Diabetes Prevention | కొవ్వులతో డయాబెటిస్‌కి చెక్?
ఫ్యాటీ ఫుడ్ తీసుకోవడమే అన్ని జబ్బులకు మూలం అని చాలా కాలంగా నమ్ముతూ ఉన్నాం. కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారంతో ఊబకాయం, తద్వారా డయాబెటిస్, ఇతర సమస్యలు వస్తాయని కూడా అనుకున్నాం. ఈ మధ్య కాలంలో కార్బోహైడ్రేట్స్ తీసుకోవడమే పెద్ద సమస్య అని కూడా అంటున్నారు. అంతేకాదు, కార్బోహైడ్రేట్స్ తో ఎంత నష్టమో, కొవ్వులతో అంత లాభమంటున్నారు పరిశోధకులు.

Diabetes Prevention | కొవ్వులు ఎక్కువగా తీసుకుంటే అధిక బరువు, స్థూలకాయం, గుండెజబ్బులు… ఇలా లిస్టు పెద్దదే. అయితే మిగతా జబ్బుల విషయమేమో గానీ అధిక కొవ్వుల వల్ల షుగర్ లెవల్స్ పెరిగినప్పటికీ మళ్లీ వాటిని తగ్గించగలిగే టెక్నిక్ తెలిసింది. టిట్ ఫర్ టాట్ లాగా అవే కొవ్వులపై పనిచేసే ప్రొటీన్ ద్వారా డయాబెటిస్ వ్యాధిని నివారించవచ్చని ఇటీవలి పరిశోధనలు అంటున్నాయి.
డయాబెటిస్ మీద నిరంతర పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. దానికి చెక్ పెట్టేటందుకు శాస్త్రవేత్తలు అధ్యయనాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఓ తాజా ప్రయత్నం వినూత్నమైన విషయాన్ని బయటపెట్టింది. మాక్స్ ప్లాంక్ ఇనిస్టిట్యూట్ ఫర్ మెటబాలిక్ రీసెర్చ్ కి చెందిన సైంటిస్టుల అధ్యయనం షుగర్ వ్యాధిగ్రస్థులకు తీపి కబురు చెప్పింది. కొవ్వులు ఎక్కువగా తీసుకున్నప్పటికీ అవి లివర్ లో మెటబొలైజ్ కావడం వల్ల డయాబెటిస్ రాకుండా నివారించే అవకాశముందని అంటున్నారు.
మెటబోలిక్ వ్యాధులకు, సిరమైడ్ అనే ఒక రకమైన కొవ్వులకు మధ్య సంబంధం
చర్మం కింద ఉండే అడిపోజ్ కణజాలంలో ఫ్యాట్స్ స్టోర్ అయి ఉంటాయి. అందుకే ఎక్కువ కాలం కొవ్వులు తీసుకుంటూ ఉంటే లివర్ లో కూడా ఇవి పేరుకుపోతాయి. తద్వారా ఫ్యాటీ లివర్ కూడా రావొచ్చు. దీనివల్ల ఇన్సులిన్ చర్యలకు శరీరం స్పందించే వేగం తగ్గిపోతుంది. ఫలితంగా టైప్ 2 డయాబెటిస్ రావొచ్చు. ఇలాంటి మెటబోలిక్ వ్యాధులకు, సిరమైడ్ అనే ఒక రకమైన కొవ్వులకు మధ్య సంబంధం ఉన్నట్టు గుర్తించారు సైంటిస్టులు. ఇదే ఇప్పుడు డయాబటిస్ నివారణకు కీలకమైంది. ఈ సిరమైడ్ ఫ్యాట్స్ లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ను ప్రేరేపిస్తున్న వాటిని ఇప్పుడు కనుక్కున్నారు. ఈ ఫ్యాట్స్ యాక్టివిటీని అడ్డుకోగలిగే ప్రొటీన్ ను తాజా అధ్యయనాల్లో గుర్తించారు. ఈ ప్రోటీన్ ను నియంత్రించడం ద్వారా కాలేయంలో కొవ్వులు పేరుకుపోవడాన్ని ఆపగలిగారు. దీంతో పాటు రక్తంలో గ్లూకోజ్ మోతాదు కూడా తగ్గించగలిగామన్నారు అధ్యయనకారులు. అంటే కొవ్వులు ఎక్కువగా తీసుకున్నప్పటికీ, ఈ ప్రత్యేకమైన సిరమైడ్ ప్రొటీన్లను కంట్రోల్ చేయడం ద్వారా డయాబెటిస్ ను నివారించొచ్చన్నమాట. ఈ పరిశోధన కేవలం డయాబెటిస్ విషయంలో మాత్రమే జరిగింది. కాబట్టి ఈ ప్రక్రియతో డయాబెటిస్ ను కంట్రోల్ చేయవచ్చేమో గానీ కొవ్వులు ఎక్కువగా తీసుకోవడం వల్ల మిగతా జబ్బుల రిస్కు మాత్రం ఉండనే ఉంది. కాబట్టి ఏది ఏమైనా ఫాస్ట్ ఫుడ్స్, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఫుడ్ జోలికి వెళ్లకపోవడమే మంచిది.
ప్రొటీన్లు ఎక్కువ తీసుకుంటే…?
మనం తీసుకునే ప్రొటీన్ల వల్ల కండరాలు నిర్మాణమవుతాయి. చర్మం, ఇతర అవయవాలకు పోషణ లభిస్తుంది. కణజాలం మరమ్మత్తు అవుతుంది. కొత్త కణాలు నిర్మాణమవుతాయి. వ్యాయామం చేసేవారు, శారీరక శ్రమ ఎక్కువగా ఉండే ఎక్కువ ప్రోటీన్లను తీసుకోవాలి. వారు తమ శరీరంలో ఒక కిలో బరువుకు సుమారుగా 1.4 నుంచి 2 గ్రాముల వరకు ప్రోటీన్లను తీసుకోవాలి. అంటే.. సుమారుగా 70 కిలోల బరువు ఉండే వ్యాయామం చేసే ఒక వ్యక్తి నిత్యం 98 నుంచి 140 గ్రాముల వరకు ప్రోటీన్లను తీసుకోవాలి. వ్యాయామం చేసే ముందు లేదా చేసిన తరువాత కచ్చితంగా ప్రోటీన్లు ఉన్న ఆహారాలను తినాలి. దీంతో కండరాలు మరమ్మత్తు అవుతాయి. శరీరానికి పోషణ లభిస్తుంది. అందుకే కార్బోహైడ్రేట్ల కన్నా ప్రొటీన్లు ఎక్కువగా తీసుకోమంటున్నారు వైద్యులు.
ఇవి కూడా చదవండి..
Rainy Season Health Tips | ఈ ఇన్‌ఫెక్షన్ల కాలంలో ఇమ్యూనిటీ పెంచేదెలా?
health and digestion | ఆహారాన్ని నెమ్మదిగానే ఎందుకు తినాలి?