బ్రేక్‌ఫాస్ట్ ఆలస్యమైతే గుండెపోటు ముప్పు.. వెల్లడించిన అధ్యయనం
టిఫిన్, రాత్రి భోజనాలను ఆలస్యం చేస్తే గుండెపోటు (Heart Attack) ముప్పు తప్పదని ఓ అధ్యయనం స్పష్టం చేసింది
టిఫిన్, రాత్రి భోజనాలను ఆలస్యం (Delaying Breakfast) చేస్తే గుండెపోటు (Heart Attack) ముప్పు తప్పదని ఓ అధ్యయనం స్పష్టం చేసింది. సుమారు లక్ష మంది వలంటీర్ల జీవన విధానాన్ని ఏడేళ్ల పాటు పరిశీలించి (Study) న అనంతరం పరిశోధకులు ఈ విషయాన్ని నిర్ధారించారు. ఈ అధ్యయనం వివరాలను నేచర్ జర్నల్‌లో ప్రచురించారు. ఈ మొత్తం ఏడేళ్ల పరిశీలనలో 2 వేల గుండెపోటు ఘటనలు వారి దృష్టికి రాగా.. దానికి గల కారణాలను శాస్త్రవేత్తలు అన్వేషించారు. దాని ప్రకారం… నిద్ర లేచిన తర్వాత తీసుకునే ఆహారాన్ని (బ్రేక్‌ఫాస్ట్) ఆలస్యం చేయడం గుండెపోటుకు దారి తీస్తోందని తేలింది.
బ్రేక్‌ఫాస్ట్ ఆలస్యం అయ్యే కొద్దీ ప్రతి గంటకూ గుండెపోటు వచ్చే ముప్పు ఆరు శాతం పెరుగుతుందని అధ్యయనంలో వెల్లడైంది. పదే పదే ఏదైనా నెమరేస్తుండటం కొంతమందికి అలవాటు. అయితే ఈ అలవాటు వల్ల ముంచుకొచ్చే ముప్పేమీ లేదని పరిశోధకులు స్పష్టం చేశారు. మరోవైపు రాత్రి తొమ్మిది దాటిన తర్వాత భోజనం చేస్తే గుండెపోటు వచ్చే ముప్పు 28 శాతం పెరుగుతుందని అధ్యయనకర్తలు వెల్లడించారు. బ్లడ్ షుగర్, రక్తపోటులో వచ్చే విపరీత మార్పులే దీనికి కారణం.
మనం ఆలస్యంగా భోజనం చేయడం వల్ల రక్తపోటు స్వల్పంగా ఉండాల్సింది కాస్తా పెరుగుతుంది. ఈ పెరిగిన రక్తపోటు రక్తం గడ్డకట్టడానికి, గుండెపోట్లకు,గుండె నొప్పికి దారి తీస్తుంది. ఈ ముప్పు తొమ్మిది తర్వాత ప్రతి గంటకూ 8 శాతం పెరుగుతుంది. అంతేకాకుండా ఈ అధ్యయనం ఎక్కువగా మహిళలపై దృష్టి పెట్టింది. అందుకు అనుగుణంగానే అధ్యయనంలో పాల్గొన్న 7 వేల మంది వాలంటీర్లలో 80 శాతం మంది వారే ఉండేలా జాగ్రత్తలు తీసుకుంది.
మహిళలు ఒక వేళ బ్రేక్‌ఫాస్ట్‌ను ఆలస్యం చేస్తే గుండెనాళాలు పూడుకుపోయే ముప్పు ఏకంగా 11 శాతం పెరుగుతుంది. పురుషుల్లో ఈ సమస్య తక్కువగానే కనపడటం గమనార్హం. అదే విధంగా రాత్రి సమయాల్లో పూర్తిగా ఏ ఆహారమూ తీసుకోకుండా ఉంటే అనారోగ్యం వచ్చే ముప్పు ప్రతి గంటకూ 7 శాతం తగ్గుతుందని ఈ అధ్యయనం సూచించింది. మొత్తానికి రాత్రి భోజనాన్ని త్వరగా ముగించేసి.. బ్రేక్‌ఫాస్ట్ ముందు ఏమీ తినకుండా త్వరగా ఆ పని కానిచ్చేస్తే.. గుండె ఆరోగ్యాన్ని పదిలపరుచుకున్న వాళ్లం అవుతామని పరిశోధకులు స్పష్టం చేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram