Soft drinks | ఎండ వేడికి తాళలేక సాఫ్ట్ డ్రింక్స్‌ తాగుతున్నారా.. అయితే ఈ ప్రమాదం గురించి తెలుసుకోవాల్సిందే..

Soft drinks | ఎండ వేడికి తాళలేక సాఫ్ట్ డ్రింక్స్‌ తాగుతున్నారా.. అయితే ఈ ప్రమాదం గురించి తెలుసుకోవాల్సిందే..

Soft drinks: వేసవి కాలం పూర్తిగా ప్రారంభం కాకముందే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ముఖ్యంగా ఎల్‌నినో కారణంగా భారత్‌లో ఎండలు భగ్గున మండుతున్నాయి. చాలామంది ఈ ఎండలకు తాళలేక కూల్‌ డ్రింక్స్‌ తాగుతుంటారు. అయితే కృత్రిమంగా తయారు చేసిన శీతల పానీయం వేడిని తట్టుకోవడానికి కొన్ని క్షణాలు మాత్రమే సాయపడుతుంది. తీయగా, చల్లగా ఉండే పానీయం గొంతులోకి దిగగానే వేడి నుంచి తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది. అందుకే ఎండ బాగా ఉన్న సమయంలో ఎక్కువ మంది శీతల పానీయాలను కోరుకుంటారు.

అయితే ఇలా ఎండ నుంచి ఉపశమనం కోసం శీతల పానీయాలు తీసుకోవడం మంచిది కాదని, కొన్ని సందర్భాల్లో తీవ్రమైన పరిస్థితులకు దారితీస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. గుండె దడ ఉన్న వారు ఎండ నుంచి ఉపశమనం ఇలా చల్లటి పానీయం తీసుకోవడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని అధ్యయనకారులు తెలిపారు. భారత దేశానికి చెందిన కార్డియాలజిస్టులు కూడా ఈ అధ్యయన ఫలితాలతో ఏకీభవిస్తున్నారు. జనం చల్లటి, తీపి పానీయాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

ఈ నేపథ్యంలో యూకే బయోబ్యాంక్‌లోని 2,00,000 మంది పార్టిసిపెంట్స్‌పై పరిశోధన చేసి వెల్లడించిన ఆరోగ్య డేటా మనకు ఒక మేల్కొలుపు అనే చెప్పాలి. ఎందుకంటే వారానికి రెండు లీటర్ల కంటే ఎక్కువ శీతల పానీయం తీసుకునే వారి హార్ట్ బీట్ లయ తప్పినట్లు ఈ పరిశోధనలో వెల్లడైంది. ఈ పరిస్థితి గుండెపోటుకు దారితీసే ప్రమాదం ఉందని హెల్త్‌ ఎక్స్‌పర్ట్స్‌ హెచ్చరిస్తున్నారు.

అధ్యయన ఫలితాలు

అమెరికన్ హార్ట్ అసోసియేషన్‌కు చెందిన ‘సర్క్యులేషన్: అరిథ్మియా అండ్‌ ఎలక్ట్రోఫిజియాలజీ (Circulation: Arrhythmia and Electrophysiology)’ అనే జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం ఎంతో ముఖ్యమైన ఫలితాలను వెల్లడించింది. కృత్రిమంగా తయారుచేసిన శీతల పానీయాలను వినియోగానికి, గుండె దడ పెరగడానికి మధ్య సంబంధం ఉందని ఈ అధ్యయనం తేల్చింది.

యూకే బయోబ్యాంక్‌లోని 2,00,000 మందికిపైగా పార్టిసిపెంట్స్‌ను పరిశోధకులు తమ అధ్యయనానికి ఎంచుకున్నారు. అధ్యయనానికి ముందు వారిలో ఎవరికీ గుండె దడ లేదు. ఒక దశాబ్దంపాటు పార్టిసిపెంట్స్‌ డైట్‌ సమాచారాన్ని, జన్యుసంబంధ డాటాను జాగ్రత్తగా పరిశీలించారు. వారిలో 9,362 గుండె దడ కేసులు నమోదయ్యాయి. అసలు కూల్‌ డ్రింక్సే తాగని వాళ్లతో పోలిస్తే వారానికి రెండు లీటర్ల కంటే ఎక్కువ ఆర్టిఫిషియల్‌ కూల్‌ డ్రింక్స్‌ తీసుకునే వారిలో గుండె దడ రిస్క్‌ 20 శాతం ఎక్కువగా ఉంది. అయితే వారానికి అంతే మోతాదులో ఆర్టిఫిషియల్‌ డ్రింక్స్‌ కాకుండా సహజంగా చక్కెర కలుపుకుని చేసుకున్న కూల్‌ డ్రింక్స్‌ తాగిన వారిలో గుండె దడ రిస్క్‌ కేవలం 10 శాతం ఎక్కువగా నమోదైంది.

అయితే ఇందుకు విరుద్ధంగా వారానికి ఒక లీటరు లేదా అంతకంటే తక్కువగా పండ్ల రసాన్ని తీసుకునే వారిలో గుండె దడ రిస్క్‌ 8 శాతం తగ్గినట్లుగా పరిశోధనలో తేలింది. దీన్ని బట్టి కృత్రిమంగా తయారయ్యే శీతల పానీయాల కంటే సహజ పానీయాలు గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిదని అర్థమవుతుంది.

ఈ అధ్యయన ప్రధాన రచయిత నింగ్జియాన్ వాంగ్ పానీయాల ఎంపికలో జాగ్రత్త వహించడం ఎంత అవసరమో నొక్కిచెప్పారు. కృత్రిమ, చక్కెరతో చేసిన తీపి పానీయాలను తగ్గించడం ఆరోగ్యానికి మంచిదని సూచించారు. టైప్ 2 డయాబెటిస్, స్థూలకాయం ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు కృత్రిమ కూల్‌ డ్రింక్స్‌ తీసుకుంటే గుండె దడ ప్రమాదం ఇంకా ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు.

ఈ అధ్యయనం భారత్‌కు కీలకం: నిపుణులు

ఈ అధ్యయనం ప్రాముఖ్యత గురించి ప్రముఖ వైద్య నిపుణులు వెల్లడించారు. ఇది భారత జనాభాకు కూడా మంచిదని భారతదేశ వైద్యులు అంగీకరించారు. పెరుగుతున్న హృదయ సంబంధ వ్యాధుల భారంతో భారత్‌ పోరాడుతోందని, ఈ రుగ్మతలు మరణాలకు ప్రధాన కారణమని చెప్పారు. గుండె దడ లాంటి పరిస్థితులకు దారితీసే కారకాల గురించి తెలుసుకోవడం వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలకు ఎంతో కీలకమని పేర్కొన్నారు. కృత్రిమ స్వీటెనర్స్‌ ఉన్న పానీయాలు తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ఇప్పటివరకు స్పష్టత లేదని, ఇప్పుడు ఈ అధ్యయనం గుండె దడ పెరిగి గుండె పోటుకు దారితీసే ప్రమాదం ఉందనే విషయాన్ని నిరూపించిందని తెలంగాణకు చెందిన ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ముఖర్జీ మడివాడ అన్నారు.

చక్కర ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని ఇప్పటికే తేలిందని, కృత్రిమ స్వీటెనర్‌లు చక్కెర కంటే ప్రమాదమని ఈ అధ్యయనంలో తేలిందని ముఖర్జీ చెప్పారు. బెంగుళూరుకు చెందిన ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ అభయ్ మాట్లాడుతూ.. భారతీయులు కొన్ని గుండె జబ్బులు, మధుమేహం లాంటి జీవక్రియ రుగ్మతలకు జన్యు సిద్ధత కలిగి ఉండవచ్చునని, కాబట్టి ఆహార కారకాలు ఆరోగ్యంపై వాటి ప్రభావాలపై పరిశోధనలు ఉపయుక్తమని అన్నారు.