Hypertension Medication | బీపీ నార్మల్ ఉంటే మందులు మానొచ్చా? అపోహలు, వాస్తవాలు!

ఒకప్పుడు 50 ఏళ్లు దాటినవాళ్లకే బీపీ సమస్య కనిపించేది. కాని ఇది పెద్దవాళ్ల సమస్య కానేకాదు. ఇప్పుడు రెండు పదుల వయసులోనే బీపీ ఉన్నవాళ్లు ఉంటున్నారు. చిన్న పిల్లల్లో కూడా అడపాదడపా బీపీ కనిపిస్తోంది.  ఒకసారి బీపీ వచ్చిందంటే టైంకి తిని, మందులు వేసుకోవడం అవసరం. అయితే బీపీ విషయంలో చాలామందికి అనేక రకాల అనుమానాలుంటాయి. అపోహలతో మందులు వేసుకోరు. అందుకే సాధారణంగా ఉండే అపోహల్లో వాస్తవాలేంటో చూద్దాం.

  • By: TAAZ    health    Aug 27, 2025 12:08 PM IST
Hypertension Medication | బీపీ నార్మల్ ఉంటే మందులు మానొచ్చా? అపోహలు, వాస్తవాలు!

Hypertension Medication | ఒకప్పుడు 50 ఏళ్లు దాటినవాళ్లకే బీపీ సమస్య కనిపించేది. కాని ఇది పెద్దవాళ్ల సమస్య కానేకాదు. ఇప్పుడు రెండు పదుల వయసులోనే బీపీ ఉన్నవాళ్లు ఉంటున్నారు. చిన్న పిల్లల్లో కూడా అడపాదడపా బీపీ కనిపిస్తోంది.  ఒకసారి బీపీ వచ్చిందంటే టైంకి తిని, మందులు వేసుకోవడం అవసరం. అయితే బీపీ విషయంలో చాలామందికి అనేక రకాల అనుమానాలుంటాయి. అపోహలతో మందులు వేసుకోరు. అందుకే సాధారణంగా ఉండే అపోహల్లో వాస్తవాలేంటో చూద్దాం.

వయసు పెరుగుతున్న కొద్దీ బీపీ పెరగడం నార్మల్ అనీ, ప్రత్యేకంగా చికిత్స అవసరం లేదనీ అనుకుంటుంటారు. కాని ఇది పెద్ద అపోహ. చిన్నవయసులోనే కూడా బీపీ రావొచ్చు. దీనికీ వయసుతో సంబంధం లేదు. ఇటీవలి కాలంలో స్కూల్ పిల్లల్లో కూడా బీపీ పెరగడం చూస్తున్నాం. బరువు పెరగడం, సరైన వ్యాయామం లేకపోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఏ వయసువాళ్లయినా బీపీ 130/80 కన్నా ఎక్కువ ఉందంటే హానికరమే. వెంటనే చికిత్స అవసరం. మందులు మొదలుపెట్టాల్సిందే. మందులు వాడుతుంటేనే బీపీ కంట్రోల్ లో ఉంటుంది. ఒక్కరోజు కూడా మందులు ఆపేయొద్దు. అయితే మందుల వల్ల బీపీ నార్మల్ కి రాగానే ఇక బీపీ తగ్గిపోయిందనుకుంటారు. ఇక మందులు అవసరం లేదులే వాటిని వేసుకోవడం ఆపేస్తుంటారు కూడా. ఇది అస్సలు మంచిది కాదు. మందులు వాడుతుంటేనే బీపీ కంట్రోల్ లో ఉంటుంది. మానేస్తే మళ్లీ ఎక్కువ అవుతుంది. రిస్కు ఇంకా పెరుగుతుంది. ఒకసారి బీపీ వచ్చిందంటే ఇక జీవితాంతం మందులు వాడవలసిందే. ఎప్పుడైనా డాక్టర్ చెప్తే తప్ప మానొద్దు. మందు తీసుకునే మోతాదులు కూడా సొంతంగా మార్చొద్దు.

లక్షణాలు లేకుంటే చికిత్స అవసరం లేదా?

బీపీ ఉంటే ఏమైనా సమస్యలు ఉండాలి కదా. లక్షణాలేవీ లేవు కదా అని చికిత్స తీసుకోరు. ఇది సరికాదు. ఏ సమస్యలు కనిపించకపోయినా ఒకసారి బీపీ ఉందని నిర్ధారణ అయిందంటే ఇక చికిత్స కంటిన్యూ చేయాల్సిందే. సాధారణంగా 95 శాతం మందిలో బీపీకి లక్షణాలు కనిపించవు. యథాలాపంగా డాక్టర్ చెక్ చేసినప్పుడు మాత్రమే బయటపడుతుంది. కొందరికి తలనొప్పి, వాంతులు లాంటి లక్షణాలు ఉంటాయి. సాధారణంగా బీపీ ఇతర సమస్యలకు దారితీసినప్పుడే బయటపడుతుంటుంది. అందుకే ప్రతి ఏటా ఒకసారి చెక్ చేయించుకోవడం మంచిది.

సైడ్ ఎఫెక్టులు ఉంటాయా?

గతంలో బీపీ మందుల వల్ల అనేక దుష్ప్రభావాలు కనిపించే మాట వాస్తవమే. అయితే బీపీ మందుల్లో ఆధునికమైనవి చాలా వచ్చాయి. వీటివల్ల దుష్ప్రభావాలు చాలా చాలా తక్కువ. ఎవరో ఒకరికి ప్రాబ్లం అయిందని మందులు మానేస్తే బీపీ పెరిగి గుండెజబ్బుకు దారితీస్తుంది. బీపీ అదుపులో లేకపోతే పక్షవాతం కూడా రావొచ్చు. అందుకే బీపీ మందులు వేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అయితే కొందరికి కొన్ని రకాల మందులు పడకపోవచ్చు. ఇలాంటప్పుడు వేరే గ్రూప్ మందులు ఇస్తారు. అయితే సొంతంగా మాత్రం మందులు మార్చొద్దు. ఏ టాబ్లెట్లు ఎవరికి సూట్ అవుతాయో చూసి ఇస్తారు. అంతేకాదు.. ఒకపూటా, రెండు పూటలా.. రోజుకు ఎన్నిసార్లు వేసుకోవాలనేది కూడా డాక్టరే నిర్ణయిస్తారు. సొంత నిర్ణయాలు తీసుకోవద్దు.

వేరే టాబ్లెట్స్ వేసుకోవాలా?

బీపీ మందులతో కలిపి ఇంకేవైనా మాత్రలు తీసుకోవాలా.. అనే అనుమానం చాలామందికి ఉంటుంది. బీపీ మందులతో పాటుగా స్టాటిన్ మాత్ర తీసుకుంటే గుండెపోటు రిస్కు తగ్గుతుంది. బీపీ వల్ల కలిగే కాంప్లికేషన్లు తగ్గుతాయి. అయితే ఏవైనా సరే డాక్టర్ సలహా మీదట మాత్రమే వాడాలి.