమర్థంగా పండించగల తన ప్రతిభను మరోసారి నిరూపించారు.

బైక‌ర్‌తో కొత్త ఊపు..

‘పిఎస్‌వి గరుడ వేగ’ చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినప్పటికీ, ఆ తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. అయితే ‘బైకర్’ విజయం ఆయనకు మళ్లీ కొత్త ఊపు తీసుకొచ్చింది. ఈ చిత్రంతో ఆయనకు తిరిగి మంచి అవకాశాలు వస్తాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అయితే రాజశేఖర్ కెరీర్ ఒక్కసారిగా డౌన్ అవ్వడానికి కొన్ని కీలక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా డబ్బింగ్ సమస్య ఆయన ఇమేజ్‌పై తీవ్ర ప్రభావం చూపింది. చాలా కాలం పాటు ఆయనకు సాయి కుమార్ వాయిస్ ప్రధాన బలంగా నిలిచింది. ఆ వాయిస్ మారిపోవడంతో ప్రేక్షకులకు ఓ వెలితి అనిపించింది. ఇదే ఆయన కెరీర్‌కు మొదటి దెబ్బగా మారింది.

ఆ సినిమాలు మిస్ చేసుకోవ‌డ‌మే..

ఇంకా ‘చంటి’, ‘జెంటిల్‌మ్యాన్’, ‘పెదరాయుడు’, ‘సూర్యవంశం’, ‘ఠాగూర్’, ‘లక్ష్మి నరసింహ’ వంటి భారీ విజయాలను సాధించిన సినిమాలను వివిధ కారణాల వల్ల ఆయన వదులుకోవడం కూడా కెరీర్‌పై ప్రభావం చూపింది. ఒకవేళ ఆ చిత్రాలు చేసి ఉంటే ఆయన స్టార్‌డమ్ మరింత పెరిగి ఉండేదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

అదే సమయంలో కొత్త తరం హీరోలైన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మ‌హేష్ బాబు, ఎన్టీఆర్ రంగప్రవేశం చేయడంతో ప్రేక్షకుల అభిరుచులు మారిపోయాయి. ఈ మార్పుల ప్రభావం రాజశేఖర్ వంటి సీనియర్ హీరోలపై కూడా పడింది. ఇటీవల ‘బైకర్’ ఈవెంట్‌లో రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలు కూడా అందరినీ కదిలించాయి. “దయచేసి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి” అంటూ ఆయన చేసిన విజ్ఞప్తి అభిమానులను భావోద్వేగానికి గురిచేసింది. ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలిన హీరో ఈ స్థాయికి రావడం చూసి సినీ ప్రేమికులు స్పందించారు. ఆ ప్రేమకు ప్రతిఫలంగా ‘బైకర్’ చిత్రానికి ప్రేక్షకులు మంచి ఆదరణ చూపించారు.

మాస్ ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైన రాజ‌శేఖ‌ర్..

1985లో సినీ రంగ ప్రవేశం చేసిన రాజశేఖర్, సుమారు 40 ఏళ్ల కెరీర్‌లో 75కి పైగా చిత్రాల్లో నటించారు. ‘అంకుశం’, ‘మగాడు’, ‘ఆహుతి’, ‘శివయ్య’, ‘అన్న’ వంటి సినిమాలతో మాస్ ప్రేక్షకులకు చేరువయ్యారు. పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో ఆయన నటన ప్రత్యేక గుర్తింపు పొందింది. అలాగే ‘అల్లరి ప్రియుడు’, ‘సూర్యుడు’, ‘మనసున్న మారాజు’ వంటి చిత్రాలతో కుటుంబ ప్రేక్షకులను కూడా మెప్పించారు.

ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులతో తిరిగి బిజీ అవుతున్న రాజశేఖర్, ఈ సెకండ్ ఇన్నింగ్స్‌లో మరిన్ని విజయాలు సాధిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. ‘బైకర్’తో మొదలైన ఈ కొత్త ప్రయాణం ఆయనకు మళ్లీ పూర్వ వైభవాన్ని తీసుకురావాలని సినీ వర్గాలు ఆకాంక్షిస్తున్నాయి.

Latest News