మీ ఆరోగ్య భవిష్యత్తును నిర్ణయిస్తున్న అదృశ్యశక్తులు ఏంటి?
గూగుల్ టైమ్‌లైన్ ఆధారంగా తిరస్కరించిన మెడిక్లెయిమ్ పై వినియోగదారుల కోర్టు కీలక తీర్పు, డిజిటల్ ప్రైవసీపై కొత్త చర్చకు దారితీసింది. లొకేషన్ రికార్డులు తప్పనిసరి ఆధారాలు కాదని, వైద్య సర్టిఫికేట్లు ప్రధానమని కోర్టు స్పష్టం చేసింది.

- ఇన్సూరెన్స్ కంపెనీలకు హెచ్చరిక
- గూగుల్ డేటా ఆధారంగా క్లెయిమ్ తిరస్కరించరాదు
- వినియోగదారుల కోర్టు సంచలన తీర్పు
సూరత్: డిజిటల్ గోప్యతకు సంబంధించిన ఒక ముఖ్యమైన తీర్పులో, వినియోగదారుల కోర్టు ఓ ఇన్సూరెన్స్ కంపెనీకి, గూగుల్ మ్యాప్స్ టైమ్‌లైన్ ఆధారంగా తిరస్కరించిన మెడిక్లెయిమ్‌ను చెల్లించమని ఆదేశించింది. ఈ తీర్పు వ్యక్తిగత లొకేషన్ సమాచారం వాడకం పై పెరుగుతున్న ఆందోళనలను మళ్లీ తెరమీదకు తెచ్చింది, ముఖ్యంగా ఆరోగ్య బీమా వంటి సున్నితమైన విషయాల్లో.
సిల్వాసాకు చెందిన వల్లభ్ మోట్కా అనే వ్యక్తి, రూ.6.52 లక్షల విలువైన మెడిక్లెయిమ్ పాలసీని గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ నుంచి కొనుగోలు చేశాడు. సెప్టెంబర్ 11 నుంచి 14, 2024 వరకు వైరల్ న్యుమోనియాతో సిల్వాసా అర్హామ్ హాస్పిటల్‌లో చికిత్స పొందిన ఆయన, రూ.48,251 క్లెయిమ్ కోసం అన్ని అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించాడు. అయినప్పటికీ, బీమా సంస్థ ఆయన క్లెయిమ్‌ను తిరస్కరించింది. కారణంగా గూగుల్ టైమ్‌లైన్ డేటాలో ఆయన హాస్పిటల్‌లో ఉన్న రికార్డు కనిపించలేదని పేర్కొన్నారు.
తన ప్రయత్నాలు ఫలించకపోవడంతో, మోట్కా 2025 మార్చిలో వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. ఆయన తరఫున న్యాయవాది ఏ.ఎన్. దేశాయి, డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్‌తో పాటు, ఆసుపత్రిలో పూర్తి వైద్య పర్యవేక్షణలో చికిత్స జరిగిందని వాదించారు. గూగుల్ లొకేషన్ డేటా ఆధారంగా సర్టిఫైడ్ వైద్య రికార్డులను తిరస్కరించడం సరికాదని స్పష్టం చేశారు. వల్సాద్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రెడ్రెస్సల్ కమిషన్ (CDRC), మోట్కా పక్షాన తీర్పు ఇచ్చింది. ఇన్సూరెన్స్ సంస్థ రూ.48,251 చెల్లించడంతో పాటు మానసిక వేధింపులకు పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. కోర్టు నివేదిక ప్రకారం, గూగుల్ టైమ్‌లైన్ డేటా తప్పుగా చూపించబడిందని నిర్ధారించారు.
న్యాయవాది దేశాయి మాట్లాడుతూ, కొంతమంది ఇన్సూరెన్స్ దర్యాప్తు అధికారులు రోగుల మొబైల్ ఫోన్లను యాక్సెస్ చేసి గూగుల్ టైమ్‌లైన్ డేటాను అక్రమంగా పరిశీలిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గూగుల్ డేటా పూర్తి కరెక్ట్‌గా ఉండకపోవచ్చు, లొకేషన్ సర్వీసులు ఆఫ్‌లో ఉండవచ్చు లేదా నెట్‌వర్క్ సమస్యల వల్ల రికార్డింగ్ లోపించవచ్చు. ముఖ్యంగా, న్యాయస్థానాలు గూగుల్ అధికారుల ధృవీకరణ లేకుండా టైమ్‌లైన్ సమాచరాన్ని చట్టపరమైన ఆధారంగా పరిగణించరాదని ఆయన తెలిపారు.