• Telugu News
  • /Hyderabad

నకిలీఉద్యోగం.. 67 పెళ్లిళ్లతో ఘరానా మోసం

నకిలీ అధికారి.. 67 పెళ్లిళ్ల మోసం! శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో నకిలీ సీఐఎస్ఎఫ్ అధికారి అరెస్ట్. ఎఫ్ సీఐ మేనేజర్ పేరుతో మరో ఘరానా మోసం బట్టబయలు.

Reported by: Tejaswini Nanna | హైదరాబాద్​ | Apr 14, 2026, 2:07 pm IST
Read Time: 5 mins
నకిలీఉద్యోగం.. 67 పెళ్లిళ్లతో ఘరానా మోసం

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో నకిలీ సీఐఎస్ఎఫ్ (CISF) అధికారి భాగోతం బట్టబయలైంది. బాలకృష్ణ అనే వ్యక్తి సీఐఎస్ఎఫ్ యూనిఫాం వేసుకొని ఎయిర్‌పోర్ట్‌లో తరుచూ హడావిడి చేస్తూ…తాను సీఐఎస్‌ఎఫ్‌లో పనిచేస్తున్నానని అందరిని బురిడీ కొట్టించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

చేస్తున్నది నకిలీ ఉద్యోగమే.. నిజమైన ప్రభుత్వ ఉద్యోగిగా అందరిని నమ్మించి..ఏకంగా ఇప్పటివరకు 67 మంది మహిళలను పెళ్లిళ్ల పేరుతో మోసం చేసినట్లుగా వెల్లడవ్వడం మరింత సంచలనం రేపింది. మ్యాట్రిమోనీ డాట్‌కామ్‌లో పోలీస్ వేషంతో బాలకృష్ణ యువతులకు వల వేసి పెళ్లిళ్ల పేరుతో మోసాలకు పాల్పడిన వ్యవహారం కలకలం రేపుతుంది. శ్రీకాకుళానికి చెందిన బాలకృష్ణను అధికారులు అరెస్టు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరో నకిలీ ఉద్యోగి ఉచ్చు నుంచి బయటపడిన యువతి

తాజాగా పనస మధు(30) అనే యువకుడు తాను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో(Food Corporation of India) గ్రేడ్–3 టెక్నికల్ మేనేజర్‌గా చర్లపల్లిలో పనిచేస్తున్నానని నకిలీ ఐడీ కార్డు తయారు చేసుకుని ఓ యువతిని మోసం చేసిన ఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చేసింది. నకిలీ గుర్తింపు కార్డుతో బాధితురాలి కుటుంబాన్ని నమ్మించి పెళ్లి సంబంధం కుదుర్చోవడంతో పాటు పెళ్లి పేరుతో మొదట రూ.2 కోట్లు వరకట్నం డిమాండ్ చేసి తర్వాత రూ.1.5 కోట్లకు ఒప్పందం చేసుకున్నాడు. ‘ఫ్రీ వెడ్డింగ్ షూట్’ పేరుతో బాధితురాలిని తన గదికి పిలిపించి వేధించడంతో ఈ వ్యవహారంలో నిందితుడి ప్రవర్తనపై బాధితురాలికి అనుమానం పెరిగింది. ఆమె అతడి గురించి స్వయంగా విచారణ చేయగా, అతను చూపించిన ఎఫ్ సీఐ ఉద్యోగం పూర్తిగా నకిలీదని బయటపడింది. దీంతో మోసపోయానని గ్రహించిన యువతి వెంటనే పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. ఆయా ఘటనలతో మ్యాట్రిమోనియల్ పెళ్లి సంబంధాలపై మరింత అపనమ్మకం పెరిగిపోయింది.

మ్యాట్రిమోనియల్ సంబంధాలపై జాగ్రత్త!

మ్యాట్రిమోనియల్ సంబంధాల ఎంపికలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఉద్యోగం, ఆర్థిక స్థితి, వ్యక్తిగత వివరాలను పూర్తిగా ధ్రువీకరించిన తర్వాతే సంబంధాలు చూసుకోవాలని హెచ్చరించారు. అనుమానాస్పద పరిస్థితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

ఇవి కూడా చదవండి :

డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే కుట్ర: సీఎం రేవంత్ రెడ్డి
ట్రంప్ ‘నో ట్యాక్స్ ఆన్ టిప్స్’ క్యాంపెయిన్ !