ఢిల్లీలో రాహుల్‌గాంధీ మెరుపు ధర్నా

ఢిల్లీలో సెంట్రల్ డీసీపీ కార్యాలయం ఎదుట రాహుల్ గాంధీ ఆకస్మిక ధర్నాకు దిగారు. పెల్లెట్‌గన్‌తో గాయపడిన విద్యార్థి సాహిల్ లోచాబ్‌కు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Aug 21, 2026, 2:49 pm IST
Read Time: 3 mins
ఢిల్లీలో రాహుల్‌గాంధీ మెరుపు ధర్నా

ఢిల్లీ సెంట్రల్‌ డీసీపీ కార్యాలయం బయట కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేతరాహుల్‌ గాంధీ ఆకస్మిక ధర్నాకు దిగారు. ఢిల్లీలో ఇటీవల సీజేపీ సారధ్యంలో జెన్‌-జీ ఆందోళనల్లో పెల్లెట్‌గన్‌ వల్ల గాయపడిన బాధిత 19ఏళ్ల విద్యార్ధి సాహిల్‌ లోచాబ్‌తో కలిసి ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ కన్నాట్‌ప్లేస్‌ పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని కోరారు. వారు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంతో పార్లమెంట్‌ స్ట్రీట్‌ పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి డీసీపీని కలిసి ఎఫ్‌ఐఆర్‌ కోసం డిమాండ్‌ చేశారు.

అయితే డీసీపీ కూడా రాహుల్‌ గాంధీ డిమాండ్‌ను తిరస్కరించడంతో రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 17న మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసినా కనీసం పట్టించుకోలేదని రాహుల్ తెలిపారు. దర్యాప్తు అధికారి పేరు, ఫోన్ నంబర్ కూడా ఇవ్వడం లేదని పోలీసుల తీరుపై రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసేవరకు తాను ఇక్కడి నుంచి కదిలేదిలేదంటూ ఢిల్లీ సెంట్రల్‌ డీసీపీ కార్యాలయం బయట బైఠాయించి రాహుల్‌ గాంధీ ధర్నాకు దిగారు. రాహుల్ వచ్చారని తెలియడంతో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు అక్కడికి తరలివచ్చారు. ప్రియాంక గాంధీ కూడా ధర్నా వద్దకు చేరుకుని రాహుల్ కు తోడుగా ధర్నాలో కూర్చున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొనడంతో ఢిల్లీ జాయింట్ కమిషనర్ నూపుర్ ప్రసాద్, డీసీపీ సచిన్ శర్మలు రాహుల్ గాంధీని కలిసి మాట్లాడారు. ధర్నాను విరమించాల్సిందిగా కోరారు.