22ఏ నిషేధిత జాబితా పేరుతో ప్రజల భూములు, ఆస్తులను కబ్జా చేసే హక్కు ఎవరు ఇచ్చారు? అని, ఇది 30% కమీషన్ సర్కార్ అని ప్రజలే అంటున్నారని బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీశ్ రావు విమర్శించారు. శనివారం బోడుప్పల్ పరిధిలోని తిరుమల మెడోస్, లక్ష్మీ గణపతి కాలనీ, హేమానగర్ కాలనీలకు చెందిన వందలాది మంది 22ఏ బాధితులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్బంగా హరీశ్ రావు మాట్లాడుతూ..బాధితుల ఆవేదన వింటుంటే గుండె కలిచివేసిందని అన్నారు. సర్వే నంబర్ 215, 215 పార్ట్‌లలో 30 ఏళ్లుగా ఎలాంటి వివాదాలు లేకుండా సుమారు 1,500 కుటుంబాలు నివసిస్తున్న ఇళ్లను రాత్రికి రాత్రే కాంగ్రెస్ ప్రభుత్వం అర్బన్ ల్యాండ్ సీలింగ్ కింద 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడం అత్యంత దుర్మార్గం అని మండిపడ్డారు.
కష్టాల్లో ఉన్నప్పుడు ఇల్లు అమ్ముకుందామని రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్తే.. ఆస్తి ప్రొహిబిషన్‌లో ఉందన్న విషయం తెలియడంతో కాలనీ వాసులు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారని హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ అయిన ఇళ్లను.. 22ఏను అడ్డుపెట్టుకుని ప్రజలపై ఒత్తిడి తెచ్చి 30 శాతం కమీషన్లు దండుకునేందుకే ఇలాంటి కృత్రిమ వివాదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. దశాబ్దాలుగా ప్రశాంతంగా జీవిస్తున్న ప్రజలకు ఇప్పుడు 22ఏ భయం చూపిస్తూ, బినామీలతో సెటిల్మెంట్లు చేసుకునే దందాకు తెరలేపారని, దీనికి మీ సమాధానం ఏమిటో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.
బోడుప్పల్ కాలనీ వాసులు సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 22ఏ బాధితులందరూ అధైర్యపడవద్దు అని, ఈ వసూళ్ల సర్కార్ మెడలు వంచైనా సరే మీ ఆస్తులను కాపాడే బాధ్యతను బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుందని హరీశ్ రావు భరోసా ఇచ్చారు. ఈ వివాదంలో ప్రభుత్వం ప్రకటనలు, మాటలు పక్కనబెట్టి, తక్షణమే ఆయా కాలనీలను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించి, బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అని, లేదంటే బాధితుల పక్షాన బీఆర్ఎస్ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని హెచ్చరించారు.
