ఖననం చేసిన శిశువు మృతదేహం మాయమవ్వడం సంచలనం రేపింది.హైదరాబాద్‌లోని పంజాగుట్టలో చోటుచేసుకున్న ఈ ఘటన వైరల్ గా మారింది. కోల్‌కతాకు చెందిన రాజు మండల్, పూజ దంపతులు పాతబస్తీలోని గాందీబజార్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. నాలుగు రోజుల క్రితం పూజ బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రిలో పూజ కవలలకు జన్మనిచ్చారు.
ఆరు నెలలకే ప్రీమెచ్యూర్ డెలివరీ కావడంతో శిశువులను వైద్యులు ఎన్‌ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆదివారం తెల్లవారుజామున ఒక శిశువు ఆరోగ్యం విషమించడంతో మృతి చెందింది. కుటుంబసభ్యులు శిశువు మృతదేహాన్ని పంజగుట్ట శ్మశానవాటికకు తీసుకువచ్చి సిబ్బందికి రూ.2,500 చెల్లించి ఖననం చేశారు.
అయితే సోమవారం తెల్లవారుజామున రెండోశిశువు కూడా మృతి చెందింది. మొదటి శిశువు సమాధి పక్కనే ఖననం చేసేందుకు రెండోశిశువు మృతదేహాన్ని పంజాగుట్ట శ్మశానవాటికకు తీసుకువచ్చారు. అశ్చర్యంగా అక్కడ మొదటి శిశువు సమాధి కనిపించకపోవడం తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు షాక్‌కి గురయ్యారు. ఖననం చేసిన శిశువు మాయంపై స్మశాన వాటికలో పని చేసే మల్లేష్, జోసెఫ్‌లను ప్రశ్నించగా.. వారు పొంతన లేని సమాధానాలు చెప్పారు.
దీంతో అనుమానం వచ్చి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. మల్లేష్, జోసెఫ్‌లతో సహా ఆ స్మశాన వాటికలో పని చేసే ప్రసాద్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. శిశువు మృతదేహం ఎలా మాయమైంది? ఎవరు తీసుకెళ్లారు? ఇందులో శ్మశానవాటిక సిబ్బంది పాత్ర ఏమైనా ఉందా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
