Coriander Epilepsy | మూర్ఛ వ్యాధికి కొత్తిమీర మందు!

ఆకుపచ్చని కూరగాయలంటే ముందుగా విటమిన్ ఎ గుర్తుకువస్తుంది. అయితే, కూరలకు మంచి వాసననిచ్చే కొత్తిమీర మాత్రం ఇక మెదడుకు ఆరోగ్య రక్ష కానుంది.

  • By: TAAZ |    health |    Published on : Aug 14, 2025 8:04 PM IST
Coriander Epilepsy | మూర్ఛ వ్యాధికి కొత్తిమీర మందు!

Coriander Epilepsy | కొత్తిమీర సువాసనలకే కాదు.. మూర్ఛ వ్యాధికి మంచి మందు కూడా అంటున్నారు కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు. రోజూ రకరకాల వంటల్లో వాడే కొత్తిమీర గురించి మనం పెద్దగా పట్టించుకోం గానీ మెదడు ఆరోగ్యంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందంటున్నారు. సాధారణంగా తలనొప్పి లాంటివి ఉన్నప్పుడు వికారంగా ఉండటం, వాంతుల వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇలాంటప్పుడు వాటిని తగ్గించడంలో కొత్తిమీర ఉపయోగపడుతుందని ఎంతోకాలంలో నమ్ముతున్నారు పరిశోధకులు. దీని వెనుక అసలు కారణమేంటో తాజా పరిశోధనలు స్పష్టం చేశాయి. కొత్తిమీరలో మూర్ఛవ్యాధికి చికిత్స కల్పించే మందు ఉన్నట్లు గుర్తించారు శాస్త్రవేత్తలు.

కొత్తిమీరకు, మెదడు ఆరోగ్యానికి మధ్య సంబంధం గురించి చాలాకాలంగా అధ్యయనాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆసక్తికరమైన విషయం బయటపడింది. కొత్తిమీర ఆకుల్లోని కొన్ని రసాయనాలు మెదడులో పొటాషియం ఛానళ్లను యాక్టివేట్ చేస్తున్నట్టు గుర్తించారు. మూర్ఛ వ్యాధి ఉన్నవాళ్లలో కేసీఎన్ క్యూ పొటాషియం ఛానళ్లు కొన్ని రకాల లక్షణాలను నియంత్రిస్తాయి. ఈ ఛానళ్ల పైనే కొత్తిమీరలోని పదార్థాలు ప్రభావం చూపిస్తున్నాయని ఇప్పుడు తేలింది. కొత్తిమీరలో ఉండే డొడిసినాల్ అనే రసాయనం ఈ పొటాషియం ఛానళ్లను యాక్టివేట్ చేస్తున్నదని ఈ అధ్యయనాల్లో కీలకపాత్ర పోషించిన శాస్త్రవేత్త జెఫ్ అబోట్ తెలిపారు. జంతువులపై ప్రయోగాలు జరిపినప్పుడు వాటిలో మూర్ఛ వ్యాధిని తగ్గించడంలో డొడిసినాల్ ఉపయోగపడుతున్నట్టు గ్రహించారు. మూర్ఛ వ్యాధితో పాటు వాంతులు, వికారాల వంటి లక్షణాలకు మెరుగైన మందులు తయారుచేయడంలో ఈ అధ్యయనం కీలకం అవుతున్నట్టు ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి..

Bihar SIR controversy | ఆ 65 లక్షల మంది ఓటర్ల తొలగింపునకు కారణాలు చెప్పండి..: ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశం
AI Phone Tapping | ఫోన్ సంభాషణలను ట్యాపింగ్ చేయనున్న ఏఐ!
Diabetes Prevention | కొవ్వులతో డయాబెటిస్‌కి చెక్?