ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి (94) కన్నుమూశారు. చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతూ తుది శ్వాసవిడిచారు. ఆమె గత కొంత కాలంగా శ్వాసకోశ, వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల మరోసారి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు చెన్నైలోని కావేరి ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు.
షావుకారు జానకి 1931 డిసెంబర్ 12న రాజమండ్రిలో జన్మించారు. ఆమె తొలి చిత్రం షావుకారు. ఆ సినిమా పేరుతోనే ఆమె షావుకారు జానకిగా పేరొందారు. జానకి అసలు పేరు శంకరమంచి జానకి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలలో 400 పైగా సినిమాలలో షావుకారి జానకి నటించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి అగ్ర కథానాయకుల సరసన నటించిన జానకి.. తమిళంలో ఎంజీఆర్, శివాజీ గణేశన్ తదితర ప్రముఖ నటులతో కలిసి పనిచేశారు. ఎన్టీఆర్, ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత లాంటి నలుగురు ముఖ్యమంత్రులతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న ఏకైక సీనియర్ నటిగా ఆమె అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నారు. ‘రోజులు మారాయి’, ‘కన్యాశుల్కం’, ‘జయం మనదే’, ‘పాండురంగ మహత్యం’, ‘డాక్టర్ చక్రవర్తి’, ‘అక్కాచెల్లెలు’, ‘బడిపంతులు’, ‘సంసారం ఒక చదరంగం’ తదితర చిత్రాలు ఆమెకు గుర్తింపును తీసుకొచ్చాయి. షావుకారు జానకి 2022లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం నుంచి కళైమామణి, ఆంధ్రప్రదేశ్ నుంచి నంది పురస్కారాలు, ఇతర జీవిత సాఫల్య పురస్కారాలు ఆమెను వరించాయి.