type 2 diabetes । పెద్దయ్యాక టైప్ 2 డయాబెటిస్, హైపర్ టెన్షన్ రాకూడదంటే..

type 2 diabetes । ఇప్పుడు ఎవరిని కదిపినా డయాబెటిస్ అనో లేక పోతే బీపీ అనో చెబుతూ ఉంటారు. ఇవి ప్రస్తుత జీవనంలో భాగంగా మారిపోయాయి. అయితే బిడ్డ తల్లి గర్భాన పడినప్పటి నుంచి తొలి వెయ్యి రోజుల్లో తీపి పదార్థాలను తినడం ఎంత పరిమితం చేస్తే.. వారు పెద్దయ్యాక టైప్ 2 డయాబెటిస్, హైపర్ టెన్షన్ వంటి వాటి బారిన పడే అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయని తాజా అధ్యయనం ఒకటి పేర్కొన్నది. ‘సైన్స్’ జర్నల్‌లో ఈ మేరకు ఒక వ్యాసం ప్రచురితమైంది. ఇందులో అనేక ఆసక్తికర అంశాలు ఉన్నాయి. ఈ అధ్యయనం కోసం పరిశోధకులు యునైటెడ్ కింగ్‌డమ్‌లో రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా చక్కెరపై రేషన్ విధించిన సమయంలో గర్భం దాల్చిన 38,155 మంది ఆరోగ్య వివరాలను, రేషన్ ఎత్తివేశాక గర్భం ధరించిన 22,028 ఆరోగ్య వివరాలను అధ్యయనం చేశారు.
రేషన్ విధించిన సమయంలో తినే ఆహార పదార్థాల్లో చక్కెర శాతం ప్రస్తుత మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్నదని, రేషన్ ఎత్తేశాక అది దాదాపు రెట్టింపు అయిందని పరిశోధకులు తేల్చారు. బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు చక్కెర తక్కువ తీసుకున్నవారి పిల్లలకు మూడొంతుల రిస్క్ తొలగిపోయిందని గుర్తించారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఇతర ఆహార పదార్థాలపైనా రేషన్ ఉన్నప్పటికీ.. రేషన్ ఎత్తివేశాక ఇతర ఆహార పదార్థాలు తీసుకోవడం సాధారణంగానే ఉన్నది. కానీ.. చక్కెర మాత్రం రెట్టింపు అయింది. యుద్ధ కాలంలో రోజుకు సగటున 8 టీ స్పూన్ల చక్కెరను మాత్రమే తీసుకోగలిగారు. రేషన్ ఎత్తేశాక అది ఏకంగా 16 టీ స్పూన్లకు పెరిగింది. తొలి దశలో చక్కెర తీసుకోవడాన్ని తగ్గిస్తే చిన్నపిల్లల భావి ఆరోగ్యానికి శక్తిమంతమైన పునాదులు వేసినట్టేనని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.