Sreeleela | దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డుపడ్డాడన్నట్లు యువ నటి శ్రీలీల పరిస్థితి మారింది. మంచి అవకాశాలు వరుసగా వస్తున్నా, అవి విజయాలుగా మారకపోవడం ఆమె సినీ ప్రయాణంపై ప్రభావం చూపుతోంది. శ్రీలీల చిన్నపాత్రలతో తన ప్రయాణాన్ని ప్రారంభించి, తర్వాత హీరోయిన్‌గా ఎదిగింది. ‘పెళ్లిసందడి’ సినిమాతో ప్రధాన నాయికగా పరిచయమై మంచి గుర్తింపు పొందింది. ఈ సినిమా విజయంతో ఆమెకు వరుస అవకాశాలు రావడం ప్రారంభమైంది.
తర్వాత రవితేజతో కలిసి నటించిన ‘ధమాకా’ చిత్రం మంచి విజయాన్ని అందించి ఆమెకు మరింత గుర్తింపు తీసుకొచ్చింది. అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలు మాత్రం ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయాయి. రామ్ పోతినేని తో చేసిన ‘స్కంద’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అలాగే నందమూరి బాలకృష్ణతో వచ్చిన ‘భగవంత్ కేసరి’ మంచి విజయం సాధించినా, అందులో ఆమె ప్రధాన నాయికగా కాకుండా కీలక పాత్రలో మాత్రమే కనిపించింది.
మహేష్ మూవీ కూడా హిట్ ఇవ్వలేకపోయింది..
తర్వాత నితిన్‌తో చేసిన ‘ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్’, మహేష్ బాబుతో చేసిన ‘గుంటూరు కారం’, అలాగే మళ్లీ రవితేజతో చేసిన ‘మాస్ జాతర’ వంటి సినిమాలు పెద్దగా విజయాన్ని అందించలేకపోయాయి. ఇటీవల పవన్ కళ్యాణ్ తో చేసిన ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా కూడా నిరాశ కలిగించింది.
ఇలా వరుసగా వచ్చిన సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో ఇప్పుడు అందరి దృష్టి ఆమె కొత్త చిత్రాలపై పడింది. ముఖ్యంగా ధనుష్ నటిస్తున్న కొత్త చిత్రంలో ఆమె కీలక పాత్రలో కనిపించనుంది. ఇందులో సాయి పల్లవి ప్రధాన నాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి రాజ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అదేవిధంగా మమ్ముట్టి కూడా ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాతో శ్రీలీల మళ్లీ విజయాల బాటలోకి వస్తుందనే ఆశలు వ్యక్తమవుతున్నాయి. ఇదే కాకుండా హిందీ చిత్రరంగంలో కూడా ఆమె అడుగుపెడుతోంది. అనురాగ్ బసు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో ఆమె నటిస్తోంది. శ్రీలలకి మంచి హిట్ ఒకటి పడితే ఇక తిరుగుండదు అంటున్నారు.
