Hyderabad – Bengaluru Bullet Train | హైదరాబాద్–బెంగళూరు బుల్లెట్ రైలుకు తొలి అడుగు
హైదరాబాద్–బెంగళూరు బుల్లెట్ రైలుకు మట్టి పరీక్షలు ప్రారంభం. 626 కిమీ కారిడార్, 350 కిమీ వేగంతో దూసుకెళ్లే బుల్లెట్ రైలు. వివరాలు, ప్రయాణ సమయం, ఆర్థిక ప్రభావం—పూర్తి విశ్లేషణ.
Hyderabad–Bengaluru Bullet Train: Soil Testing Work Starts for India’s Next High-Speed Route
సంక్షిప్తంగా…
హైదరాబాద్–బెంగళూరు బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌లో మట్టి పరీక్షలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. హై-స్పీడ్ ట్రాక్ నిర్మాణానికి అవసరమైన జియోటెక్నికల్ సర్వేలు, డ్రిల్లింగ్ నమూనాల విశ్లేషణ వేగంగా కొనసాగుతున్నాయి. ఈ డేటాపైనే ఎలివేటెడ్ సెక్షన్‌లు, సొరంగాలు, తుది ట్రాక్ రూపకల్పన నిర్ణయించబడనుంది. రైలు పూర్తయ్యాక హైదరాబాద్–బెంగళూరు ప్రయాణం 8 గంటల నుండి కేవలం 2 గంటలకు తగ్గుతుంది.
విధాత, హైదరాబాద్:
Hyderabad – Bengaluru Bullet Train | దేశంలో వేగవంతమైన రవాణా వ్యవస్థను విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న బుల్లెట్ రైలు ప్రాజెక్టుల్లో, హైదరాబాద్–బెంగళూరు కారిడార్ అధికారికంగా చోటు దక్కించుకుంది. ఐటీ రంగంలో రెండు నగరాలు భారతదేశానికి కీలకం కావడం, పారిశ్రామికంగా ఈ కారిడార్‌కు చాలా ప్రాధాన్యత ఉండటంతో కేంద్రం ఈ ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపింది.
ప్రాజెక్టు ప్రారంభానికి సూచనగా ఈ కారిడార్‌లో మట్టి పరీక్షలు అధికారికంగా ప్రారంభమవడంతో, దక్షిణ భారతదేశంలో తొలి హై-స్పీడ్ రైలు నిర్మాణానికి నాంది పలికినట్లయింది. మొత్తం 605–626 కిలోమీటర్ల పొడవు కలిగిన ఈ బుల్లెట్ రైలు మార్గంలో దాదాపు 263 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ గుండా ప్రయాణిస్తుండగా, ఉమ్మడి కర్నూలు జిల్లా సింహభాగాన్ని ఆక్రమిస్తుంది. ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో జియోటెక్నికల్, జియోఫిజికల్ పరీక్షలు, డ్రిల్లింగ్ కార్యకలాపాలు కొనసాగుతుండగా, ఈ ఫలితాల ఆధారంగా తుది మార్గ నిర్మాణం, ఎలివేటెడ్ ట్రాక్‌లు, సొరంగాలు, స్టేషన్ల నిర్మాణస్థలాలు నిర్ణయించబడతాయి. మట్టి నమూనాల్లో తేమ శాతం, బండరాళ్ల రకం, భూమి సహించే స్వెల్లింగ్ ప్రెషర్, లోడ్‌బేరింగ్ సామర్థ్యాన్ని విశ్లేషించేందుకు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. గంటకు 350 కిలోమీటర్ల వేగాన్ని తట్టుకునేలా హై-గ్రేడ్ ట్రాక్ నిర్మాణానికి ఈ సమాచారం అత్యంత కీలకం. రైలు నడిచే వేగం గంటకు 320 కిలోమీటర్లు ఉండగా, దేశంలో ఇప్పటికే పనులు జరుగుతున్న ముంబై–అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ సాంకేతికతనే ఈ కారిడార్‌లో కూడా ఉపయోగించబోతున్నారు. కాగా, ఈ కారిడార్‌లో 2026 డిసెంబర్ నుంచి మొదటి దశగా సూరత్ నుంచి బిల్మోరా వరకు బుల్లెట్ రైలు నడపనున్నారు. దేశంలో బుల్లెట్ రైలు నడిచిన తొలి స్టేషన్లుగా ఈ రెండు చరిత్రలో నిలిచిపోనున్నాయి.
అధిక వేగాన్ని తట్టుకునే ట్రాక్ నిర్మాణానికి మట్టి పరీక్షలు కీలకం

నిర్దేశించిన వేగంతో బుల్లెట్ రైలు సురక్షితంగా నడవాలంటే, ట్రాక్ అత్యంత పటిష్ఠంగా ఉండటం చాలా ముఖ్యమైన విషయం. అందుకే నిర్మాణానికి ముందు జరిగే మట్టి పరీక్షలు() ప్రాజెక్ట్ భవిష్యత్తును నిర్ణయించే ప్రధాన దశగా భావిస్తున్నారు. సర్వే బృందాలు ప్రస్తుతం కర్నూలు సహా పలు ప్రాంతాల్లో మట్టి నమూనాలను సేకరిస్తున్నాయి. భూమి స్వరూపం అనువుగా ఉంటేనే హై-స్పీడ్ కారిడార్ డిజైన్ ఖరారు అవుతుంది. ఎక్కడ స్ట్రెయిట్ ట్రాక్‌లు వేయాలి, ఎక్కడ బ్రిడ్జిలు, సొరంగాలు అవసరమౌతాయి, ఎక్కడ ఎలివేటెడ్ మార్గం నిర్మించాలి వంటి అంశాలు పూర్తిగా మట్టి విశ్లేషణ పైనే ఆధారపడి ఉంటాయి. గరిష్ఠ వేగం 350 కిమీ అయినప్పటికీ, భద్రతా పరంగా 320 కిమీ వేగంతోనే రైళ్లు నడపాలని అధికారులు భావిస్తున్నారు. ఈ వేగాన్ని తట్టుకునేలా ప్రత్యేక హై-టెన్షన్ స్టీల్, జపాన్ HSR ప్రమాణాలతో, భూకంప నిరోధక ట్రాక్ డిజైన్‌లు వినియోగించనున్నారు. దీంతో డిపీఆర్ (Detailed Project Report) తయారీకి ముందు ఈ పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాల్సిఉంది. ప్రస్తుతం RITES అనే సంస్థ ఈ కారిడార్‌కి సంబంధించి తుది డిపీఆర్కు తుది మెరుగులు దిద్దుతోంది. ఈలోగా మట్టి నివేదికలు అందాలి. డిపీఆర్ 2026 మార్చిలోపు సిద్ధమయ్యే అవకాశం ఉంది.
ఇక హైదరాబాద్ నుండి బెంగళూరుకు 2 గంటలే
ఈ కారిడార్‌లో బుల్లెట్ రైలు పరుగు ప్రారంభమైతే, హైదరాబాద్–బెంగళూరు మధ్య ప్రస్తుతం 8 గంటలు పడుతున్న ప్రయాణం కేవలం 2 గంటలకు పడిపోతుంది. కర్నూలు నుంచి బెంగళూరు మధ్య 5.30 గంటలు పడుతున్న ప్రయాణం 1 గంట 20 నిమిషాల్లో పూర్తవుతుంది. ఇది ఐటీ ఉద్యోగులు, సాధారణ ప్రయాణికులు, రోజువారీ ప్రయాణాలు చేసే విద్యార్థులు,ఉద్యోగులకు గేమ్ చేంజర్‌గా మారనుంది. విమాన ప్రయాణం కంటే వేగంగా కాకపోయినా(ఒక రకంగా వేగవంతమే.. అన్నీ కలుపుకుని విమాన ప్రయాణం బెంగళూరుకు 4 గంటలు పడుతుంది), ఆలస్యం లేకుండా నగర కేంద్రాలకే నేరుగా కనెక్టివిటీ అందించడంలో బుల్లెట్ రైలు కీలక పాత్ర పోషిస్తుంది. ట్రావెల్ బస్సులు, ప్రైవేట్ వాహనాల వినియోగం భారీగా తగ్గి, రహదారి మీద భారం కూడా తగ్గుముఖం పడుతుంది. ఆర్థిక నిపుణుల అంచనాల ప్రకారం ఈ కారిడార్ దక్షిణ భారత పెట్టుబడులకు, భారీ పరిశ్రమల విస్తరణకు, ఐటి సెక్టార్ మొబిలిటీ పెరుగుదలకు ప్రధాన వేదిక కానుంది. నగరాల మధ్య మానవ వనరుల మార్పిడి వేగవంతమవడం వల్ల ఆర్థిక కార్యకలాపాలు మరింత చురుకుగా మారనున్నాయి. ముంబై–అహ్మదాబాద్ లైన్ తరువాత దేశంలో రెండో పెద్ద HSR(High Speed Rail) ప్రాజెక్ట్‌గా నిలిచే ఈ కారిడార్, దక్షిణ భారత అభివృద్ధి పథంలో ఓ కీలక భాగస్వామిగా నిలవనుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram