Bone Health | 40 దాటిన మహిళల్లో ఎముకల సమస్యలు.. వైద్యులు ఏం చెప్పారంటే..
Bone Health విధాత: మహిళలకు ఎముకల ఆరోగ్యం (Bone Health) చాలా అవసరమన్న విషయం తెలిసిందే. 40 ఏళ్లు దాటిన తర్వాత వారిలో హార్మోన్ల మార్పులు చోటు చేసుకోవడంతో బోన్ స్ట్రెంగ్త్ తగ్గిపోయి అనారోగ్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా ఈస్ట్రోజన్ స్థాయిలు పడిపోవడంతో ఇలాంటి సమస్యలు తలెత్తుతాయని వైద్యులు పేర్కొంటున్నారు. దీని వల్ల ఆస్టియోపొరోసిస్ వచ్చే ప్రమాదముందని తెలిపారు. అందుకే సమస్య రాక ముందే సరైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం… ఎముకల ఆరోగ్యానికి అత్యవసరమని స్పష్టం చేశారు. […]

Bone Health
విధాత: మహిళలకు ఎముకల ఆరోగ్యం (Bone Health) చాలా అవసరమన్న విషయం తెలిసిందే. 40 ఏళ్లు దాటిన తర్వాత వారిలో హార్మోన్ల మార్పులు చోటు చేసుకోవడంతో బోన్ స్ట్రెంగ్త్ తగ్గిపోయి అనారోగ్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా ఈస్ట్రోజన్ స్థాయిలు పడిపోవడంతో ఇలాంటి సమస్యలు తలెత్తుతాయని వైద్యులు పేర్కొంటున్నారు. దీని వల్ల ఆస్టియోపొరోసిస్ వచ్చే ప్రమాదముందని తెలిపారు. అందుకే సమస్య రాక ముందే సరైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం… ఎముకల ఆరోగ్యానికి అత్యవసరమని స్పష్టం చేశారు.
కాల్షియం, విటమిన్ డి
కాల్షియం, విటమిన్ డిలను తీసుకోవడం ఎముకల ఆరోగ్యానికి మంచివని ఆర్థోపెడిక్ వైద్యులు చెబుతున్నారు. బలమైన ఎముకలు తయారుకావడానికి కాల్షియం సాయం చేస్తుండగా.. కాల్షియంను శరీరం సంగ్రహించుకోవడానికి విటమిన్ డి అక్కరకు వస్తుందని పేర్కొంటున్నారు.
ఒక మహిళకు రోజుకు సుమారు 1000 నుంచి 1200 మి.గ్రా కాల్షియం, 600 నుంచి 800 ఇంటర్నేషనల్ యూనిట్ల విటమిన్ డి అవసరమని ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డా.పరాగ్ సంచేతీ పేర్కొన్నారు. పాలు, పెరుగు వంటి డయరీ ఉత్పత్తులు, ఆకుపచ్చ కూరల్లో కాల్షియం విరివిగా ఉంటుందని.. ఎండలో కనీసం 30 నిమిషాలు ఉంటే విటమిన్ డి లభ్యతకు లోటు ఉండదని ఆయన సూచించారు.
వ్యాయామం తప్పనిసరి
ఎముకలను, కీళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి వ్యాయామం తప్పనిసరని నిపుణులు స్పష్టం చేశారు. వాకింగ్, జాగింగ్, డ్యాన్సింగ్, బరువు ఎత్తడం వంటివి ఇందుకు ఉపకరిస్తాయని సూచించారు. వారానికి కనీసం 2.5 గంటల పాటు ఓ మాదిరి ఏరోబిక్ వ్యాయామాలు, లేదా 1.5 గంటల పూర్తి స్థాయి వ్యాయామం తప్పనిసరిగా చేయాలని తెలిపారు.
జీవనశైలి మారాల్సిందే
బోన్ స్ట్రెంగ్త్ (Bone Strength) ను మెరుగుపరుచుకోవాలనుకునే మహిళలు ధూమపానం, మద్యపానం అలవాట్లు ఉంటే మానేయాలని పరాగ్ సంచేతీ సూచించారు. స్మోకింగ్ వల్ల ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గిపోతాయని, కాల్షియంను శోషించుకునే శక్తిని శరీరం కోల్పోతుందని వివరించారు. ఆల్కహాల్‌ను మానేస్తే మంచిదని… లేదంటే మరీ ఎక్కువ తీసుకోకుండా తక్కువ మోతాదులో తీసుకోవాలని తెలిపారు.
డాక్టర్‌ను సంప్రదించడం తప్పనిసరి
మహిళల వయసు 40 ఏళ్లు దాటిన తర్వాత వారిలో మోనోపాజ్ లక్షణాలు మెల్లమెల్లగా మొదలవుతాయి. ఈ సమయంలోనే వారు వైద్యుణ్ని సంప్రదించడం మంచిది. వారు ఇచ్చిన సూచనలు పాటిస్తూ ఉంటే ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కష్టమేం కాదని నిపుణులు పేర్కొన్నారు.