మెట్రో విస్తరణకు అడ్డంకి కిషన్ రెడ్డినే : సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డే అడ్డంకి అని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. రుణాలపై డెడ్‌లైన్ కూడా విధించారు.

హైదరాబాద్ మెట్రో విస్తరణను కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డినే అడ్డుకుంటున్నారని మరోసారి సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. సోమవారం మీడియా సమావేశంలో హైదరాబాద్ మెట్రో విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు..కేంద్రం మెకాలడ్డుతున్న తీరుతెన్నులను వివరించారు. కిషన్‌రెడ్డి, కేసీఆర్‌, కేటీఆర్‌ మెట్రో ఫేజ్‌-2ను అడ్డుకుంటున్నారని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. అహ్మదాబాద్‌, విశాఖ మెట్రోకు అనుమతులిచ్చి హైదరాబాద్‌కు ఆపారని, తెలంగాణపై కేంద్రం వివక్ష కొనసాగిస్తోంది అని విమర్శించారు.

కాంగ్రెస్ హయాంలోనే మెట్రో పనులు ప్రారంభమయ్యాయని.. రూ.15వేల కోట్లతో పనులను ప్రారంభించినట్లు చెప్పారు. కేసీఆర్ వచ్చాక మెట్రో నిర్మాణంలో నిర్లక్ష్యం వహించారని విమర్శించారు. 2014 – 17 మధ్య మెట్రో పనులు పూర్తిగా ఆగిపోయాయని, కేసీఆర్ సాకులు చెప్పి మెట్రో పనులను మూడేళ్లు ఆలస్యం చేశారని మండిపడ్డారు. రూ.7వేల కోట్ల అంచనాలు పెరిగేలా చేశారన్నారు. ప్రజల అవసరాలకు తగ్గట్టు మెట్రో నిర్మాణం జరగలేదని సీఎం అన్నారు. సొంత ఆస్తులు పెంచుకోవాలనే గత పాలకులు ఆలోచించారని.. కేసీఆర్ తీరు వల్లే మెట్రో విస్తరణ ఆలస్యమైందని ఆరోపించారు.

కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే మెట్రో విస్తరణపై దృష్టి పెట్టామని వెల్లడించారు. మెట్రో సెకండ్ ఫేజ్‌ కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చామని.. 122కి.మీ. మెట్రో విస్తరణకు L&T తిరస్కరించిందన్నారు. తొలిదశ మెట్రోతోనే నష్టాలు వస్తున్నాయని L&T చెప్పిందన్నారు. ఏటా రూ.400కోట్లకు పైగా నష్టం వస్తోందని L&T చెప్పినట్లు తెలిపారు. మెట్రో రెండో దశలో భాగస్వామ్యానికి L&T నిరాకరించిందని.. L&T నుంచి మెట్రో కొంటేనే సమస్య తీరుతుందని కేంద్రం చెప్పిందన్నారు. రూ.30వేల కోట్ల మెట్రోను రూ.15వేల కోట్లకు కొనుగోలు చేశామన్నారు. ప్రస్తుతం మెట్రో నిర్మాణానికి కి.మీ.కు రూ.350కోట్లు ఖర్చవుతుందని సీఎం పేర్కొన్నారు.

IRFC రుణం బదిలీ ప్రక్రియకు అంతా సిద్ధం చేసినట్లు సీఎం తెలిపారు. రూ.84కోట్ల డాక్యుమెంట్ ఫీజు కూడా చెల్లించామన్నారు. ఈక్విటీ కింద రూ.1,400 కోట్లు జమచేశామన్నారు. రూ.13,400 కోట్లకు 4శాతం వడ్డీకి 20ఏళ్లకు ఒప్పించామని వివరించారు.మే 21న కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, మనోహర్ లాల్ ఖట్టర్ లన కలిసి కిషన్‌రెడ్డి కలిసి అడ్డుపడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ ఉండాలా? వద్దా? అని ఒత్తిడి చేశారని.. కిషన్‌రెడ్డి వల్లే రుణం బదిలీ ఆగిపోయిందంటూ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినా.. లోన్‌ డబ్బులు ఎల్‌అండ్‌టీకి ట్రాన్స్‌ఫర్‌ కాలేదు. ఐఆర్‌ఎఫ్‌సీ లోన్‌ మంజూరు చేయకుండా కిషన్‌రెడ్డి అడ్డుకున్నారని విమర్శించారు.

కిషన్ రెడ్డికి డెడ్ లైన్..

మెట్రో రుణాలపై కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి డెడ్ లైన్ పెట్టారు. ఈ రోజు సాయంత్రంలోగా గ్రాంట్ విడుదల చేయాలని, రుణ బ్యాంకుకు ఈ రోజు చివరి రోజు అని, నిధులు ఇప్పించి ఎన్ఓసీ ఇస్తే శాలువా కప్పి సన్మానిస్తాం అని, మెట్రో రెండో దశపై కేంద్రం తన నిర్ణయం చెప్పాలన్నారు. రుణ బదులు నిలిచిపోవడానికి కిషన్ రెడ్డి కారణం అని, ఎన్ఓసీ ఇస్తే రాష్ట్రమే కేంద్ర ప్రభుత్వ 50శాతం భాగస్వామ్యానికి ఒప్పుకోకపోయినా..మేమే పూర్తిచేసుకుంటామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కిషన్‌రెడ్డి నిధులు విడుదల చేయిస్తారా? లేదా? అంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మీరు కేంద్ర‌మంత్రి కాబ‌ట్టి నేను సీఎంగా అడుగుతున్నానని, మీరు మోదీతో మాట్లాడి ఒప్పించాలని కోరారు. నేను కిషన్ రెడ్డికి గౌరవం ఇచ్చానని, కేసీఆర్ అన్న‌ట్లు నేను ఎప్పుడైనా రండ అని అన్నానా? అని ప్రశ్నించారు. మీవాళ్లే నిన్ను దొంగది కాదు..దొడ్లకి రాదు అంటారని రేవంత్ పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నకిలీ అపరిచుతుడి మాదిరిగా రెచ్చిపోవడం హాస్యాస్పదం అన్నారు.

మోదీ రాజీనామా చేస్తే…నేను చేస్తా

హైదరాబాద్‌కు 2023లోనే ట్రిపుల్‌ ఆర్‌ను కేంద్రం ప్రకటించిందని.. ఇంకా సాకారం కాలేదని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ హామీ ఇచ్చి నెరవేర్చలేదు అని, ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని అన్నారని…వాటన్నింటికి బాధ్యత వహిస్తూ మోదీ రాజీనామా చేస్తే..కిషన్ రెడ్డి అడిగినట్లుగా నేను సీఎం పదవికి రాజీనామా చేస్తానని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. నేనే మోదీ ప్రభుత్వం మాదిరిగా ఇతరులపై ఆధారపడి ప్రభుత్వాన్ని నడపడం లేదని, సంపూర్ణ మెజార్టీతో సీఎంగా కొనసాగుతున్నానని గుర్తు చేశారు.

 

Latest News