తెలంగాణ ఏసీబీ అధికారులు మరో అవినీతి తిమింగలాన్ని పట్టేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలతో ల్యాండ్ ఆండ్ సర్వే డిప్యూటీ డైరక్టర్ నరహరి నివాసాలలో ఏసీబీ నిర్వహించిన దాడులలో భారీగా అక్రమాస్తులు వెలుగు చూశాయి. ఏక కాలంలో నరహరికి చెందిన కార్యాలయం, నివాసాలు, బంధువుల ఇళ్లలో 10చోట్ల ఏసీబీ బృందాలు తనిఖీలు కొనసాగిస్తున్నాయి. హైదరాబాద్ పాతబస్తీ ఛత్రినాకలోనినరహరి ఇంట్లో ఇప్పటికే రూ.1కోటి 20లక్షల నగదు నోట్ల కట్టలతో పాటు కిలోన్నరకు పైగా బంగారు ఆభరణాలు, పెద్ద మొత్తంలో బ్యాంకు డిపాజిట్లు, ఆస్తి పత్రాలు గుర్తించారు. బ్యాంకు లాకర్లను ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
నరహరి అక్రమాస్తుల వివరాలు
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. సోదాల్లో నరహరి నివాసంలో రూ.1.54 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు రూ.1.3 కిలోల బంగారం, 8 కిలోల వెండి సీజ్ చేశారు. అంతేకాదు నరహరి బ్యాంక్ ఖాతాల్లో రూ.2.29కోట్లు గుర్తించారు.
దీంతో పాటు రూ.5.04కోట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రంగారెడ్డి జిల్లాలో మహేశ్వరంలో 1.24 ఎకరాల భూమి, పుప్పాలగూడ లో 2,500 స్కైర్ ఫీట్ల ఖరీదైన భవనం, నార్సింగిలొ రెండు 1,860 స్కైర్ ఫీట్ల ఖరీదైన భవనాలు,, రాజేంద్రనగర్‌లో1,377 స్కైర్ ఫీట్ల విలువైన భవనం, గచ్చిబౌలిలో జీప్లస్3 భవనం, ఛత్రినాకలో జీప్లస్ 2 భవనం గుర్తించారు. నరహరి భార్య పేరిట రెండు లాకర్లు ఉన్నట్లు ఏసీబీ అధికారులు నిర్ధారించారు.మొత్తంగా బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ.150 కోట్లపైనే ఉంటుందని అధికారులు తెలిపారు.
పెరిగిపోతున్న రూ.100 కోట్ల అక్రమార్కుల జాబితా..
గతంలో హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ రూ.300 కోట్లకు పైగా ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో అరెస్టయ్యారు. ఆ తర్వాతా రూ.100కోట్ల అక్రమాస్తుల మార్కు దాటిన వారిలో వరుసగా జలమండలి జీఎం అనంతలక్ష్మీ కుమార్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ ఉండటం గమనార్హం. తాజాగా ల్యాండ్ ఆండ్ సర్వే డిప్యూటీ డైరక్టర్ నరహరి కూడా ఈ అవినీతి తిమింగలాల జాబితాలో చేరిపోయాడు. రంగారెడ్డి జిల్లా సర్వే, సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ కే శ్రీనివాసులుపై జరిపిన సోదాల్లోనూ రూ.100 కోట్లకు పైగానే ఆక్రమాస్తులు గుర్తించారు.
టీజీఎస్పీడీసీఎల్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ అంబేద్కర్ ఎరుగు, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంజనీర్ నూనె శ్రీధర్, మాజీ ఈఎన్‌సీ మురళీధర్ రావు , ట్రాన్స్‌పోర్ట్ శాఖ డిప్యూటీ కమిషనర్ మూడ్ కిషన్లపై నిర్వహించిన సోదాల్లోనూ వంద కోట్ల మేరకు అక్రమాస్తులు గుర్తించారు. హన్మకొండ అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి కేసులో, ఇటీవల మాజీ ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు ఏసీపీ భుజంగరావుపై ఏసీబీ జరిపిన సోదాల్లోనూ భారీగా అక్రమాస్తులు గుర్తించిన సంగతి తెలిసిందే.