World Cancer Day | ఆరోగ్యం పట్ల శ్రద్ధ మీది.. క్యాన్సర్ తగ్గించే పూచీ మాది
క్యాన్సర్.. ఈ పదం వింటే ఇప్పటికీ వెన్నులో వణుకే వస్తుంది. వైద్యరంగంలో వస్తున్న మందులు, చికిత్సలు క్యాన్సర్ నుంచి బయటపడేస్తామని హామీ ఇస్తున్నాయి

- నేడు వరల్డ్ క్యాన్సర్ డే
World Cancer Day 2024 | విధాత ప్రత్యేకం: క్యాన్సర్.. ఈ పదం వింటే చాలు ఇప్పటికీ కూడా వెన్నులో వణుకే వస్తుంది. కానీ వైద్యరంగంలో ఎప్పటికప్పుడు వస్తున్న కొత్త మందులు, చికిత్సలు క్యాన్సర్ నుంచి బయటపడేస్తామని హామీ ఇస్తున్నాయి. కానీ.. ఇప్పటికీ 25 శాతం మంది మహిళలు రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారు. ప్రతి 8 నిమిషాలకు ఒక మహిళ క్యాన్సర్‌తో చనిపోతున్నది. ఇందుకు కారణం.. అనారోగ్యం పట్ల అశ్రద్ధ.. క్యాన్సర్ ఉందని తొందరగా గుర్తించలేకపోవడం. అయితే, ఎంత త్వరగా గుర్తించి, చికిత్స మొదలుపెడితే అంత ఎక్కువగా క్యూర్ రేటు ఉంటుందంటున్నారు డాక్టర్లు.
క్యాన్సర్‌అనే పదం వినగానే భయాందోళనలు చుట్టుముడతాయి. కానీ ఇప్పుడు అత్యాధునికమైన చికిత్స విధానాలున్నాయి. కొన్ని దశాబ్దాలతో పోలిస్తే చాలా మెరుగైంది ఈ చికిత్స. ఇది మల్టీ మోరాల్టీ ట్రీట్‌మెంట్. సర్జరీ, కీమో, రేడియేషన్, ఇమ్యునోథెరపీ.. ఇలా ఎన్నో కలిపి ఇస్తాం. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడెన్నో మార్పులు.
సర్జరీ
కన్జర్వేటివ్. బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే కణితితో పాటు కండరాలు, మొత్తం రొమ్ముని తొలగించాల్సి వచ్చేది. గ్రంథులు తీస్తే చేయి వాచిపోయి ఉండేది. ఇప్పుడు ఎర్లీ స్టేజ్ లో గుర్తిస్తే కేవలం గడ్డ వరకే తీసేస్తున్నారు. ఇంకో రొమ్ము ఎలా ఉందో దీన్ని కూడా అలానే సర్జరీ చేస్తున్నాం. సెంటినల్ లింఫ్‌నోడ్ బయాప్సీ ద్వారా కేవలం గ్రంథులు తీసి టెస్టుకు పంపడం. నెగటివ్ వస్తే అన్ని గ్రంథులూ తీసేయాల్సిన అవసరం లేదు. గర్భసంచి క్యాన్సర్ వస్తే మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ వచ్చింది. మొత్తం పెద్దగా కట్ చేయకుండా చిన్న కోతతో లాపరోస్కోపీ ద్వారా సర్జరీ అయిపోతుంది. తొందరగా కోలుకుంటారు.
ఇతర థెరపీలు
కీమోథెరపీలో ఇప్పుడు కాంప్లికేట్స్ తగ్గాయి. సైడ్ ఎఫెక్టులకు కూడా మంచి మందులొచ్చాయి.
టార్గెటెడ్ థెరపీ ద్వారా ఆరోగ్యకరమైన కణజాలం దెబ్బతినకుండా కణితిని టార్గెట్ చేసి నాశనం చేయవచ్చు. ఇమ్యునో థెరపీ ద్వారా క్యాన్సర్ కణాలను బయటికి తీసి, వాటికి యాంటీబాడీలను అభివృద్ధి చేసి, వాటిని ఇంజెక్ట్ చేస్తారు. ఇవి క్యాన్సర్ కణాలపై పనిచేస్తాయి.
రేడియేషన్
ఒకప్పుడు కోబాల్ట్ మెషీన్లు ఉండేవి. రేడియేషన్ ఇస్తే అంతా కాలిపోయి, ఎక్కువ సైడ్ ఎఫెక్టులుండేవి. ఇప్పుడు ఏ అవయవానికైతే క్యాన్సర్ వచ్చిందో దానికి మాత్రమే, ఆ గడ్డకు మాత్రమే రేడియేషన్ ఇవ్వడం వల్ల పక్కనున్న కణజాలం దెబ్బతినదు. పక్కన కణజాలాలకు అతి తక్కువ రేడియేషన్ మాత్రమే వెళ్లడం వల్ల సైడ్ ఎఫెక్టులు తక్కువ. చికిత్సలో చాలా మార్పులు. అందుకే ఎర్లీగా డయాగ్నస్ అయితే 90 శాతానికన్నా ఎక్కువ క్యూర్ రేటు ఉంది.
యాక్టివ్ లైఫ్ సాధ్యమే!
మూడు నాలుగు దశల్లో వస్తే క్యూర్ రేటు తక్కువ. మళ్లీ వచ్చే అవకాశం కూడా ఎక్కువ. అందుకే క్యాన్సర్ చికిత్స సక్సెస్ కావాలంటే ముందుగా గుర్తించడమే. చికిత్స తరువాత కూడా యాక్టివ్ లైఫ్ ఉంటుంది. అందుకే దీనివల్ల జీవితం కోల్పోయామని డీలా పడిపోనక్కరలేదు. మొదటి రెండేళ్ల వరకు మూడు నెలలకోసారి టెస్ట్ చేస్తారు. రెండు నుంచి అయిదేళ్ల వరకు ఆరు నెలలకోసారి టెస్టు చేస్తాం. అయిదేళ్ల తర్వాత ఏడాదికోసారి. ఇలా రెగ్యులర్ ఫాలో అప్‌లో ఉంచుతారు. దానివల్ల మళ్లీ వస్తుందేమోనని ఏమాత్రం అనుమానం కలిగినా వెంటనే తదనుగుణమైన చికిత్స మొదలుపెడతారు.
ఎర్లీగా ఎలా డయాగ్నస్ చేయాలి?
స్క్రీనింగ్. సర్వికల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ మహిళల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఒకప్పుడు సర్వికల్ క్యాన్సర్ ఎక్కువ. ఇప్పుడు రొమ్ము క్యాన్సర్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రతి 25 మంది స్త్రీలలో ఒకరికి రొమ్ము క్యాన్సర్ వచ్చే రిస్కు ఉంటుంది. అయితే ఈ రెండు క్యాన్సర్లకూ కూడా మంచి స్క్రీనింగ్ విధానాలున్నాయి. పదేళ్ల పాటు ప్రీ క్యాన్సరస్ స్టేజి ఉంటుంది. ఈ టైంలో పాప్ స్మియర్ లేదా క్లినికల్‌గా డాక్టర్ ద్వారా సర్వికల్ పరీక్ష చేయించుకుంటే, ముందుగానే మొదలవడానికి ముందే కనుక్కోవచ్చు.
వెంటనే చికిత్స ఇస్తే అసలు అది క్యాన్సర్‌గానే పెరగకుండా నివారించొచ్చు. కానీ మనదేశంలో పాపులేషన్ ఆధారిత స్క్రీనింగ్ లేదు. దాంతో పాప్ స్మియర్ చేయించుకునేవాళ్లు చాలా తక్కువ. అందుకే గ్రామీణ స్త్రీలలో ఇది ఎక్కువ. క్యాన్సరే రాకుండా అరికట్టగలిగే పరిస్థితి ఉన్నప్పటికీ మనదేశంలో ప్రతి 8 నిమిషాలకు ఒక మహిళ సర్వికల్ క్యాన్సర్‌తో చనిపోతుండటం విషాదకరం.
రొమ్ము క్యాన్సర్
రొమ్ము క్యాన్సర్ విషయానికొస్తే సెల్ఫ్ ఎగ్జామినేషన్ వల్లనే ఎక్కువ మటుకు కనిపెట్టొచ్చు. అయితే గడ్డ మన చేతికి తగలాలంటే అది కనీసం ఉసిరికాయ పరిమాణంలో అయినా ఉండాలి. మామోగ్రఫీ చేయడం వల్ల ఆవగింజ సైజులో ఉన్న గడ్డను కూడా కనిపెట్టొచ్చు. ఇలాంటప్పుడు ఇంత చిన్న సైజులో ఉన్న గడ్డను తీయాలంటే మామూలుగా చేతికి తగలదు కాబట్టి సర్జరీ ద్వారా తీయడం కష్టం. ఇలాంటప్పుడు వైర్ లోకలైజేషన్ ద్వారా రేడియాలజిస్టులు అల్ట్రాసౌండ్ గైడెన్స్‌తో దాని చుట్టూ వైర్ పెట్టి, ఆ వైర్ ద్వారా గడ్డను తీసేస్తారు. అప్పుడు 95 శాతం క్యూర్ రేటు ఉంటుంది. సైడ్ ఎఫెక్టులు కూడా చాలా తక్కువ.
నిర్లక్ష్యం వద్దు!
పాశ్చాత్య దేశాల్లో ప్రతి ఏటా మహిళలందరికీ ప్రభుత్వమే ఉచితంగా స్క్రీనింగ్ చేయిస్తుంది. మన దగ్గర జనాభా కూడా ఎక్కువ ఉండటంతో ఇది కష్టం అవుతున్నది. అందుకే ఆపర్చునిస్టిక్ స్క్రీనింగ్ చేయించాలి. అనుమానం ఉన్నవాళ్లు, అవసరం ఉన్నవాళ్లు తప్పనిసరిగా చేయించుకోవాలి. కానీ అవగాహన ఉన్నప్పటికీ నగరాల్లోని మహిళలు కూడా అశ్రద్ధ వల్ల అందరూ స్క్రీనింగ్ చేయించుకోవట్లేదు. స్త్రీలు తమ ఆరోగ్యం పట్ల తామే శ్రద్ధ పెట్టడం అవసరం.
ఏం టెస్టులు?
స్క్రీనింగ్‌కి క్రైటీరియా ఉంటుంది. అన్ని క్యాన్సర్లకూ స్క్రీనింగ్ అనేది లేదు. ఎక్కువ సాధారణంగా కనిపించేవాటికి ఇది తప్పనిసరి. బ్రెస్ట్, సర్వికల్, కోలన్ క్యాన్సర్లకు ఉంది. ఎక్కువ స్మోకింగ్ చేసేవాళ్లకి ఊపిరితిత్తుల క్యాన్సర్ కోసం లో డోస్ సీటీ స్కాన్ చేస్తారు. ప్రొస్టేట్ క్యాన్సర్ కోసం పీఎస్ఏ టెస్టు. బ్రెస్ట్‌కి మామోగ్రఫీ, అల్ట్రసౌండ్ చేస్తారు. సర్వికల్ క్యాన్సర్ కోసం పాప్ స్మియర్. పెద్దపేగు క్యాన్సర్ కోసం కొలనోస్కోపీ చేస్తారు. ఇలా కొన్నిటికి ఉంది.
ఇక ఏవైనా లక్షణాలున్నప్పుడు వాటికి సంబంధించిన టెస్టులు చేయించాలి. ఒవేరియన్ క్యాన్సర్ 80 శాతం మందిలో నాలుగో స్టేజ్‌లోనే బయటపడుతుంది. అన్నం అరగకపోవడం, కొంచెం తినగానే పొట్టనిండినట్టుండటం, మల, మూత్ర విసర్జనలో తేడాలు వంటివి ఉన్నప్పుడు సాధారణంగా ఇంటి చిట్కాలు పాటిస్తూ ఆలస్యం చేస్తారు. వీటి వెనుక ఒవేరియన్ క్యాన్సర్ ఉండొచ్చు. కానీ ఇలా ఎక్కువ రోజులు ఒకే రకమైన లక్షణాలుంటే వెంటనే డాక్టర్‌ని కలవాలి. ప్రతిదీ క్యాన్సర్ కాకపోవచ్చు. కానీ 20 శాతం క్యాన్సర్ అయ్యే ప్రమాదం ఉంటుంది.
ఇవి మరవొద్దు
- క్యాన్సర్ అంటువ్యాధి కాదు. ఇది ఇన్‌ఫెక్షన్ కాదు. మన శరీరంలో మన కణాలే అదుపు తప్పి ఇష్టం వచ్చినట్టు విభజన చెందుతాయి. కణవిభజన కంట్రోల్ కోల్పోయినప్పుడు వచ్చే వ్యాధి. కాబట్టి ఇది ఒకరి నుంచి ఇంకొకరికి అంటుకోదు.
- కొన్ని రకాల ఫుడ్, ప్లాస్టిక్స్, రసాయనాల వంటివి క్యాన్సర్ కారక పదార్థాలను కలిగి ఉంటాయి. అయితే వీటిని దీర్ఘకాలం వాడితే క్యాన్సర్ వచ్చేందుకు దోహదపడవచ్చు.
- ధూమపానం, మద్యపానాలకు మాత్రం దూరంగా ఉండాల్సిందే.
- మొబైల్ వల్ల క్యాన్సర్ వస్తుందనడానికి సైంటిఫిక్ ప్రూఫ్ లేదు.
- సమతుల్యమైన ఆహారం తీసుకోవడం అవసరం. పండ్లు, కూరగాయలు, ఫైబర్ ఎక్కువగా తీసుకోవాలి.
- డయాబెటిస్ లాంటి వ్యాధుల్లాగానే ఇది కూడా అనారోగ్యకరమైన జీవనశైలి ద్వారా వచ్చే వ్యాధి. అందుకే జీవనశైలి పట్ల జాగ్రత్త పడటం అవసరం.
- సర్వికల్ క్యాన్సర్ హ్యూమన్ పాపిలోమా వైరస్ వల్ల వస్తుంది. కాబట్టి వాక్సిన్ ద్వారా దీన్ని నివారించొచ్చు. టీనేజ్ అమ్మాయిలకు ఇది తప్పనిసరిగా ఇప్పించాలి. హెపటైటిస్ బీ వైరస్ వల్ల కాలేయ క్యాన్సర్ రిస్కు పెరుగుతుంది. కాబట్టి ఈ వ్యాక్సిన్ ద్వారా కాలేయ క్యాన్సర్ రిస్కు తగ్గించుకోవచ్చు.
- అన్నింటికన్నా ముఖ్యమైనది ఎవరి ఆరోగ్యం పట్ల వాళ్లే జాగ్రత్త తీసుకోవడం అవసరం.
- స్ట్రెస్‌తో కాదు.. ధైర్యంతో క్యాన్సర్‌ను ఎదిరించగలం.
డాక్టర్ గీతా నాగశ్రీ
సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్,
కేర్ హాస్పిటల్స్,
హైదరాబాద్.