హైదరాబాద్ లో ఇటీవల భూముల ధరలకు మెల్లగా రెక్కలు వస్తున్నాయి. ముఖ్యంగా సమీపిస్తున్న జీహెచ్ంఎంసీ కార్పోరేషన్ల ఎన్నికల నేపథ్యంలో హెచ్ఎండీఏ పరిధిలో ప్రభుత్వం పలు అభివృద్ది ప్రాజెక్టులు, రోడ్లు, ఎలివేటర్ కారిడార్లు, ఫ్లై ఓవర్ల వంటి నిర్మాణాలు, మూసీ ప్రక్షాళన, మెట్రో రెండోదశ, ఫ్యూచర్ సిటీ, ఆర్ఆర్ఆర్ పేరుతో హడావుడి చేస్తుండటం భూముల ధరలకు కొంతవరకు ఊతమిస్తుంది. దీనికి తోడుగా ప్రభుత్వ భూముల వేలంలో రాయదుర్గంలో ఎకరం భూమి ఎకరాకు రూ.237కోట్ల పలికిన వైనం రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త ఊపునిస్తుంది. అయితే రియల్టర్లు మాత్రం రియల్ ఎస్టేట్ స్తబ్ధతగా ఉందంటున్నారు.
పుంజుకుంటున్న భూముల ధరలు..
నగరంపరిధిలో కోకాపేటలో ఎకరం రూ.150 కోట్లు, రాయదుర్గంలో రూ.237 కోట్లు పలకగా, ఓల్డ్ సిటీలోని బేగంబజార్‌లో గజం ధర ఏకంగా రూ.8 లక్షలకు చేరింది. 62 గజాల స్థలాన్ని ఓ వ్యాపారి తాజాగా రూ.4.96 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ పరిణామాన్ని భూముల ధరలకు వచ్చిన హైప్ గా అధికార పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. గ్రేటర్ పరిధిలోని మోకిలా, బంజారాహిల్స్ లోని ప్రభుత్వ భూములకు ఈ నెల 29,30 తేదీలలో, జూలై 2న హెచ్ఎండీఏ వేలం నిర్వహిస్తుంది. ఈ భూముల అమ్మకాల ద్వారా రూ.1000 కోట్లకు పైగా ఆదాయం లభించవచ్చని అధికారులు అంచనా వేశారు.
మేడిపల్లి వేలంతో రూ.120కోట్ల ఆదాయం
తాజాగా బుధవారం మేడిపల్లి రెసిడెన్షియల్ లేఅవుట్‌లో HMDA నిర్వహించిన మూడో విడత ఈ-వేలం ప్లాట్లకు భారీ డిమాండ్ వచ్చింది. అక్కడ ఒక్క గజం భూమి ఏకంగా రూ.80వేలకు అమ్ముడుపోయింది. ఈ వేలంలో మొత్తం 68 ప్లాట్లకు 63 ప్లాట్ల విక్రయించిన HMDA రూ.120 కోట్ల ఆదాయం సమకూర్చుకుంది. తూర్పు హైదరాబాద్‌లో నివాస స్థలాలకు ఉన్న అధిక డిమాండ్‌ను ఇది స్పష్టం చేసింది.
29, 30తేదీలలో మోకిలాలో 100ప్లాట్లకు వేలం..
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) అత్యంత ప్రతిష్టాత్మకంగా మోకిలా ప్రాంతంలో నివాస స్థలాల కోసం భారీ ఈ-వేలాన్ని నిర్వహిస్తోంది. మోకిలలోని 100 ప్లాట్‌లకు ఈ నెల 29, 30 తేదీల్లో బిడ్డింగ్ నిర్వహించనున్నారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్ నియోపోలిస్ వంటి ఐటీ కారిడార్లకు అత్యంత సమీపంలో ఉండటంతో మోకిలా ప్రాంతం ఇప్పుడు హైదరాబాద్‌లోనే అత్యంత ప్రీమియం రియల్ ఎస్టేట్ హబ్‌గా అవతరించడంతో ఇక్కడ భూములకు డిమాండ్ పెరిగింది. ఇక్కడ ఒక్కో ప్లాట్ కనిష్టంగా 300 చదరపు గజాల నుంచి గరిష్టంగా 500 వరకు ఉన్నాయి. కనీస ధర గజానికి రూ.50 వేలుగా ప్రతిపాదించారు.
బంజారాహిల్స్ వేలంపై భారీ అంచనాలు
అలాగే బంజారాహిల్స్‌లోని 102/1, టీఎస్ నంబర్ 1/పిఅండ్ 3/పిలోని 8.24 ఎకరాల భూములను జూలై 2న వేలం వేయనున్నారు.ఈ భూములకు ఎకరానికి రూ.99 కోట్ల చొప్పున ధర నిర్ణయించారు. కోకాపేటలో అత్యధికంగా ఎకరానికి రూ.125 కోట్లు పలికిన నేపథ్యంలో బంజారాహిల్స్ భూమికి ఎకరానికి రూ.130 నుంచి రూ.150 కోట్ల వరకూ పలకవచ్చని భావిస్తున్నారు. ఇవే కాకుండా రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిల్లో ఉన్న చిన్న చిన్న బిట్లను కూడా ఈ సారి వేలంలో చేర్చనున్నారు.
