మూసీ సుందరీకరణకు కార్తీక్ రెడ్డి ఎన్‌జీటీ పిటిషన్ బ్రేక్ లు !

మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై కార్తీక్ రెడ్డి ఎన్‌జీటీ పిటిషన్ దాఖలు చేయడంతో రేవంత్ సర్కార్ ఇరకాటంలో పడింది. పర్యావరణ అనుమతులపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

విధాత, హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్‌పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్‌లో (ఎన్‌జీటీ) బీఆర్ఎస్ నాయకుడు పట్లోళ్ళ కార్తీక్ రెడ్డి వేసిన పిటీషన్ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిని ఇరకాటంలోకి నెట్టింది. మూసీ సుందరీకరణ కింద చేపట్టబోతున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖల నుండి పర్యావరణ అనుమతి తీసుకోలేదని కార్తీక్ రెడ్డి పిటీషన్‌లో పేర్కొన్నాడు. గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ మృగవాణి నేషనల్ పార్క్‌కు 10 కిలోమీటర్ల పరిధిలో ఉంది కాబట్టి అవసరమైన డీటెయిల్డ్ ప్రాజక్ట్ రిపోర్ట్ తయారు చేయలేదని, ఇతర అంశాల గురించి స్పష్టత లేదని కార్తీక్ రెడ్డి ఆరోపించారు. పర్యావరణ అనుమతులు లేకుండా ముందుకుసాగుతున్న ఈ ప్రాజెక్ట్, పర్యావరణానికి సంబంధించిన పలు చట్టాలను ఉల్లంఘిస్తుందని పిటీషన్‌లో పేర్కొనడం విశేషం.

అయితే ఎన్‌జీటీలో కేసు పడటంతో రేవంత్ ప్రభుత్వం అప్రమత్తమైంది.. పర్యావరణ అనుమతికి దరఖాస్తు చేశామని, త్వరలోనే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ (EIA) రిపోర్ట్ సిద్ధం చేస్తామని ఎన్‌జీటీకి తెలిపింది.

ఇరకాటంలో రేవంత్ సర్కార్

ఎన్‌జీటీ కేసుతో ప్రభుత్వం పూర్తిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇరకాటంలో పడింది.. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ విషయంలో కానీ, ఇతర అనుమతుల విషయంలో కానీ రేవంత్ సర్కార్ ఏలాంటి ఉదాసీనత ప్రదర్శించినా… లేక స్వలాభం కోసం ఏవైనా ఉల్లంఘనలు చేసినా ఎన్జీటీ ముందు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. పర్యావరణ ఉల్లంఘనలపై ఎన్జీటీ చర్యలకు గురి కావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మూసీ సుందరీకరణ ప్రాజెక్టు అమలు వ్యవహారం మొదటికే మోసం వచ్చే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతుంది.
హడావిడిగా మూసీ సుందరీకరణ పేరిట ఇండ్లను కూలగొట్టి, భూములు స్వాధీనం చేసుకుని పనులు కొనసాగించాలనుకున్న రేవంత్ సర్కార్ ఇప్పుడు తప్పక చట్టపరమైన ప్రక్రియను పాటించాల్సిన పరిస్థితి అనివార్యమైంది. కార్తీక్ రెడ్డి ఎన్జీటీ పిటిషన్ వల్లనే ఈ పరిస్థితి ఏర్పడటం చర్చనీయాంశమైంది.

ఇవి కూడా చదవండి :

బైక్ తో రైలును లాగేందుకు యత్నం..వైరల్ గా వీడియో
హైదరాబాద్ నాలా పనుల్లో జాప్యం..కట్టెల వంతెన వీడియో వైరల్!

Latest News