Russia Cancer Vaccine| క్యాన్సర్ రోగులకు శుభవార్త.. వందశాతం సమర్థతతో వ్యాక్సిన్ రెడీ!
క్యాన్సర్ పేషెంట్లకు రష్యా శుభవార్త చెప్పింది. తాము కనుగొన్న వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌లో వందశాతం సమర్థత కలిగినది, పూర్తి సురక్షితమైనదిగా తేలిందని ప్రకటించింది. త్వరలోనే దీనిని రోగులకు అందుబాటులోకి తేనున్నట్టు వెల్లడించింది.

Medical Breakthrough: ప్రపంచంలో అత్యంత భయానక రోగాల్లో ఒకటిగా చెప్పే క్యాన్సర్‌కు వ్యాక్సిన్ రెడీ అయింది. ఇది సూది మందు రూపంలో ఉంటుంది. క్యాన్సర్ వ్యాధి నివారణకు వ్యాక్సిన్ (Cancer Vaccine) సిద్దమని రష్యా(Russia)కీలక ప్రకటన చేసింది. క్లినికల్ ఉపయోగం కోసం ప్రపంచంలోనే తొలి క్యాన్సర్ వ్యాక్సిన్ ఇది. క్యాన్సర్ పేషెంట్ల కోసం ‘ఎంటెరోమిక్స్’(Entheromix) వ్యాక్సిన్ సిద్ధంగా ఉందని రష్యా పేర్కొంది. త్వరలోనే ఈ వ్యాక్సిన్ రోగులకు ఉచితంగా అందిస్తామని వెల్లడించింది. ఫెడరల్ మెడికల్ అండ్ బయోలాజికల్ ఏజెన్సీ (FMBA,) దీనిని అభివృద్ధి చేయగా.. ప్రీ క్లినికల్ పరీక్షల్లో విజయవంతంగా ఉత్తీర్ణత సాధించిందని ఎఫ్ఎంబీఏ చీఫ్ వెరోనికా స్క్వోర్ట్సోవా ప్రకటించారు. రష్యా క్యాన్సర్ వ్యాక్సిన్ అద్భుతంగా పనిచేసిందని వెరోనికా స్క్వోర్ట్సోవా తూర్పు ఆర్థిక ఫోరం (ఈఈఎఫ్)లో ప్రకటించినట్లు రష్యన్ వార్తా సంస్థ టీఏఎస్ఎస్ నివేదించింది. క్లినికల్ ట్రయల్స్‌లో ఇది వంద శాతం సమర్థతతో పనిచేసింది. పూర్తి సురక్షితమని వెల్లడైంది. సైడ్ ఎఫెక్ట్స్ కూడా పెద్దగా ఏమీ లేవు. ఈ వ్యాక్సిన్ పెద్ద ట్యూమర్‌లను కూడా పరిమాణాన్ని తగ్గించి, వాటిని నాశనం చేసిందని తెలిపారు. ఇది అత్యంత కచ్చితత్వంతో నేరుగా క్యాన్సర్ కణాలపైనే దాడి చేసి, వాటిని ధ్వసం చేస్తుంది. దీనికి అమెరికా ఆరోగ్య శాఖ నుంచి తుది ఆమోదం లభించగానే పేషెంట్లకు అందించనున్నారు.
ఈ సందర్భంగా స్క్వోర్ట్సోవా మాట్లాడుతూ.. ‘ఈ పరిశోధన చాలా సంవత్సరాలు కొనసాగింది. చివరి మూడు సంవత్సరాలు ప్రీక్లినికల్ అధ్యయనాలు చేశాం. టీకా ఇప్పుడు ఉపయోగం కోసం సిద్ధంగా ఉంది. మేము అధికారిక ఆమోదం కోసం ఎదురు చూస్తున్నాం. ప్రీక్లినికల్ ట్రయల్స్ టీకా యొక్క భద్రత, దాని ప్రభావాన్ని నిర్ధారిస్తాయి. ఈ ట్రయల్స్ లో కణితి పరిమాణంలో తగ్గుదల, కణితి పెరుగుదల క్షీణతను పరిశోధకులు గమనించారు. అంతేకాకుండా, టీకా కారణంగా రోగి మనుగడ రేటు పెరుగుదలను కూడా అధ్యయనాలు సూచించాయి.’ అని తెలిపారు.
గతంలో స్పుత్నిక్ వి కొవిడ్ వ్యాక్సిన్‌ను రూపొందించి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన మాస్కోలోని ప్రముఖ గామాలెయా సెంటర్.. ఈ ‘ఎంటెరోమిక్స్’ వ్యాక్సిన్‌ను కూడా అభివృద్ధి చేసింది. ఇది ఒక రకమైన ఎంఆర్ఎన్ఏ (mRNA) ఆధారిత చికిత్సా పద్ధతి. ఈ వ్యాక్సిన్‌ను ఒక్కో రోగికి వారి కణితి కణాల జన్యువుల ఆధారంగా ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఇది ఒక విప్లవాత్మకమైన ప్రక్రియ కాగా.. దీని ద్వారా వ్యాక్సిన్ నేరుగా క్యాన్సర్ కణాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తుంది. జన్యువుల ఆధారంగా రూపొందించిన ఈ వ్యాక్సిన్ విజయవంతం అయితే ఇది క్యాన్సర్ చికిత్సా రంగంలో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
ఎవరికి ఉపయోగం?
లంగ్, బ్రెస్ట్, కొలొరెక్టల్, పాంక్రియాస్ క్యాన్సర్ రోగులకు ఇది అద్భుతంగా పని చేస్తుందని చెబుతున్నారు. కుటుంబ వారసత్వంగా క్యాన్సర్ సిండ్రోమ్స్ ఉన్న హైరిస్క్ పేషెంట్లు, కీమో థెరపీతో కూడా వ్యాధి లొంగని పేషెంట్లు దీనిని తీసుకోవచ్చు. సంప్రదాయ చికిత్సా పద్ధతులను తట్టుకోలేని రోగనిరోధక శక్తిలేని రోగులకు ఈ వ్యాక్సిన్ పరమౌషధంగా పనిచేస్తుందని చెబుతున్నారు.