విప్ప సారాకు ఇందిరమ్మ పేరు వ్యాఖ్యలపై అసెంబ్లీలో రగడ

విప్ప సారాకు ‘ఇందిరమ్మ’ పేరు వ్యాఖ్యలపై అసెంబ్లీలో రగడ చెలరేగింది. బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

విప్ప సారాకు ఇందిరమ్మ పేరు వ్యాఖ్యలపై అసెంబ్లీలో రగడ

విధాత, హైదరాబాద్ : విప్ప సారా, ఉత్పత్తులు తీసుకరావాలన్న ప్రతిపాదనలు స్వాగతిస్తున్నానని, 130దేశాలు ఈ రకమైన ఆర్గానిక్ ఉత్పత్తుల ద్వారా ఆదాయం పొందుతున్నాయని, ప్రభుత్వం విప్ప సారా తీసుకొస్తే స్వాగతిస్తాం అని బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి తెలిపారు. ఇదే సమయంలో మెక్సికో వాళ్లు అర్గానిక్ వైన్ కు టెకిలా అనే పేరు పెట్టినట్లుగా, ఇక్కడ విప్ప సారాకు ఇందిరమ్మ పేరు మాత్రం పెట్టవద్దని వ్యాఖ్యానించారు. అయితే విప్పసారా చర్చలో ఇందిరమ్మ ప్రస్తావన తీసుకరావడంపై మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా రాకేశ్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డారు. వెంటనే క్షమాపణ చెప్పాలని మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, జూపల్లి, శ్రీహరి, సీతక్క, విప్ ఆది శ్రీనివాస్ లు డిమాండ్ చేశారు. ఓ మహిళను, దేశం కోసం బలిదానమైన ప్రధానిని అవమానించినట్లుగా రాకేశ్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని తెలిపారు.

అయితే రాకేశ్ రెడ్డి మాత్రం నాకు ఇందిరాగాంధీ అంటే గౌరవం ఉందని, ఆమె దేశం కోసం త్యాగం చేసిన మహానేత అని, అయితే నా వ్యాఖ్యల్లో ఇందిరమ్మను అవమానించనట్లు ఉంటే రికార్డుల నుంచి తొలగించవచ్చని, క్షమాపణలు చెప్పడానికి నాకు అభ్యంతరం లేదన్నారు. అనేక పథకాలకు ఇందిరమ్మ పేరు పెట్టినట్లుగా విప్ప సారాకు ఇందిరమ్మ పేరు పెట్టవద్దని మాత్రమే నేను చెప్పానని, నా వ్యాఖ్యలకు కాంగ్రెస్ వాళ్లే వక్రభాష్యం చెబుతున్నారని వ్యాఖ్యానించారు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సమస్యను బుల్ డోజ్ చేసేందుకు కాంగ్రెస్ రాకేశ్ రెడ్డి వ్యాఖ్యలపై రచ్చ చేస్తున్నారన్నారు. హరీశ్ రావు జోక్యం చేసుకుంటూ.. ఇందిరమ్మను విమర్శిస్తే కాంగ్రెసోళ్లకు కోపం వస్తుందని, తెలంగాణ సాధించిన కేసీఆర్ ను ఇదే సభలో వారు అవమానిస్తు మాట్లాడారంటూ గుర్తు చేశారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సూచన మేరకు రాకేశ్ రెడ్డి మాట్లాడిన వాటిలో అభ్యంతరకమైన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలిగిస్తున్నట్లుగా స్పీకర్ చైర్ లో ఉన్న బాలునాయక్ ప్రకటించారు.

ఇవి కూడా చదవండి :

ఉపాధి, ఆదాయం మార్గం విప్పసారా : ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
TGSRTC Bus Fare Discount : ప్రయాణికులకు టీజీ ఆర్టీసీ శుభవార్త