‘పుష్ప 2’ ప్రీమియర్ షో సందర్బంగా చిక్కడపల్లి సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసుపై నాంపల్లి కోర్టులో సోమవారం విచారణ కొనసాగింది. ఈ కేసులో నిందితులు అంతా కోర్టు ముందు హాజరు కాగా, హీరో అల్లు అర్జున్ మాత్రం వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేకపోయారని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అనంతరం ఈ కేసు విచారణను జులై 6వ తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు.
ఈ కేసులో అల్లు అర్జున్‌ను A11 నిందితుడిగా పోలీసులు చేర్చిన విషయం తెలిసిందే. వ్యక్తిగతంగా అల్లు అర్జున్ కోర్టు ముందు హాజరు కావాలని శనివారం సమన్లు జారీ చేశారు. అయితే అల్లు అర్జున్ ముందుగా నిర్ణయించబడిన సినిమా షూటింగ్ లో ఉన్నందునా కోర్టుకు హాజరుకాలేకపోతున్నారని న్యాయవాది వివరించారు. తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యే అవకాశం కల్పించాలని అల్లు అర్జున్ తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. అయితే ఈ విజ్ఞప్తిని నాంపల్లి కోర్టు తిరస్కరించింది. విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ కేసులో A1 నుంచి A10 వరకు నిందితులుగా సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని చేర్చగా, మొత్తం 23 మందిపై పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.
ఈ కేసులో 19 మంది నిందితులకు నాంపల్లి కోర్టు ఇప్పటికే సమన్లు జారీ చేసింది. 2024 డిసెంబర్ 4వ తేదీన పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన చోటుచేసుకుంది. భారీ సంఖ్యలో అభిమానులు థియేటర్‌కు చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతిచెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే.
