Health News | పసుపు రంగు దంతాలా.. మెరిసిపోయేందుకు చిట్కాలివిగో

ఉప్పు పేస్టు... బొగ్గు పేస్టు... వేప పేస్టు... అంటూ హోరెత్తించే ప్రకటనలతో దంతాల పచ్చదనం పోయి, మెరిసిపోతాయేమో అనుకుంటాం. ఓసారి ట్రై చేద్దామని కూడా అనుకుంటాం. యాడ్స్ లో అందరి దంతాలూ తెల్లగా మెరిసిపోతూ కనిపిస్తుంటాయి మరి. అయితే ఏ పేస్టు వాడినా కొందరిలో దంతాల పచ్చదనం ఎంతకీ పోదు. ఇలాంటప్పుడు ఏం చేయాలో చెబుతున్నారు డెంటిస్టులు.

Health News | పసుపు రంగు దంతాలా.. మెరిసిపోయేందుకు చిట్కాలివిగో

Health News | ఒక సమస్యకు పరిష్కారం కావాలంటే దాని వెనుక కారణం తెలుసుకోవడం అవసరం. తినే ఆహారం దగ్గరి నుంచి మన ఆరోగ్య పరిస్థితి వరకు ఎన్నో కారణాలు ఎల్లో టీత్ కి దారితీస్తాయి. దంతాలపై పాచి ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోవడం సాధారణంగా కనిపించే కారణం.

  • దంతాలపై ఉండే ఎనామిల్ ట్రాన్స్ పరెంట్ గా, తెల్లగా ఉంటుంది. పళ్లు బలంగా ఉండటానికి దోహదపడేది ఈ పొరే. ఎనామిల్ కింద డెంటిన్ కూడా దంతాలను పటిష్టంగా ఉంచుతుంది. ఎనామిల్ మందంగా ఉన్నప్పుడు దంతాలు తెల్లగా మెరిపోతాయి. అది అరిగిపోయిన కొద్దీ పళ్లు పచ్చగా అవుతాయి. వయసుతో పాటు ఎనామిల్ తగ్గిపోతుంది. అందుకే పెద్దవాళ్లలో దంతాలు పసుపు రంగుకి మారి కనిపిస్తుంటాయి. దంత శుభ్రత లోపిస్తే ఎనామిల్ పై మరకలు పడతాయి.
  • ఆహారం ఎక్కడైనా దంతాల మధ్య ఉండిపోయినప్పుడు సూక్ష్మజీవులు పెరిగి, దంతాలపై పాచి ఏర్పడుతుంది. దీని నుంచి వెలువడే ఆమ్లాల వల్ల ఎనామిల్ పొర దెబ్బతింటుంది. తద్వారా పళ్లు పసుపు రంగులోకి మారుతాయి. దీన్ని నిర్లక్ష్యం చేస్తే దంతాలపై రంధ్రాలు ఏర్పడి, పిప్పిపళ్ల సమస్య వస్తుంది. వీటిని కూడా నిర్లక్ష్యం చేస్తే చివరికి దంతాలు పూర్తిగా దెబ్బతిని, ఊడిపోతాయి. దంతాలపై ఏర్పడే కావిటీలు ఎనామిల్ ను దాటి డెంటిన్ పొరకు కూడా విస్తరించాయంటే ఇక దంతాలు పూర్తిగా దెబ్బతిన్నట్టే.
  • ద్రాక్ష, నేరేడు, దానిమ్మ వంటి అసిడిక్ నేచర్ ఉన్న సిట్రస్ పండ్లు, రెడ్ వైన్, కూల్ డ్రింక్స్, పొగాకు ఉత్పత్తుల వల్ల కూడా పళ్లు పసుపు రంగులోకి మారుతాయి. కాఫీ, టీ, వైన్ లాంటి వాటిలో ఉండే టానిన్లు ఎనామిల్ పై మరకలను ఏర్పరుస్తాయి.
  • చిగుళ్ల వ్యాధికి, మొటిమల కోసం వాడే కొన్ని రకాల మందులు కూడా దంతాలను పచ్చగా చేస్తాయి. కొన్ని రకాల బీపీ మందులు కూడా దంతాల మెరుపుపై ప్రభావం చూపిస్తాయి.
  • ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉన్న నీటిని తాగడం వల్ల కూడా దంతాలు పూర్తిగా ఎల్లో అవుతాయి.

ఏం చేయాలి?

  • రోజుకు రెండు సార్లు బ్రష్ చేసుకోవాలి.
  • ఆరు నెలలకు ఒకసారి డెంటిస్టును కలిసి పాచి గట్టిపడకుండా స్కేలింగ్ చేయించుకోవాలి.
  • బ్రషింగ్ తరువాత ఫ్లాసింగ్ చేసుకోవడం కూడా ముఖ్యం.
  • ఆమ్ల స్వభావం ఉన్న పండ్లు, అసిడిక్ ఫుడ్ కి దూరంగా ఉండాలి.
  • రాత్రిపూట కాఫీ, టీ లు తాగొద్దు.
  • పొగతాడం, పాన్, గుట్కా లాంటి అలవాట్లు మానేయాలి.
  • ఫైబర్ ఎక్కువగా ఉండే మంచి ఆహారం తీసుకోవాలి.