రాగుల‌తో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలెన్నో..! పాలిచ్చే త‌ల్లుల‌కు మ‌రింత మేలు..!!

రాగుల‌తో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలెన్నో..! పాలిచ్చే త‌ల్లుల‌కు మ‌రింత మేలు..!!

ప్ర‌తి ఒక్క‌రూ బిజీ లైఫ్ గ‌డుపుతున్నారు. ఈ బిజీ లైఫ్‌లో ఆహార‌పు అల‌వాట్లు కూడా మారిపోయాయి. మ‌న పూర్వీకులు తిన్న ఆహారాన్ని ఏ మాత్రం తిన‌లేక‌పోతున్నాం. జంక్ ఫుడ్ అల‌వాటై పోయి.. ఆన్‌లైన్‌లో ఆర్డ‌ర్లు పెడుతున్నాం. దీని వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. ఆస్ప‌త్రుల పాల‌వుతున్నాం. వీటిని దూరం చేసుకోవాలంటే స‌రైన ఆహార నియ‌మాలు పాటిస్తే స‌రిపోతుంది. ఏ అనారోగ్యానికి గురి కావొద్దంటే ముఖ్యంగా రాగుల‌ను రోజువారి మెనూలో భాగం చేసుకుంటే మంచిద‌ని న్యూట్రిష‌న్ నిపుణులు సూచిస్తున్నారు. మ‌రి రాగుల వ‌ల్ల ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఏంటో తెలుసుకుందాం.

రాగుల‌తో ఒక అంబ‌లి మాత్ర‌మే కాదు.. ఇత‌ర వంట‌కాల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. రాగి ముద్ద‌లు చేసుకోని ఆర‌గించొచ్చు. ఇడ్లీలుత‌యారు చేసుకోవ‌చ్చు. దోసెలు వేసుకోవ‌చ్చు. రాగుల ల‌డ్డూలు కూడా ఎంతో మంచివి. మొత్తంగా రాగుల‌ను ప్ర‌తి రోజు ఏదో ఒక రూపంలో తీసుకుంటే.. శ‌రీరానికి కావాల్సిన ఎన్నో పోష‌కాలు అందుతాయి. ఆరోగ్యంగా ఉండ‌డానికి ఆస్కారం ఉంటుంది.

ఎముక‌ల దృఢ‌త్వానికి..
ఎముక‌ల దృఢ‌త్వానికి రాగులు ఎంతో దోహ‌ద‌ప‌డుతాయి. వీటిల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. 100 గ్రాముల రాగుల్లో 364 మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది. కాబ‌ట్టి ఒక గ్లాసు పాలు తాగితే ఎంత కాల్షియం ల‌భిస్తుందో.. రెండు రాగి దోసెల‌ను తింటే అంతే కాల్షియం ల‌భిస్తుంద‌ని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే దంతాలు గ‌ట్టిగా ఉండేలా కూడా రాగులు స‌హాయ‌ప‌డుతాయి. కాబ‌ట్టి ఎదిగే పిల్ల‌ల‌కు రాగి జావ లేదా రాగి దోసెలు, ఇడ్లీలు తినిపిస్తే మంచిది.

అధిక బ‌రువుతో బాధ‌ప‌డే వారికి ఎంతో మేలు..
అధిక బ‌రువుతో బాధ‌ప‌డే వారు డైట్ కూడా మెయింటెన్ చేస్తుంటారు. కానీ ఇవి కొన్ని సంద‌ర్భాల్లో ప్ర‌మాద‌క‌రంగా మారే అవ‌కాశం ఉంటుంది. కాబ‌ట్టి బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు రాగుల‌ను తీసుకోవ‌డం మంచిద‌ని చెబుతున్నారు. 100 గ్రాముల రాగుల్లో కేవ‌లం 1.9 గ్రాములు మాత్ర‌మే కొవ్వు ప‌దార్థాలు ఉంటాయి. రాగుల్లో ఫైబ‌ర్ కూడా అధికంగా ఉంటుంది. దీంతో రాగులు కొద్ది మొత్తంలో తిన్నా కూడా.. క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది. పోష‌కాలు కూడా స‌మృద్ధిగా అందుతాయి. ఆక‌లిగా కూడా అనిపించ‌దు. త‌ద్వారా బ‌రువు త‌గ్గే అవ‌కాశం ఉంటుంది.

గ‌ర్భిణులు, పాలిచ్చే త‌ల్లులకు రాగులు త‌ప్ప‌నిస‌రి..
రాగుల్లో కాల్షియంతో పాటు ఫోలిక్ యాసిడ్ కూడా పుష్క‌లంగా ఉంటుంది. 100 గ్రాముల రాగుల్లో 34.7 మైక్రో గ్రాముల ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది గ‌ర్భిణుల‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌పడుతుంది. రాగుల్లో ఉండే కాల్షియం, ఐర‌న్, ఆమైనో ఆమ్లాలు పాలిచ్చే త‌ల్లుల్లో పాల ఉత్ప‌త్తిని కూడా పెంచుతాయి. రాగుల్లో ఉండే ఖ‌నిజాలు కూడా రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయ‌ని నిపుణులు చెబుతున్నారు.