KTR : కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్.. జూబ్లీహిల్స్ తీర్పు సారంశం ఇదే : కేటీఆర్‌

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ప్రజాతీర్పు కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్‌నేనని కేటీఆర్ వ్యాఖ్య. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం కొనసాగిస్తామని స్పష్టం.

KTR : కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్.. జూబ్లీహిల్స్ తీర్పు  సారంశం ఇదే : కేటీఆర్‌

విధాత, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రజాతీర్పు తెలంగాణలో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ పార్టీ అని తేటతెల్లం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలపై పోరాటం చేసే పార్టీగా బీఆర్ఎస్ ను ప్రజలు గుర్తించారన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలపైన, అక్రమాలపైన ప్రతిపక్షంగా మా పోరాటం మేం చేశామని, ప్రజల్లో చర్చ పెట్టామన్నారు. అంతిమంగా ప్రజల తీర్పు శిరోధార్యమన్నారు. ఫలితం పట్ల మాకు నిరాశ లేదని, ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని నిలదీయడంలో మా పోరాటం అసెంబ్లీ లోపల, బయట కొనసాగిస్తామన్నారు. పార్టీ కార్యకర్తలు, గులాబీ కుటుంబ సభ్యులు నిరాశ చెందొద్దు, బాధ పడాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణ ఏర్పాటు పిదప 2014నుంచి వచ్చిన ఏడు ఉప ఎన్నికలు పాలేరు, నారాయణఖేడ్, హుజురాబాద్, హుజూర్ నగర్, నాగార్జున సాగర్, దుబ్బాక, మునుగోడులలో బీఆర్ఎస్ ఐదు సీట్లలో గెలిచిందని, కాంగ్రెస్ ఒక్కటి గెలవలేదన్నారు. మధ్యలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రెండు కార్పోరేట్ స్థానాలు గెలిచిందని..అయినా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి వచ్చిందన్న సంగతి మరువరాదన్నారు. ఉప ఎన్నికలో పార్టీ కేడర్, బీఆర్ఎస్ సోషల్ మీడియా పార్టీ ప్రచారాన్ని విజయవంతంగా కొనసాగించిందని కేటీఆర్ అభినందించారు.

ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీతలో సఫలమయ్యం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ప్రభుత్వ వైఫల్యాలపైన, హామీల అమలు, ప్రజా సమస్యలపై ఎన్నికల్లో ప్రచారం చేశామని..ప్రతిపక్షం ఎంత కవ్వించినా హుందాగా ఎన్నికలను ఎదుర్కొన్నామని కేటీఆర్ తెలిపారు. హైడ్రా, బస్తీ దవాఖానాలు, ఆటో వారి సమస్యలు, రోడ్ల దుస్థితి, శాంతిభద్రతలపైన కూడా మేం ప్రచారం చేశామన్నారు. కాంగ్రెస్ ఎగ్గొట్టిన హామీలను బాకీ కార్డులతో ఇంటింటికి తీసుకెళ్లామన్నారు. బీఆర్ఎస్ ప్రచారానికి దిగివచ్చిన సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధిపై సమీక్షలు పెట్టుకున్నారని, మైనార్టీ కోటాలో అజారుద్ధీన్ కు మంత్రి పదవి ఇచ్చారన్నారు. అలాగే మేం పదేళ్లలో 5,328కోట్లతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేశామని ప్రజలకు చెప్పామని గుర్తు చేశారు.

జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఉనికి ప్రశ్నార్ధకం

జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బీహార్ లో ఉనికి కోల్పోయే పరిస్థితి నెలకొందని, ఎన్నికల్లో గెలుపోటములు సహజం అని కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితంతో నిరాశపడాల్సిన అవసరం లేదు. తెలంగాణలో కేసీఆర్ మళ్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టే వరకూ శక్తివంచన లేకుండా కష్టపడుతాం అని కేటీఆర్ స్పష్టం చేశారు. హరీష్ రావు తండ్రి, రవీందర్ రావు అన్న చనిపోయినా కూడా వారు ఉప ఎన్నికలో బీఆర్ఎస్ కోసం కష్టపడ్డారన్నారు. ప్రజలు ఉప ఎన్నికలో కాంగ్రెస్ వైపు ఎందుకు మొగ్గు చూపారన్నదానిపై విశ్లేషణ చేసుకుంటామన్నారు. ఓటింగ్ శాతం పెరిగి ఉంటే మాకు మరింత సానుకూలంగా ఉండేదన్నారు. ఉప ఎన్నికలో మేం ఓడినా మాకు మంచి ఓటింగ్ శాతం వచ్చిందన్నారు. బీజేపీ సింగిల్ డిజిట్ కు పరిమితమై డిపాజిట్ కోల్పోయిందన్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత ప్రజల ఆలోచనలో మార్పు వచ్చిందని, వారు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారన్నారు.

10 ఉప ఎన్నికలు రావచ్చు

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ నుంచి టీఎంసీలో వెళ్లినందుకు.. ముకుల్ రాయ్ ఎమ్మెల్యే సభ్యత్వాన్ని హైకోర్టు రద్దు చేసిందని కేటీఆర్ గుర్తు చేశారు. అలాగే తెలంగాణ 10మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత పడుతుందని ఆశిస్తున్నామని, ఎన్నికల పోరాటం మాకు కొత్త కాదన్నారు. జూబ్లీహిల్స్ ఒక ఎన్నికకే కాంగ్రెస్సోళ్లు ఇంత అపసోపాలు పడ్డారు.. 10 ఎన్నికలు వస్తే రాహుల్, సోనియాని దించుతారేమోనంటూ ఎద్దేవా చేశారు.